చుక్కల్లో బంగారం రేట్లు.. తక్కువ ధరలో ఎక్కువ నగలకు ప్రత్యామ్నాయం ఇదే! | Gold Prices Rise One Gram Gold Stores Running Successfully Guntur | Sakshi
Sakshi News home page

మండిపోతున్న బంగారం రేట్లు.. తక్కువ ధరలో ఎక్కువ నగలకు ప్రత్యామ్నాయం ఉందిగా!

Published Sun, Aug 21 2022 7:06 PM | Last Updated on Mon, Aug 22 2022 1:26 PM

Gold Prices Rise One Gram Gold Stores Running Successfully Guntur - Sakshi

వన్‌గ్రామ్‌ గోల్డ్‌ వస్తువులు

పాత గుంటూరు: ఆభరణాలంటే మక్కువ చూపని వనితలు ఉండరు. ప్రతి మహిళకు వివిధ రకాల ఆభరణాలు ధరించి తోటి వారి ముందు హుందాగా కనిపించాలనే కోరిక ఉంటుంది. ముఖ్యంగా పండుగలకు, పెళ్లిళ్ల సమయంలో ప్రత్యేక ఆభరణాలు వేసుకొని ముస్తాబవడానికి ఎంతో ప్రాధాన్య ఇస్తుంటారు. ధనవంతులు బంగారు, వెండి వస్తువులు కొనుగోలుకు ముందుకెళ్తుండగా ఆర్ధిక పరిస్ధితి అనుకూలించని వారు బంగారు ఆభరణాలు ధరించి ముచ్చట తీర్చుకోవాలంటే చాలా డబ్బులు కావాలి. అది అందరికీ సాధ్యమయ్యే పనికాదు.

అందుకే మహిళలు ప్రత్యామ్నాయంగా రోల్డ్‌ గోల్డ్‌ వస్తువుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇవి కూడా అచ్చం బంగారు వస్తువుల్లాగే కనిపించడంతో చాలా మంది వివిధ రకాల మోడళ్ల వస్తువులను కొనుగోలు చేసి ముచ్చట తీర్చుకుంటున్నారు. ధనవంతులు కూడా బంగారంతో పాటు రోజువారీ కోసం రోల్డ్‌ గోల్డ్‌ వస్తువులపై మొగ్గు చూపుతున్నారు. మహిళల అభిరుచిని దృష్టిలో వుంచుకొని వ్యాపారులు కూడా లేటెస్ట్‌ మోడళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పలు గోల్డ్‌ షోరూమ్‌లలో సైతం రోల్డ్‌ గోల్డ్‌ ఆభరణాలను విక్రయిస్తున్నారు. దీంతో వీరి వ్యాపా రం మూడు చైన్లు, ఆరు నెక్లెస్‌ల్లా వెలిగిపోతోంది. 
(చదవండి: ఇంట్లో ఈ గాడ్జెట్‌ ఉంటే కీటకాలు పరార్‌!)

పండుగ సమయాల్లో విక్రయాల జోరు 
పండుగ సమయాల్లో రోల్డ్‌ గోల్డ్‌ ఆభరణాల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. నగరంలోని ప్రతి దుకాణం వినియోగదారులతో కళకళలాడుతుంది. చిన్నారులు, యువతులు, పెద్దవారు ఇలా అంతా వారి కి కావల్సిన వస్త్రాలు, ఇతర సామగ్రితో పాటు రోల్డ్‌ గోల్డ్‌ ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వ్యాపారస్తులు కూడా వివిధ రకాల మోడళ్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో జరిగే కార్యక్రమాల్లో విద్యార్ధినులు లేటెస్ట్‌ రోల్డ్‌ గోల్డ్‌ ఐటమ్స్‌ వేసుకుని సందడి చేస్తున్నారు.  

పుట్టగొడుగుల్లా దుకాణాలు... 
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు చుక్కలను అంటుతున్న సమయంలో రోల్డ్‌ గోల్డ్‌ వన్‌గ్రామ్‌ బంగారు వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నగరంలో 50 వరకు రోల్డ్‌ గోల్డ్‌ దుకాణాలు ఉన్నాయి. వాటిలో ఒరిజినల్‌ బంగారు వస్తువులను మైమరిపించే రీతిలో రోల్డ్‌ గోల్డ్‌ వన్‌గ్రామ్‌ బంగారు ఆభరణాలు అందుబాటులో దొరుకుతున్నాయి. ముఖ్యంగా అన్ని వర్గాల మహిళలు వినియోగించే చైన్‌లు, చెవిదుద్దులు, నెక్లెస్‌లు, హారాలు, గాజులు, తదితర వస్తువులు లభ్యమవుతున్నాయి.

సాధారణ రోజుల్లో నెలకు రూ.50 లక్షలు వరకు వ్యాపారం జరుగుతుండగా, పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లో కోటికి పైగానే వ్యాపారం జరుగుతుంది. ధరలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వన్‌గ్రామ్‌ గోల్డ్‌ వస్తువులు వివిధ రకాలలో ఉంటాయి. వాటి నాణ్యతను బట్టి ధరలు ఉంటాయి. చెవిబుట్టలు రకాన్ని బట్టి రూ. 250 నుంచి 2500 వరకు ఉంటాయి. నెక్లెస్‌లు రూ. 50 నుంచి 5 వేల వరకు ఉంటుంది. చైన్‌లు రూ.100 నుంచి 20 వేల వరకు, గాజులు రూ.100 నుంచి 3వేల వరకు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అవసరమయ్యే వడ్డానాలు రూ.400 నుంచి 10 వేల వరకు ఉంటాయి. 
(చదవండి: CM Jagan: థాంక్యూ సీఎం సార్‌ !)

వ్యాపారం బాగా పెరిగింది
రోల్డ్‌ గోల్డ్‌ వ్యాపారం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. దుకాణాల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఒకప్పుడు జిల్లా కేంద్రానికి చెందిన మహిళలే ఎక్కువగా వచ్చేవారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు కూడా ఈ ఆభరణాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. సీజన్‌ బట్టి మోడళ్లను అందుబాటులో ఉంచుతున్నాం. 
– రమణారెడ్డి, షోరూం మేనేజరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement