Gold stores
-
చుక్కల్లో బంగారం రేట్లు.. తక్కువ ధరలో ఎక్కువ నగలకు ప్రత్యామ్నాయం ఇదే!
పాత గుంటూరు: ఆభరణాలంటే మక్కువ చూపని వనితలు ఉండరు. ప్రతి మహిళకు వివిధ రకాల ఆభరణాలు ధరించి తోటి వారి ముందు హుందాగా కనిపించాలనే కోరిక ఉంటుంది. ముఖ్యంగా పండుగలకు, పెళ్లిళ్ల సమయంలో ప్రత్యేక ఆభరణాలు వేసుకొని ముస్తాబవడానికి ఎంతో ప్రాధాన్య ఇస్తుంటారు. ధనవంతులు బంగారు, వెండి వస్తువులు కొనుగోలుకు ముందుకెళ్తుండగా ఆర్ధిక పరిస్ధితి అనుకూలించని వారు బంగారు ఆభరణాలు ధరించి ముచ్చట తీర్చుకోవాలంటే చాలా డబ్బులు కావాలి. అది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అందుకే మహిళలు ప్రత్యామ్నాయంగా రోల్డ్ గోల్డ్ వస్తువుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇవి కూడా అచ్చం బంగారు వస్తువుల్లాగే కనిపించడంతో చాలా మంది వివిధ రకాల మోడళ్ల వస్తువులను కొనుగోలు చేసి ముచ్చట తీర్చుకుంటున్నారు. ధనవంతులు కూడా బంగారంతో పాటు రోజువారీ కోసం రోల్డ్ గోల్డ్ వస్తువులపై మొగ్గు చూపుతున్నారు. మహిళల అభిరుచిని దృష్టిలో వుంచుకొని వ్యాపారులు కూడా లేటెస్ట్ మోడళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పలు గోల్డ్ షోరూమ్‌లలో సైతం రోల్డ్ గోల్డ్ ఆభరణాలను విక్రయిస్తున్నారు. దీంతో వీరి వ్యాపా రం మూడు చైన్లు, ఆరు నెక్లెస్ల్లా వెలిగిపోతోంది. (చదవండి: ఇంట్లో ఈ గాడ్జెట్ ఉంటే కీటకాలు పరార్!) పండుగ సమయాల్లో విక్రయాల జోరు పండుగ సమయాల్లో రోల్డ్ గోల్డ్ ఆభరణాల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. నగరంలోని ప్రతి దుకాణం వినియోగదారులతో కళకళలాడుతుంది. చిన్నారులు, యువతులు, పెద్దవారు ఇలా అంతా వారి కి కావల్సిన వస్త్రాలు, ఇతర సామగ్రితో పాటు రోల్డ్ గోల్డ్ ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వ్యాపారస్తులు కూడా వివిధ రకాల మోడళ్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో జరిగే కార్యక్రమాల్లో విద్యార్ధినులు లేటెస్ట్ రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ వేసుకుని సందడి చేస్తున్నారు. పుట్టగొడుగుల్లా దుకాణాలు... ప్రస్తుతం బంగారం, వెండి ధరలు చుక్కలను అంటుతున్న సమయంలో రోల్డ్ గోల్డ్ వన్‌గ్రామ్ బంగారు వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నగరంలో 50 వరకు రోల్డ్ గోల్డ్ దుకాణాలు ఉన్నాయి. వాటిలో ఒరిజినల్ బంగారు వస్తువులను మైమరిపించే రీతిలో రోల్డ్ గోల్డ్ వన్‌గ్రామ్ బంగారు ఆభరణాలు అందుబాటులో దొరుకుతున్నాయి. ముఖ్యంగా అన్ని వర్గాల మహిళలు వినియోగించే చైన్లు, చెవిదుద్దులు, నెక్లెస్‌లు, హారాలు, గాజులు, తదితర వస్తువులు లభ్యమవుతున్నాయి. సాధారణ రోజుల్లో నెలకు రూ.50 లక్షలు వరకు వ్యాపారం జరుగుతుండగా, పెళ్లిళ్లు, పండుగల సీజన్లో కోటికి పైగానే వ్యాపారం జరుగుతుంది. ధరలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వన్‌గ్రామ్ గోల్డ్ వస్తువులు వివిధ రకాలలో ఉంటాయి. వాటి నాణ్యతను బట్టి ధరలు ఉంటాయి. చెవిబుట్టలు రకాన్ని బట్టి రూ. 