నెల్లూరు(క్రైమ్): నగరంలోని ట్రంకురోడ్డులోని కుమార్ జ్యువెలరీస్‌లో శనివారం వేకువన గుర్తుతెలియని దుండగుడు చోరీకి యత్నించాడు. షట్టర్‌ను పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగుడు ఆభరణాలను వెతికే క్రమంలో అలారమ్ మోగడంతో పరారయ్యాడు. పోలీసుల సమాచారం మేరకు....కామాటివీధికి చెందిన దేవిశెట్టి వెంకటసురేంద్రకుమార్ ట్రంకురోడ్డులో కుమార్ జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నారు. దుకాణంలో అధునాతన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, మోషన్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. సీసీ కెమెరాల పరిధిలో కదలికలు, తాళాలు పగులగొట్టే ప్రయత్నాలు జరిగితే రికార్డు కావడమే కాకుండా అలారమ్ మోగుతుంది. రోజూలాగే గురువారం రాత్రి 10గంటలకు దుకాణం మూసివేశారు.
వాచ్‌మెన్ వెంకటకృష్ణయ్య దుకాణం బయట విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం వేకువన 2.30 నుంచి 3 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగుడు షాప్‌పైన(మూడోఫ్లోర్) షట్టర్‌ను కటింగ్‌ప్లేయర్, సుత్తి, స్పానర్ల సాయంతో పగులగొట్టాడు. అనంతరం కొంతభాగం పైకెత్తి లోనికి ప్రవేశించాడు. అనంతరం ప్రతి గదిని సోదా చేస్తూ కింద ఫ్లోర్‌లో ఆభరణాలు విక్రయించే కౌంటర్ వద్దకు వచ్చేసరికి అలారమ్ మోగింది. దీంతో వాచ్‌మెన్ వెంకటకృష్ణయ్య అప్రమత్తమై పెద్దగా కేకలువేయడం గమనించిన దుండగుడు దుకాణం పైభాగానికి చేరుకుని షట్టర్ కింద నుంచి పరారయ్యాడు.
అలారం మోగిన ఘటనపై వాచ్‌మెన్ అందించిన సమాచారంతో సురేంద్రకుమార్, ఆయన సోదరుడు హుటాహుటిన షాపు వద్దకు చేరుకున్నారు. తలుపులు తెరచి చూడగా బంగారు, వెండి ఆభరణాలు ఎక్కడివి అక్కడే ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. చోరీకి యత్నంపై మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే అలారం మోగడంపై సమాచారం అందుకున్న రాత్రి గస్తీ సిబ్బంది నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
కుమార్ జ్యువెలరీస్ దుకాణాన్ని నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, మూడో నగర, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు బీ పాపారావు, షేక్ బాజీజాన్‌సైదా పరిశీలించారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. అనంతరం పోలీసు అధికారులు సీసీఫుటేజ్‌లను పరిశీలించారు. ïఫుటేజ్‌ల్లో నిందితుడు రెండు చేతులకు గ్లౌజ్‌లు ధరించి సెల్‌ఫోను లైట్ సాయంతో చోరీకి యత్నించడం కనిపించింది. దీంతో మూడో నగర పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సమీపంలోని దుకాణాలపై నుంచి
నిందితుడు కుమార్ జ్యువెలరీస్ సమీపంలోని మూడో దుకాణంపై నుంచి షాపు వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా నిందితుడు రెక్కీనిర్వహించి చోరికి యత్నించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడు పాతనేరస్తుడే
జ్యువెలరీస్ దుకాణంలో చోరీకి యత్నించిన నిందితుడు విశాఖపట్నానికి చెందిన పాతనేరçస్తుడిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. నిందితుడితో పాటు అతని సోదరుడు గతంలో ఈ తరహానేరాలకు పాల్పడుతూ పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లినట్లు తెలిసింది. గతంలోనూ నిందితుడు ఇదే తరహా నేరానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం చోరీకియత్నించిన దుకాణానికి ఆనుకుని ఉన్న పీటర్‌ఇంగ్లాడ్ షోరూమ్‌లోనూ దొంగతనానికి యత్నించినట్లు సమాచారం త్వరితగతిన నిందితుడ్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment