jewellery shops
-
చుక్కల్లో బంగారం రేట్లు.. తక్కువ ధరలో ఎక్కువ నగలకు ప్రత్యామ్నాయం ఇదే!
పాత గుంటూరు: ఆభరణాలంటే మక్కువ చూపని వనితలు ఉండరు. ప్రతి మహిళకు వివిధ రకాల ఆభరణాలు ధరించి తోటి వారి ముందు హుందాగా కనిపించాలనే కోరిక ఉంటుంది. ముఖ్యంగా పండుగలకు, పెళ్లిళ్ల సమయంలో ప్రత్యేక ఆభరణాలు వేసుకొని ముస్తాబవడానికి ఎంతో ప్రాధాన్య ఇస్తుంటారు. ధనవంతులు బంగారు, వెండి వస్తువులు కొనుగోలుకు ముందుకెళ్తుండగా ఆర్ధిక పరిస్ధితి అనుకూలించని వారు బంగారు ఆభరణాలు ధరించి ముచ్చట తీర్చుకోవాలంటే చాలా డబ్బులు కావాలి. అది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అందుకే మహిళలు ప్రత్యామ్నాయంగా రోల్డ్ గోల్డ్ వస్తువుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇవి కూడా అచ్చం బంగారు వస్తువుల్లాగే కనిపించడంతో చాలా మంది వివిధ రకాల మోడళ్ల వస్తువులను కొనుగోలు చేసి ముచ్చట తీర్చుకుంటున్నారు. ధనవంతులు కూడా బంగారంతో పాటు రోజువారీ కోసం రోల్డ్ గోల్డ్ వస్తువులపై మొగ్గు చూపుతున్నారు. మహిళల అభిరుచిని దృష్టిలో వుంచుకొని వ్యాపారులు కూడా లేటెస్ట్ మోడళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పలు గోల్డ్ షోరూమ్‌లలో సైతం రోల్డ్ గోల్డ్ ఆభరణాలను విక్రయిస్తున్నారు. దీంతో వీరి వ్యాపా రం మూడు చైన్లు, ఆరు నెక్లెస్ల్లా వెలిగిపోతోంది. (చదవండి: ఇంట్లో ఈ గాడ్జెట్ ఉంటే కీటకాలు పరార్!) పండుగ సమయాల్లో విక్రయాల జోరు పండుగ సమయాల్లో రోల్డ్ గోల్డ్ ఆభరణాల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. నగరంలోని ప్రతి దుకాణం వినియోగదారులతో కళకళలాడుతుంది. చిన్నారులు, యువతులు, పెద్దవారు ఇలా అంతా వారి కి కావల్సిన వస్త్రాలు, ఇతర సామగ్రితో పాటు రోల్డ్ గోల్డ్ ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వ్యాపారస్తులు కూడా వివిధ రకాల మోడళ్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో జరిగే కార్యక్రమాల్లో విద్యార్ధినులు లేటెస్ట్ రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ వేసుకుని సందడి చేస్తున్నారు. పుట్టగొడుగుల్లా దుకాణాలు... ప్రస్తుతం బంగారం, వెండి ధరలు చుక్కలను అంటుతున్న సమయంలో రోల్డ్ గోల్డ్ వన్‌గ్రామ్ బంగారు వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నగరంలో 50 వరకు రోల్డ్ గోల్డ్ దుకాణాలు ఉన్నాయి. వాటిలో ఒరిజినల్ బంగారు వస్తువులను మైమరిపించే రీతిలో రోల్డ్ గోల్డ్ వన్‌గ్రామ్ బంగారు ఆభరణాలు అందుబాటులో దొరుకుతున్నాయి. ముఖ్యంగా అన్ని వర్గాల మహిళలు వినియోగించే చైన్లు, చెవిదుద్దులు, నెక్లెస్‌లు, హారాలు, గాజులు, తదితర వస్తువులు లభ్యమవుతున్నాయి. సాధారణ రోజుల్లో నెలకు రూ.50 లక్షలు వరకు వ్యాపారం జరుగుతుండగా, పెళ్లిళ్లు, పండుగల సీజన్లో కోటికి పైగానే వ్యాపారం జరుగుతుంది. ధరలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వన్‌గ్రామ్ గోల్డ్ వస్తువులు వివిధ రకాలలో ఉంటాయి. వాటి నాణ్యతను బట్టి ధరలు ఉంటాయి. చెవిబుట్టలు రకాన్ని బట్టి రూ. 250 నుంచి 2500 వరకు ఉంటాయి. నెక్లెస్‌లు రూ. 50 నుంచి 5 వేల వరకు ఉంటుంది. చైన్లు రూ.100 నుంచి 20 వేల వరకు, గాజులు రూ.100 నుంచి 3వేల వరకు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అవసరమయ్యే వడ్డానాలు రూ.400 నుంచి 10 వేల వరకు ఉంటాయి. (చదవండి: CM Jagan: థాంక్యూ సీఎం సార్ !) వ్యాపారం బాగా పెరిగింది రోల్డ్ గోల్డ్ వ్యాపారం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. దుకాణాల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఒకప్పుడు జిల్లా కేంద్రానికి చెందిన మహిళలే ఎక్కువగా వచ్చేవారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు కూడా ఈ ఆభరణాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. సీజన్ బట్టి మోడళ్లను అందుబాటులో ఉంచుతున్నాం. – రమణారెడ్డి, షోరూం మేనేజరు -