250 నుంచి 2500 వరకు ఉంటాయి. నెక్లెస్‌లు రూ. 50 నుంచి 5 వేల వరకు ఉంటుంది. చైన్లు రూ.100 నుంచి 20 వేల వరకు, గాజులు రూ.100 నుంచి 3వేల వరకు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అవసరమయ్యే వడ్డానాలు రూ.400 నుంచి 10 వేల వరకు ఉంటాయి. (చదవండి: CM Jagan: థాంక్యూ సీఎం సార్ !) వ్యాపారం బాగా పెరిగింది రోల్డ్ గోల్డ్ వ్యాపారం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. దుకాణాల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఒకప్పుడు జిల్లా కేంద్రానికి చెందిన మహిళలే ఎక్కువగా వచ్చేవారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు కూడా ఈ ఆభరణాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. సీజన్ బట్టి మోడళ్లను అందుబాటులో ఉంచుతున్నాం. – రమణారెడ్డి, షోరూం మేనేజరు -
రెండు బంగారు దుకాణాల్లో చోరీ యత్నం
కందుకూరు: పట్టణంలోని రెండు బంగారు దుకాణాల్లో చోరీకి తెగబడ్డ దొంగలు భంగపడి చేతికందిన కొద్దిపాటి సొత్తుతో పరారయ్యారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి పట్టణంలోని పొట్టి శ్రీరాములు బొమ్మసెంటర్‌లో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యాపారి తాజ్గోల్డ్ జ్యూయలరీ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ దుకాణం పక్కనే షేక్ సలీం అనే యువకునికి చెందిన బంగారు నగల తయారీ షాపు కూడా ఉంది. ఈ నేపథ్యంలో తొలుత దొంగలు తాజ్గోల్డ్షాపు భవనం పైభాగం నుంచి రంధ్రం చేసి లోపలకి వెళ్లారు. అయితే యజమాని ప్రతి రోజూ నగలను అక్కడ ఉంచకుండా మరో చోట దాస్తాడు. ఇది తెలియని దొంగలు ఆశపడి భంగపడ్డారు. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో పక్కనే ఉన్న సలీం దుకాణం పై భాగంలో రేకులు తొలగించి లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్న రూ. 60 వేల విలువ చేసే ఒక జత బంగారు కమ్మలు, వెండి వస్తువులు తీసుకొని పరారయ్యారు. సోమవారం ఉదయం షాపులు తీసిన యజమానులు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ నరసింహారావు, రూరల్ ఎస్సై ప్రభాకర్‌తో పాటు, డాగ్స్వాడ్, క్లూస్‌టీం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే సెంటర్లో బంగారుషాపులను దొంగలు లక్ష్యంగా చేసుకోవడం పట్ల భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. -
‘అక్షయ’... జిగేల్!
