సిద్దిపేట జోన్/మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: అక్షయ తృతీయ రోజున బంగారం కొని, దాన్ని గౌరీదేవి ముందు పెట్టి పూజిస్తే ఐదోతనంతోపాటు ఐశ్వర్యం సిద్ధిస్తుందనే నమ్మకం ప్రజల్లో పెరిగిపోయింది. అందువల్లే ప్రతి అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఈసారి అక్షయ తృతీయకు శుక్రవారం, బసవజయంతి, పెళ్లిళ్ల సీజన్ కూడా కలసి రావడంతో జిల్లాలో పసిడి కొనుగోళ్లు పరవళ్లు తొక్కాయి. జ్యూయలరీ షాపులన్నీ కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. మరోవైపు బంగారం ధర కూడా రూ. 29 వేల నుంచి రూ.30 వేలను దాటి వెళ్లిపోయింది. అయినప్పటికీ కొనుగోలు దారులు జ్యూయలరీ షాపుల ఎదుట బారులు తీరడంతో శుక్రవారం జిల్లాలో 50 కిలోల ఆభరణాలు అమ్ముడయినట్లు సమాచారం.
కొనుగోళ్లు ఫుల్
జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, రామాయంపేట, గజ్వేల్, పటాన్‌చెరు, నారాయణఖేడ్, సదాశివపేట, రామచంద్రాపురంలోని జువెలరీ షాపులన్నీ అక్షయ తృతీయ రోజైన శుక్రవారం కిటకిటలాడాయి. పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసిరావడంతో కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగాయి. ఒక్క మెదక్ పట్టణంలోనే రూ.8 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఇక జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనూ చెప్పకోదగ్గ స్థాయిలోనే కొనుగోళ్లు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో నిన్నటివరకూ వెలవెలబోయిన జువెలరీషాపులన్నీ కిటకిటలాడాయి. వ్యాపారం బాగా సాగడంతో వ్యాపారులు కూడా ఆనందంలో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు ప్రత్యేక డిస్కౌంట్‌లిస్తూ కొనుగోలుదారులను ఆకర్షించడంతో అక్షయ తృతీయ సెంటిమెంట్ అందరికీ కలిసి వచ్చింది.
అక్షయ తృతీయ అదుర్స్
Published Sat, May 3 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM
Advertisement