రూ. 900 డ్రెస్‌ను 50 రూపాయలకే కొన్నా: నిహారిక
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్.. నిహారిక కొణిదెల. తెర పరిచయానికి ముందే ఫ్యాషన్ ఐకాన్‌గా గ్లామర్ ప్రపంచానికి ఆమె సుపరిచితం. ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను ప్రతిబింబించే బ్రాండ్సే ఇవి.. కలశ ఫైన్ జ్యూయెల్స్.. కేవలం రూ. 40 పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం ఇప్పుడు కోట్ల సామ్రాజ్యంగా మారింది. బంగారు ఆభరణాల వ్యాపారంలో వీరిది 118 సంవత్సరాల అనుభవం. 1901లో శ్రీచంద్ర అంజయ్య పరమేశ్వర్ పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి, నెలకు రూ. 15 జీతంతో ఓ బంగారు ఆభరణాల దుకాణంలో చేరాడు. తర్వాత నలభై రూపాయలు పోగుచేసి స్వయంగా వ్యాపారం ప్రారంభించాడు. అందమైన ఆభరణాల డిజైన్స్ అందిస్తూ వ్యాపారంలో దినదినాభివృద్ధి సాధించాడు. అప్పటి వరకు ‘చంద్ర అంజయ్య పరమేశ్వర్’ పేరుమీద ఉన్న దుకాణాన్ని ఈ మధ్యనే 2017లో ‘కలశ ఫైన్ జ్యూయెల్స్’గా మార్చారు. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని వారి మూడోతరం, నాలుగోతరం వారసులు నడిపిస్తున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడల్లో బ్రాంచీలు ఉన్నాయి. ప్రత్యూష గరిమెళ్ల.. హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూష గరిమెళ్ల.. చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కన్నది. ఆ ఆసక్తితోనే ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. అనంతరం 2013లో హైదరాబాద్‌లో తన పేరుమీదే ఓ బొటిక్ ప్రారంభించింది. అతి సూక్ష్మమైన అల్లికలతో వస్త్రాలకు అందాన్ని అద్దడమే ఆమె బ్రాండ్ వాల్యూ. జర్దోసీ, సీక్వెన్స్, గోటా పట్టి వంటి అల్లికలు ప్రత్యూష డిజైన్స్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. చాలామంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్‌ను చేసింది. ధర కూడా డిజైన్‌ను బట్టే. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్ అన్నిటిలోనూ ఈ డిజైన్స్ లభిస్తాయి. బేరం బాగా ఆడతా.. ఒకసారి టెన్త్‌క్లాస్‌లో ఢిల్లీ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఖాన్బజార్లో రూ. 900 డ్రస్‌ను రూ. 50కే కొన్నా. అది కూడా గంటసేపు బేరం ఆడి. ఇప్పుడు బేరం ఆడటం కొంచెం తగ్గించా. – నిహారిక కొణిదెల డ్రెస్ డిజైనర్: ప్రత్యూష గరిమెళ్ల ధర:రూ. 44,800 జ్యూయెలరీ కలశ ఫైన్ జ్యూయెల్స్ ధర:ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
బంగారం దుకాణాలు కళకళ
-
పెళ్లి సందడి
‘పెళ్లి కళ వచ్చేసిందే బాల... పల్లకీని తెచ్చేసిందే బాల.. హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా.. ముచ్చటగా మేళం ఉందా ఆజా ఆజా.. తద్దినక తాళం ఉంది ఆజా ఆజా.. మంటపం రమ్మంటుంది ఆజా ఆజా.. జంటపడు వేళయ్యింది ఆజా ఆజా’.. ప్రేమించుకుందాం రా సినిమాలోని ఈ పాట ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్మోగుతోంది. పెళ్లి సందడి మొదలు కాగా.. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు వేలాది వివాహాలు ఖరారయ్యాయి. ఇప్పటికే ఫంక్షన్ హాళ్ల బుకింగ్ క్లోజ్ కాగా.. పెళ్లి సామగ్రి కొనుగోళ్లతో ఆయా షాపులు కిటకిటలాడుతున్నాయి. సాక్షి, వరంగల్ రూరల్: కార్తీక మాసం మొదటి పక్షం రోజులు గురుపాఢ్యమి ఉండటంతో వివాహ ముహూర్తాలు పెట్టే అవకాశం లేకుండా పోయింది. ఈ నెల 12వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పెళ్లి ముహూర్తాలకు అనువైన రోజులుగా వేదపండితులు చెబుతుండటంతో జిల్లాలో పెళ్లిసందడి మొదలైంది. డిసెంబర్ 1 నుంచి 2018 ఫిబ్రవరి 16వ వరకు శుక్రపాఢ్యమి కొనసాగుతుండటంతో పెళ్లి ముహూర్తాలు లేకుండా పోయాయి. దీంతో పెళ్లి సంబంధాలు ఒకే చేసుకున్న వారు ఈ నెల 30వ తేదీ వరకే చేయాలని నిర్ణయించుకున్నారు. అందులోనూ 23, 24, 25, 26, 29, 30 తేదీల్లో శుభ మూహూర్తాలు ఉండటంతో వాటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడు నెలల వరకు వివాహ ముహూర్తాలు లేకపోవడంతో ఎంత కష్టమైన పెళ్లి చేద్దాం.. అని కొంత మంది నిర్ణయించుకుంటున్నారు. సమయానికి డబ్బులు అందకున్న అప్పు తెచ్చి వివాహాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ముహూర్తాలలో దాదాపు వెయ్యి నుంచి 2 వేలకు పైగా వివాహాలు జరుగనున్నాయి. అన్నింటికీ డిమాండ్.. రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు ఉండటంతో కల్యాణ మండపాలు, గార్డెన్లు, ఫంక్షన్ హాల్లు, క్యాటరింగ్, ఫొటో వీడియో, అయ్యగార్లకు, టెంట్ హౌజ్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రముఖ కల్యాణ మండపాలతో పాటు చిన్న, మ«ధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఫంక్షన్ హాల్స్, ట్రావెల్స్, ప్లవర్స్ డెకరేషన్ ట్రూప్స్, బ్యాండ్ వాలలను ముందుగానే రిజర్వు చేసుకున్నారు. చిన్న పెద్ద పెద్ద హోటల్స్ రూమ్స్ ఇప్పటికే హౌజ్‌ఫుల్ అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 150కి పైగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు బిజీబిజీగా ఉన్నాయి. పెళ్లి ముహూర్తాల రోజున బుక్ చేద్దామంటే డేట్స్ ఖాళీలేవని కస్టమర్లకు చెబుతున్నారు. ముచ్చటైన వేదికలు... పెళ్లికి గ్రాండ్ లుక్ తీసుకురావడంలో ఫంక్షన్ హాళ్లదే కీలక పాత్ర. ఖరీదైన కల్యాణ మండపాలు, స్టార్ హోటల్స్ కాన్ఫరెన్స్ హాళ్లు ఇందుకు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి. పట్టణాల్లో ఇంక కొంత మంది అయితే పెద్ద గ్రౌండ్లను ఎంచుకుంటున్నారు. అపురూపమైన సెట్టింగ్‌లు, ఎక్కడలేని విధంగా ప్రత్యేకంగా డెకరేట్ చేసుకోవడం ఇప్పుడు ఎక్కువగా కన్పిస్తోంది. ఇందుకు ఎంత ఖర్చు పెట్టడానికైన వెనుకాడటం లేదు. సెట్టింగ్‌లు వేసేందుకు హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల నుంచి ఆర్ట్ డైరెక్టర్లను కూడ రప్పిస్తున్నారు. ఎల్ఈడీ టీవీలు, స్క్రీన్లు ఏర్పాటు చేసి, వివాహ వేడుకను దూరంగా కూర్చున్నవారు, డిన్నర్ హాల్లో ఉన్న వారు సైతం ఎంతో క్లోజ్‌గా వీక్షించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్సులు, రైళ్ల పైనా.. పెళ్లిళ్ల ప్రభావం.. ఈ పెళ్లి ముహూర్తాలతో బస్సులు రైల్వే టికెట్లు ఇప్పటికే చాలా వరకు రిజర్వేషన్ అయిపోయాయి. రైళ్లు రద్దీగా నడుస్తున్నాయి. ఏదేమైనా శుభముహూర్తాల పుణ్యమా అంటూ ట్రావెల్స్ కార్లు బిజీ అయిపోయాయి. రెట్టింపైన ధరలు.. పెళ్లి ముహూర్తాలు ముంచుకురావడంతో అన్ని ధరలపై ప్రభావం పడింది. సాధారణంగా ఒక పెళ్లికి రూ. 10వేలు తీసుకునే బ్యాండ్, డీజే వారు ఈ నెల అధికంగా పెళ్లి ముహూర్తాలు ఉండటంతో బ్యాండ్ వాలా రూ. 13 వేల వరకు తీసుకుంటున్నారు. ఒక్కో పురోహితుడు రెండు నుంచి మూడు పెళ్లిళ్లు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమచారం. సాధారణ సమయాల్లో ఉన్నా ఫంక్షన్ హాల్ల అద్దె 25 శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నారు. తర్వాత ముహూర్తాలు ఫిబ్రవరిలోనే.. అక్టోబర్ 10వ తేదీ వరకు వివాహాలు జరిగాయి. మళ్లీ ఈ నెల 23, 24, 25, 26, 29, 30 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఉన్నాయి. శుక్రపాఢ్యమి వచ్చింది. అందుకే ముహూర్తాలు లేవు. జిల్లాల్లో దాదాపు వెయ్యికి పైగా జంటలు ఒకటి కానున్నారు. – రాజ్‌కుమార్ శాస్త్రి, వరంగల్ వివాహాలకు అనువైన రోజులివి.. ఈ నెల 23 నుంచి వివాహాలకు మంచి ఘడియలు ఉన్నాయి. 