♦ అక్షయ తృతీయకు పసిడి అమ్మకాల జోష్ ♦ కళకళలాడిన బంగారం దుకాణాలు ♦ విక్రయాల్లో 20 శాతం వృద్ధి:జీజేఎఫ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అక్షయ తృతీయకు బంగారం దుకాణాలు కళకళలాడాయి. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అంతంత మాత్రంగానే అమ్మకాలను సాగిస్తున్న షాపులు కాస్తా శుక్రవారం నాడు కస్టమర్లతో సందడిగా మారాయి. ప్రధాన నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సందడి ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. 2016 అక్షయతో పోలిస్తే ఈసారి 20 శాతం దాకా వృద్ధి నమోదైనట్లు ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ (జీజేఎఫ్) వెల్లడించింది. అక్షయ తృతీయ ఈ సారి రెండు రోజులు రావడంతో నేడు (శనివారం) కూడా అమ్మకాలుంటాయని, ఇది కలిసి వస్తుందని వర్తకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన కాయిన్స్.. గత కొన్నేళ్లుగా లైట్ వెయిట్ జువెల్లరీకి కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కనపడుతోంది. మెట్రోలు, ప్రధాన నగరాల్లో హ్యాండ్ క్రాఫ్టెడ్ జువెల్లరీ, ఇండో–ఇటాలియన్ ఆభరణాలకు డిమాండ్ పెరుగుతోంది. అక్షయకు ఆభరణాలు తీసుకోనివారు నాణేలను కొనుగోలు చేసేవారు. ఈసారి మాత్రం నాణేల అమ్మకాలు పడిపోయాయని బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి తెలిపారు. నాణేల స్థానంలో చిన్న చిన్న నగలను కొనుగోలు చేశారన్నారు. బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా ఉందని, కొనుగోలుకు మంచి తరుణమని చెప్పారు. 2016 అక్షయతో పోలిస్తే ఈసారి మొత్తం పరిశ్రమలో 20 శాతం దాకా వృద్ధి ఉందని జీజేఎఫ్ మాజీ చైర్మన్ జి.వి.శ్రీధర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. డిజిటల్‌దే అగ్రస్థానం.. గతంలో పుత్తడి కొనుగోళ్లలో నగదు లావాదేవీలే అధికం. కొన్ని నెలల క్రితం వరకు డిజిటల్ లావాదేవీల వాటా కేవలం 20 శాతం మాత్రమే. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత కారణంగా ఇప్పుడు డిజిటల్ వాటా ఏకంగా 60 శాతానికి చేరినట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కస్టమర్లను ఆకట్టుకోవడానికి చాలా కంపెనీలు తయారీ చార్జీలపై డిస్కౌంట్లను ప్రకటించాయి. కొన్ని కంపెనీలు ఉచిత కాయిన్లను ఆఫర్ చేస్తున్నాయి. టాప్ బ్రాండ్లు అయితే కొత్త కలెక్షన్లతో కస్టమర్లకు స్వాగతం పలికాయి. రానున్న రోజుల్లో బంగారం ధర రూ.30 వేలపైన కదలాడుతుందని కొటక్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అరబింద ప్రసాద్ గయన్ వ్యాఖ్యానించారు. పెట్టుబడి సాధనాల్లో ఇప్పుడు పుత్తడి ఆకట్టుకుంటోందని అన్నారు. ఇదీ జువెల్లరీ మార్కెట్.. దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల వ్యాపార పరిమాణం రూ.4,80,000 కోట్లుంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా అధికంగా 60% ఉంది. ఉత్తరాది రాష్ట్రాలు 40% వాటా కైవసం చేసుకున్నాయి. సగటున రోజువారీ అమ్మకాలతో పోలిస్తే అక్షయ తృతీయ రోజున 15–20 రెట్ల వ్యాపారం జరుగుతుందని వర్తకులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా గతేడాది ఈ పండక్కి 20 టన్నుల పుత్తడి విక్రయం అయినట్టు అంచనా. తొలి త్రైమాసికంలో కంజ్యూమర్ సెంటిమెంట్, అమ్మకాల వృద్ధి గతేడాది కంటే ఉత్తమంగా ఉందని టైటాన్ జువెల్లరీ విభాగం రిటైల్, మార్కెటింగ్ ఎస్వీపీ సందీప్ కులహల్లి తెలిపారు. కాగా, శుక్రవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.29,700(10 గ్రాములు) పలికింది.