‘అక్షయ’... జిగేల్!
♦ అక్షయ తృతీయకు పసిడి అమ్మకాల జోష్
♦ కళకళలాడిన బంగారం దుకాణాలు
♦ విక్రయాల్లో 20 శాతం వృద్ధి:జీజేఎఫ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అక్షయ తృతీయకు బంగారం దుకాణాలు కళకళలాడాయి. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అంతంత మాత్రంగానే అమ్మకాలను సాగిస్తున్న షాపులు కాస్తా శుక్రవారం నాడు కస్టమర్లతో సందడిగా మారాయి. ప్రధాన నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సందడి ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. 2016 అక్షయతో పోలిస్తే ఈసారి 20 శాతం దాకా వృద్ధి నమోదైనట్లు ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ (జీజేఎఫ్) వెల్లడించింది. అక్షయ తృతీయ ఈ సారి రెండు రోజులు రావడంతో నేడు (శనివారం) కూడా అమ్మకాలుంటాయని, ఇది కలిసి వస్తుందని వర్తకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిన కాయిన్స్..
గత కొన్నేళ్లుగా లైట్ వెయిట్ జువెల్లరీకి కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కనపడుతోంది. మెట్రోలు, ప్రధాన నగరాల్లో హ్యాండ్ క్రాఫ్టెడ్ జువెల్లరీ, ఇండో–ఇటాలియన్ ఆభరణాలకు డిమాండ్ పెరుగుతోంది. అక్షయకు ఆభరణాలు తీసుకోనివారు నాణేలను కొనుగోలు చేసేవారు. ఈసారి మాత్రం నాణేల అమ్మకాలు పడిపోయాయని బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి తెలిపారు. నాణేల స్థానంలో చిన్న చిన్న నగలను కొనుగోలు చేశారన్నారు. బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా ఉందని, కొనుగోలుకు మంచి తరుణమని చెప్పారు. 2016 అక్షయతో పోలిస్తే ఈసారి మొత్తం పరిశ్రమలో 20 శాతం దాకా వృద్ధి ఉందని జీజేఎఫ్ మాజీ చైర్మన్ జి.వి.శ్రీధర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు.
డిజిటల్‌దే అగ్రస్థానం..
గతంలో పుత్తడి కొనుగోళ్లలో నగదు లావాదేవీలే అధికం. కొన్ని నెలల క్రితం వరకు డిజిటల్ లావాదేవీల వాటా కేవలం 20 శాతం మాత్రమే. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత కారణంగా ఇప్పుడు డిజిటల్ వాటా ఏకంగా 60 శాతానికి చేరినట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కస్టమర్లను ఆకట్టుకోవడానికి చాలా కంపెనీలు తయారీ చార్జీలపై డిస్కౌంట్లను ప్రకటించాయి. కొన్ని కంపెనీలు ఉచిత కాయిన్లను ఆఫర్ చేస్తున్నాయి. టాప్ బ్రాండ్లు అయితే కొత్త కలెక్షన్లతో కస్టమర్లకు స్వాగతం పలికాయి. రానున్న రోజుల్లో బంగారం ధర రూ.30 వేలపైన కదలాడుతుందని కొటక్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అరబింద ప్రసాద్ గయన్ వ్యాఖ్యానించారు. పెట్టుబడి సాధనాల్లో ఇప్పుడు పుత్తడి ఆకట్టుకుంటోందని అన్నారు.
ఇదీ జువెల్లరీ మార్కెట్..
దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల వ్యాపార పరిమాణం రూ.4,80,000 కోట్లుంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా అధికంగా 60% ఉంది. ఉత్తరాది రాష్ట్రాలు 40% వాటా కైవసం చేసుకున్నాయి. సగటున రోజువారీ అమ్మకాలతో పోలిస్తే అక్షయ తృతీయ రోజున 15–20 రెట్ల వ్యాపారం జరుగుతుందని వర్తకులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా గతేడాది ఈ పండక్కి 20 టన్నుల పుత్తడి విక్రయం అయినట్టు అంచనా. తొలి త్రైమాసికంలో కంజ్యూమర్ సెంటిమెంట్, అమ్మకాల వృద్ధి గతేడాది కంటే ఉత్తమంగా ఉందని టైటాన్ జువెల్లరీ విభాగం రిటైల్, మార్కెటింగ్ ఎస్‌వీపీ సందీప్ కులహల్లి తెలిపారు. కాగా, శుక్రవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.29,700(10 గ్రాములు) పలికింది.