30వ తేదీ నుంచి 2018 ఫిబ్రవరి 17వ తేదీ వరకు శుక్రపాఢ్యమి కొనసాగుతుంది. అందుకే చాలా మంది ఈ నెలలోనే వివాహం జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. – వి. రామచంద్రయ్యశర్మ, పురోహితులు బంగారం కొనుగోళ్లు పుంజుకున్నాయి... వివాహ ముహూర్తాలు వరుసగా ఉండటంతో బులియన్ మార్కెట్లో బంగారం కొనుగోళ్లు పుంజు కున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధించిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో చాలా కాలం నుంచి బంగారం కొనుగోళ్లు సన్నగిళ్లాయి. అయితే కార్తీకమాసం అనంతరం పెళ్లిళ్లు, శుభ ముహూర్తాలు ఉండటంతో కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈనెల 23 నుంచి వరుసగా కళ్యాణాలు ఉండటంతో బంగారం అమ్మకాలు జరుగుతున్నాయి. – పోకల లింగయ్య, పోకల లింగయ్య జువెలర్స్ యజమాని, బులియన్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, జనగామ. ముందే బుకింగ్... ఈ నెల 23, 24 తేదీలకు నెల రోజుల ముందే ఫంక్షన్ హాల్ బుకింగ్ అయింది. హాల్ కోసం చాలా మంది తిరిగి పోతున్నారు. నెల పది రోజుల సమయం తరువాత పెళ్లిళ్లు అవుతుండటంతో డిమాండ్ బాగా ఉంది. – రమేష్ రెడ్డి, భారత్ ఫంక్షన్ హాల్, భూపాలపల్లి ఎనిమిది కార్డులు వచ్చాయి.. ఈ నెల 23, 24 తేదీలకు సంబంధించిన పెళ్లి కార్డులు 8 కార్డులు వచ్చాయి. ఇంక దాదాపు 10 మంది దూరపు బంధువులు ఫోన్లు, వాట్సప్ ద్వారా ఆహ్వానించారు. అన్నింటికి అటెండ్ కావడం అంటే కొంత కష్టంగానే ఉంది. కానీ తప్పని పరిస్థితిలో అందరు దగ్గరి బంధువులు, స్నేహితులు కావడంతో నేను, మా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు వేరు చేసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇంక సమయం ఉంది. కాబట్టి మరికొన్ని కార్డులు వచ్చే అవకాశం ఉంది. – ఆడెపు రవీందర్, వరంగల్ -
బంగారు దుకాణంలో చోరీకి యత్నం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని ట్రంకురోడ్డులోని కుమార్ జ్యువెలరీస్‌లో శనివారం వేకువన గుర్తుతెలియని దుండగుడు చోరీకి యత్నించాడు. షట్టర్‌ను పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగుడు ఆభరణాలను వెతికే క్రమంలో అలారమ్ మోగడంతో పరారయ్యాడు. పోలీసుల సమాచారం మేరకు....కామాటివీధికి చెందిన దేవిశెట్టి వెంకటసురేంద్రకుమార్ ట్రంకురోడ్డులో కుమార్ జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నారు. దుకాణంలో అధునాతన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, మోషన్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. సీసీ కెమెరాల పరిధిలో కదలికలు, తాళాలు పగులగొట్టే ప్రయత్నాలు జరిగితే రికార్డు కావడమే కాకుండా అలారమ్ మోగుతుంది. రోజూలాగే గురువారం రాత్రి 10గంటలకు దుకాణం మూసివేశారు. వాచ్మెన్ వెంకటకృష్ణయ్య దుకాణం బయట విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం వేకువన 2.30 నుంచి 3 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగుడు షాప్‌పైన(మూడోఫ్లోర్) షట్టర్‌ను కటింగ్‌ప్లేయర్, సుత్తి, స్పానర్ల సాయంతో పగులగొట్టాడు. అనంతరం కొంతభాగం పైకెత్తి లోనికి ప్రవేశించాడు. అనంతరం ప్రతి గదిని సోదా చేస్తూ కింద ఫ్లోర్లో ఆభరణాలు విక్రయించే కౌంటర్ వద్దకు వచ్చేసరికి అలారమ్ మోగింది. దీంతో వాచ్మెన్ వెంకటకృష్ణయ్య అప్రమత్తమై పెద్దగా కేకలువేయడం గమనించిన దుండగుడు దుకాణం పైభాగానికి చేరుకుని షట్టర్ కింద నుంచి పరారయ్యాడు. అలారం మోగిన ఘటనపై వాచ్మెన్ అందించిన సమాచారంతో సురేంద్రకుమార్, ఆయన సోదరుడు హుటాహుటిన షాపు వద్దకు చేరుకున్నారు. తలుపులు తెరచి చూడగా బంగారు, వెండి ఆభరణాలు ఎక్కడివి అక్కడే ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. చోరీకి