‘అక్షయ’ అమ్మకాలు.. జిగేల్!
* కిటకిటలాడిన ఆభరణాల దుకాణాలు
* ఆశించిన స్థాయిలో అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆభరణాల దుకాణాల్లో మంగళవారం అక్షయ తృతీయ జోష్ కనిపించింది. కిక్కిరిసిన కస్టమర్లతో దుకాణాలు మెరిసిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో బంగారానికి ప్రధాన మార్కెట్లు అయిన సిద్ధిఅంబర్ బజార్, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌లు కస్టమర్లతో కళకళలాడాయి.
గతేడాది అక్షయ తృతీయ సమయంలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.30 వేలుగా ఉంది. ఇప్పుడు రూ.27 వేలకు రావడం కూడా పుత్తడి అమ్మకాలకు ఊపునిచ్చింది. దీనికితోడు కంపెనీల ఆకర్షణీయ ఆఫర్లు కూడా కస్టమర్లకు కలిసొచ్చింది. ఆభరణాలతోపాటు బంగారు నాణేలను వినియోగదార్లు కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా 10 గ్రాములకు రూ.100 ధర తగ్గడం ఇక్కడ కొసమెరుపు.
అమ్మకాల్లో 30 శాతం దాకా వృద్ధి..
కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న పసిడి మార్కెట్లో అక్షయ తృతీయ జోష్ ప్రస్ఫుటంగా కనిపించింది. కస్టమర్లు తమ సెంటిమెంటు కొనసాగించడంతో గతేడాది అక్షయతో పోలిస్తే అమ్మకాల్లో 30 శాతం దాకా వృద్ధి నమోదైంది. ధర స్థిరంగా ఉండడం కూడా కలిసొచ్చిందని కళ్యాణ్ జువెల్లర్స్ మార్కెటింగ్, ఆపరేషన్స్ ఈడీ రమేశ్ కళ్యాణరామన్ తెలిపారు. 2014తో పోలిస్తే 30 శాతం అధికంగా అమ్మకాలు జరిపినట్టు వెల్లడించారు.
బ్రైడల్ జువెల్లరీ విషయంలో పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్‌లు నమోదయ్యాయని వివరించారు. 2015లో పుత్తడి గిరాకీ గణనీయంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మార్చిలో 125 టన్నుల బంగారం భారత్‌కు దిగుమతి అయింది. గతేడాదితో పోలిస్తే ఇది రెండింతలపైమాటే. అక్షయ అమ్మకాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని జెమ్స్, జువెల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ పంకజ్ పరేఖ్ అన్నారు.
ముందస్తు బుకింగ్‌లు..
ఆభరణాల కొనుగోళ్లలో ఇప్పుడు కొత్త ట్రెండ్ జోరందుకుంది. ముందస్తు బుకింగ్‌లకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. తమకు అనుకూల సమయంలో దుకాణానికి వెళ్లి ఆభరణాలను ఎంచుకుని చెల్లింపులు జరుపుతున్నారు. డెలివరీ మాత్రం అక్షయ తృతీయ రోజు తీసుకుంటున్నారు. అక్షయ రోజున రద్దీ ఉండడంతో ఎంపిక చేసుకోవడానికి సమయం ఎక్కువగా ఉండదు. దీనికితోడు ఆభరణాల కంపెనీలు సైతం ముందస్తు బుకింగ్‌లను ప్రోత్సహిస్తున్నాయి.
ఆఫర్లూ వీటికి తోడయ్యాయి. అటు వజ్రాభరణాలకూ గిరాకీ పెద్ద ఎత్తున పెరిగింది. 2014తో పోలిస్తే ఈ ఏడాది అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయని తనిష్క్ జువెల్లరీ విభాగం రిటైల్, మార్కెటింగ్ ఎస్‌వీపీ సందీప్ కులహళ్లి తెలిపారు. గతేడాది ఎన్నికల కారణంగా నగదు తీసుకెళ్లడంపై ఆంక్షలుండడంతో దుకాణదారులు కస్టమర్లకు హోం డెలివరీ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.