యత్నంపై మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే అలారం మోగడంపై సమాచారం అందుకున్న రాత్రి గస్తీ సిబ్బంది నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ కుమార్ జ్యువెలరీస్ దుకాణాన్ని నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, మూడో నగర, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు బీ పాపారావు, షేక్ బాజీజాన్‌సైదా పరిశీలించారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. అనంతరం పోలీసు అధికారులు సీసీఫుటేజ్‌లను పరిశీలించారు. ïఫుటేజ్‌ల్లో నిందితుడు రెండు చేతులకు గ్లౌజ్‌లు ధరించి సెల్‌ఫోను లైట్ సాయంతో చోరీకి యత్నించడం కనిపించింది. దీంతో మూడో నగర పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని దుకాణాలపై నుంచి నిందితుడు కుమార్ జ్యువెలరీస్ సమీపంలోని మూడో దుకాణంపై నుంచి షాపు వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా నిందితుడు రెక్కీనిర్వహించి చోరికి యత్నించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు పాతనేరస్తుడే జ్యువెలరీస్ దుకాణంలో చోరీకి యత్నించిన నిందితుడు విశాఖపట్నానికి చెందిన పాతనేరçస్తుడిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. నిందితుడితో పాటు అతని సోదరుడు గతంలో ఈ తరహానేరాలకు పాల్పడుతూ పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లినట్లు తెలిసింది. గతంలోనూ నిందితుడు ఇదే తరహా నేరానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం చోరీకియత్నించిన దుకాణానికి ఆనుకుని ఉన్న పీటర్ఇంగ్లాడ్ షోరూమ్‌లోనూ దొంగతనానికి యత్నించినట్లు సమాచారం త్వరితగతిన నిందితుడ్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. -
17వరకు బంగారు దుకాణాలు బంద్
చార్మినార్: అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (జెమ్స్ అండ్ జువెల్లర్స్ ఫెడరేషన్-జీజేఎఫ్) పిలుపు మేరకు పాతబస్తీలోని బంగారం వ్యాపారస్తుల బంద్ ఈనెల 17 వరకు కొనసాగనుంది. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన బంద్ మొదట్లో మూడు రోజుల వరకు మాత్రమేనని ప్రకటించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం వీరి సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాకపోవడంతో ఈ నెల 7వ తేదీ వరకు బంద్‌ను పొడిగించారు. అప్పటికీ... ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో ఈ నెల 17వ తేదీ వరకు ఆందోళన కొనసాగించాలని జీజేఎఫ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం కూడా పాతబస్తీలోని బంగారం వ్యాపారస్తులు బంద్ పాటించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధింపును పాతబస్తీ బంగారు ఆభరణాల వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
నగల దుకాణాలపై ఐటీ దాడులు
బుచ్చిరెడ్డిపాలెం : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని బంగారు ఆభరణాల దుకాణాలపై ఆదాయ పన్నుశాఖ(ఐటీ) అధికారులు దాడులు సాగుతున్నాయి. దాదాపు 30 మంది అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి బుధవారం మధ్యాహ్నం నుంచి పట్టణంలోని అన్ని నగల దుకాణాల్లోనూ సోదాలు చేపట్టారు. ఇందుకు సంబంధించి అధికారులు మీడియాకు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. సాయంత్రం వరకు దాడులు కొనసాగుతాయని తెలుస్తోంది. -
వెయ్యి జ్యువెలరీ షాప్‌ల బంద్
అబిడ్స్: కేంద్ర ప్రభుత్వ కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా గ్రేటర్ హైదరాబాద్‌లోని జ్యువెలరీ దుకాణాలు మూతపడ్డాయి. ఆలిండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫెడరేషన్ పిలుపు మేరకు జంటనగరాల్లో దాదాపు వెయ్యి దుకాణదారులు బుధవారం బంద్‌లో పాల్గొన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా రెండు లక్షలకు పైగా జ్యువెలరీ కొనుగోలు చేసిన పక్షంలో తప్పనిసరిగా పాన్‌కార్డ్ వివరాలు దుకాణదారుడికి తెలపాలని నిబంధన పెట్టారు. దీనిని వ్యతిరేకిస్తున్న జ్యువెలరీ దుకాణాల యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో 5 లక్షలకు పైగా జ్యువెలరీ కొనుగోలు చేసిన సమయంలో పాన్‌కార్డ్ వివరాల నిబంధన ఉండగా, తాము రూ.10 లక్షలకు పైగా కొన్నవారికే వర్తింపజేయాలని కోరుతున్నామని... ఇవన్నీ వదిలేసి కేవలం రూ. 2 లక్షలకు నిబంధనను కుదించడం తమను ఇబ్బందులకు గురి చేయాడానికే అని వ్యాపారులు నిరసనకు దిగారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజుకు దాదాపు రూ.100 కోట్ల వరకు జ్యువెలరీ వ్యాపారాలు జరుగుతున్నాయి. జ్యువెలరీ షాపుల బంద్‌తో అటు ప్రభుత్వానికి, ఇటు వ్యాపారులకు ఒక్కరోజులోనే భారీ నష్టాలు వచ్చాయి. వారికి కార్డులే ఉండవు కదా... కేంద్ర ప్రభుత్వం వెంటనే రూ. 2 లక్షల నిబంధనను ఎత్తివేయకుంటే జ్యువెలరీ వ్యాపారులంతా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ట్విన్సిటీస్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫెడరేషన్ అధ్యక్షుడు కైలాష్ చరణ్, కార్యదర్శి ప్రవీణ్ అగర్వాల్ హెచ్చరించారు. బుధవారం బంద్ సందర్భంగా వారు సాక్షితో మాట్లాడుతూ... నేడు సామాన్యుడు సైతం పెళ్లి చేయాలనుకుంటే రూ.4 నుంచి రూ 5 లక్షల వరకు బంగారు నగలను కొనుగోలు చేస్తున్నారని అయితే వారి వద్ద మాత్రం పాన్‌కార్డ్‌లు లేవని గుర్తుచేశారు. ఉన్నత వర్గాల కోసం రూ.10 లక్షలకు పైగా నిబంధనను వర్తింపజేస్తే వ్యాపారులకు, ప్రభుత్వానికి ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. -
స్వర్ణ కాంతులు..
నేడు దంతెరాస్... నగరంలో ముస్తాబైన జ్యువెలరీ షాపులు పెరగనున్న స్వర్ణాభరణాల విక్రయాలు సందడిగా మారనున్న గోల్డ్ మార్కెట్లు 20 శాతం వ్యాపారం పెరుగుతుందని అంచనాలు సిటీబ్యూరో: మహానగరం స్వర్ణకాంతులు సంతరించుకుంటోంది. అంగరంగవైభవంగా ఐదు రోజులపాటు జరిగే దీపావళి పర్వదినం తొలి రోజున(సోమవారం)వచ్చే దంతెరాస్(ధన త్రయోదశి)కు...నగరంలోని ప్రతి ఇళ్లు, ప్రతి దుకాణం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. కొత్త అందాలు సంతరించుకుంటున్నాయి. పురాణేతిహాసాల ప్రకారం..పాలసముద్రం చిలికినపుడు దంతెరాస్ రోజున శ్రీమహాలక్ష్మి అవతరించింది. లక్ష్మీదేవిని ఈ రోజున యథాశక్తి పూజిస్తే అనంత శుభాలు, అష్టైశ్వర్యాలు సమకూరుతాయని, లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే క్రమంలో ఎంతో కొంత సువర్ణాన్ని కొనుగోలు చేస్తే సర్వశుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇదే విశ్వాసంతో ఉన్న మహిళలకు నగరంలోని ప్రముఖ స్వర్ణ, వజ్రాభరణాల దుకాణాలు పలు ఆకర్షణీయమైన ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. బంగారం ధర ఎక్కువైనా నాణ్యత, మన్నిక, ఆకర్షణ, హోదాకు చిహ్నం అని భావిస్తుండడంతో పలువురు మహిళలు, ఉద్యోగులు తమ స్తోమతను బట్టి స్వర్ణాభరణాల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. దీంతో నగరంలోని అబిడ్స్, కోఠి, అమీర్‌పేట్, బషీర్‌బాగ్, బంజారాహిల్స్,చార్మినార్, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్ తది తర ప్రాంతాల్లో ఉన్న బంగారు, వజ్రాభరణాల దుకాణాలు ప్ర త్యేక అమ్మకాలకు సిద్ధమయ్యా యి. వినియోగదారుల సందడితో నేటి నుంచి దుకాణాలు కిటకిటలాడే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ధనలక్ష్మి పూజావిధానంలో నూతనంగా కొనుగోలు చేసిన స్వర్ణాభరణాలకు విశేష ప్రాధాన్యత ఉంటుందని వేదపండితులు సైతం సెలవిస్తుండడంతో ఆభరణాల అమ్మకాలు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం బంగా రం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం(పదిగ్రాములు) కు రూ.26 వేలు, 22 క్యారెట్ల బంగారం(పదిగ్రాములు)కు రూ.24,310 ఉందని వ్యాపారులు తెలిపారు. రోజురోజుకూ ధరవరల్లో మార్పులు అనివార్యమని చెప్పారు. మహానగర వ్యాప్తంగా వజ్రాభరణాల, స్వర్ణాభరణాల వ్యాపా రం ఈ దీపావళి పర్వదినం సందర్భంగా సుమారు రూ.50 కోట్లకు పైమాటేనని తెలి పారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యుడు సతమౌతున్నప్పటికీ దంతెరాస్ సెంటిమెంట్‌ను గౌరవించేవారూ లేకపోలేదని.. దీంతో గతేడాదితో పోలిస్తే బంగారం, ఆభరణాల అమ్మకాల్లో సుమారు 20 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నామన్నారు. ఇక ఆదివారం రాత్రి నుంచే పలు బంగారం దుకాణాల్లో సందడి కన్పిం చింది. షాపులను ప్రత్యేకంగా అలంకరించడం..ఆఫర్లు ప్రకటించడం..వెరైటీ ఆభరణాలు తయారు చేయడం ద్వారా ఆకర్షిస్తున్నారు. -
‘అక్షయ’ అమ్మకాలు.. జిగేల్!
* కిటకిటలాడిన ఆభరణాల దుకాణాలు * ఆశించిన స్థాయిలో అమ్మకాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆభరణాల దుకాణాల్లో మంగళవారం అక్షయ తృతీయ జోష్ కనిపించింది. కిక్కిరిసిన కస్టమర్లతో దుకాణాలు మెరిసిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో బంగారానికి ప్రధాన మార్కెట్లు అయిన సిద్ధిఅంబర్ బజార్, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్లు కస్టమర్లతో కళకళలాడాయి. గతేడాది అక్షయ తృతీయ సమయంలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.30 వేలుగా ఉంది. ఇప్పుడు రూ.27 వేలకు రావడం కూడా పుత్తడి అమ్మకాలకు ఊపునిచ్చింది. దీనికితోడు కంపెనీల ఆకర్షణీయ ఆఫర్లు కూడా కస్టమర్లకు కలిసొచ్చింది. ఆభరణాలతోపాటు బంగారు నాణేలను వినియోగదార్లు కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా 10 గ్రాములకు రూ.100 ధర తగ్గడం ఇక్కడ కొసమెరుపు. అమ్మకాల్లో 30 శాతం దాకా వృద్ధి.. కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న పసిడి మార్కెట్లో అక్షయ తృతీయ జోష్ ప్రస్ఫుటంగా కనిపించింది. కస్టమర్లు తమ సెంటిమెంటు కొనసాగించడంతో గతేడాది అక్షయతో పోలిస్తే అమ్మకాల్లో 30 శాతం దాకా వృద్ధి నమోదైంది. ధర స్థిరంగా ఉండడం కూడా కలిసొచ్చిందని కళ్యాణ్ జువెల్లర్స్ మార్కెటింగ్, ఆపరేషన్స్ ఈడీ రమేశ్ కళ్యాణరామన్ తెలిపారు. 2014తో పోలిస్తే 30 శాతం అధికంగా అమ్మకాలు జరిపినట్టు వెల్లడించారు. బ్రైడల్ జువెల్లరీ విషయంలో పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్‌లు నమోదయ్యాయని వివరించారు. 2015లో పుత్తడి గిరాకీ గణనీయంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మార్చిలో 125 టన్నుల బంగారం భారత్‌కు దిగుమతి అయింది. గతేడాదితో పోలిస్తే ఇది రెండింతలపైమాటే. అక్షయ అమ్మకాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని జెమ్స్, జువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ పంకజ్ పరేఖ్ అన్నారు. ముందస్తు బుకింగ్‌లు.. ఆభరణాల కొనుగోళ్లలో ఇప్పుడు కొత్త ట్రెండ్ జోరందుకుంది. ముందస్తు బుకింగ్‌లకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. తమకు అనుకూల సమయంలో దుకాణానికి వెళ్లి ఆభరణాలను ఎంచుకుని చెల్లింపులు జరుపుతున్నారు. డెలివరీ మాత్రం అక్షయ తృతీయ రోజు తీసుకుంటున్నారు. అక్షయ రోజున రద్దీ ఉండడంతో ఎంపిక చేసుకోవడానికి సమయం ఎక్కువగా ఉండదు. దీనికితోడు ఆభరణాల కంపెనీలు సైతం ముందస్తు బుకింగ్‌లను ప్రోత్సహిస్తున్నాయి. ఆఫర్లూ వీటికి తోడయ్యాయి. అటు వజ్రాభరణాలకూ గిరాకీ పెద్ద ఎత్తున పెరిగింది. 2014తో పోలిస్తే ఈ ఏడాది అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయని తనిష్క్ జువెల్లరీ విభాగం రిటైల్, మార్కెటింగ్ ఎస్వీపీ సందీప్ కులహళ్లి తెలిపారు. గతేడాది ఎన్నికల కారణంగా నగదు తీసుకెళ్లడంపై ఆంక్షలుండడంతో దుకాణదారులు కస్టమర్లకు హోం డెలివరీ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
రూ. 4లక్షల విలువైన బంగారం అపహరణ
మహబూబ్‌నగర్: జిల్లాలో 4 నగల షాపుల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నగల షాపుల్లో నుంచి 4 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని దొంగలు అపహరించారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని వడ్లపల్లి మండలం ఎన్కాపురం వద్ద చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
ప్రకాశం జిల్లాలో జ్యూయలరీ షాప్‌లో భారీ చోరీ
ప్రకాశం: దోపిడీ దొంగల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. బంగారు దుకాణాలపై కన్నేసిన దొంగలు అదును చూసి చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో ఆదివారం ఓ జ్యూయలరీ షాప్‌లో భారీ చోరీ జరిగింది. జీవన్ జ్యూయలర్స్ బంగారు దుకాణం నుంచి 28తులాల బంగారం, 6కేజీల వెండిని దొంగలు అపహరించినట్టు సమాచారం. -
అక్షయ తృతీయ అదుర్స్
సిద్దిపేట జోన్/మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: అక్షయ తృతీయ రోజున బంగారం కొని, దాన్ని గౌరీదేవి ముందు పెట్టి పూజిస్తే ఐదోతనంతోపాటు ఐశ్వర్యం సిద్ధిస్తుందనే నమ్మకం ప్రజల్లో పెరిగిపోయింది. అందువల్లే ప్రతి అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఈసారి అక్షయ తృతీయకు శుక్రవారం, బసవజయంతి, పెళ్లిళ్ల సీజన్ కూడా కలసి రావడంతో జిల్లాలో పసిడి కొనుగోళ్లు పరవళ్లు తొక్కాయి. జ్యూయలరీ షాపులన్నీ కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. మరోవైపు బంగారం ధర కూడా రూ. 29 వేల నుంచి రూ.30 వేలను దాటి వెళ్లిపోయింది. అయినప్పటికీ కొనుగోలు దారులు జ్యూయలరీ షాపుల ఎదుట బారులు తీరడంతో శుక్రవారం జిల్లాలో 50 కిలోల ఆభరణాలు అమ్ముడయినట్లు సమాచారం. కొనుగోళ్లు ఫుల్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, రామాయంపేట, గజ్వేల్, పటాన్చెరు, నారాయణఖేడ్, సదాశివపేట, రామచంద్రాపురంలోని జువెలరీ షాపులన్నీ అక్షయ తృతీయ రోజైన శుక్రవారం కిటకిటలాడాయి. పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసిరావడంతో కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగాయి. ఒక్క మెదక్ పట్టణంలోనే రూ.8 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఇక జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనూ చెప్పకోదగ్గ స్థాయిలోనే కొనుగోళ్లు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో నిన్నటివరకూ వెలవెలబోయిన జువెలరీషాపులన్నీ కిటకిటలాడాయి. వ్యాపారం బాగా సాగడంతో వ్యాపారులు కూడా ఆనందంలో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు ప్రత్యేక డిస్కౌంట్లిస్తూ కొనుగోలుదారులను ఆకర్షించడంతో అక్షయ తృతీయ సెంటిమెంట్ అందరికీ కలిసి వచ్చింది. -
నకిలీ చెక్కులతో మోసాలకు పాల్పడుతున్నఇద్దరు అరెస్ట్
నగరంలోని జ్యూయలరీ షాపుల్లో పలు మోసాలకు పాల్పడుతున్న హరికృష్ణ, శ్రీనివాసులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 80 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ చెక్కు బుక్కులు, క్రెడిట్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యూయలరీ షాపుల్లో బంగారం కొనుగోలు చేసి, అనంతరం నకిలీ చెక్కులతో జ్యూయలరీ షాపు యజమానులను బురిడి కొట్టిస్తున్నారు. దాంతో జ్యూయలరీ షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు నిఘా వేసి నిందితులను పట్టుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు.