ఆభరణాల వ్యాపారంలో వృద్ధి అంతంతే
దీపావళికి అమ్మకాలు బాగుంటాయ్ జీజేఎఫ్ ప్రాంతీయ చైర్మన్ శ్రీధర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల వ్యాపారంలో వృద్ధి అంతంతే ఉంటుందని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వర్తక సంఘం(జీజేఎఫ్) తెలిపింది. దిగుమతుల కట్టడి, సెంటిమెంటు తదితర కారణాలతో గత కొంత కాలంగా మార్కెట్ స్తబ్దుగా ఉంది. కొత్త ప్రభుత్వం, మార్కెట్ ఆశావహంగా ఉండడంతో గత ఆర్థిక సంవత్సరం మాదిరిగా 2014-15లోనూ రూ.4 లక్షల కోట్ల వ్యాపారం నమోదు కావొచ్చని అంచనాలున్నాయని జీజేఎఫ్ ప్రాంతీయ చైర్మన్ జి.వి.శ్రీధర్ ఆదివారమిక్కడ మీడియాతో పేర్కొన్నారు.
దీపావళి సీజన్‌లో 10-15 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. బంగారం ధర ఇంకా తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న రూ.28 వేల ధర సరైందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా మైనింగ్ ధరకు బంగారం లభిస్తోందని వివరించారు. రెండో అతిపెద్ద వినియోగదారు అయిన భారత్‌లో పన్నులు, దిగుమతి విధానం, రూపాయి విలువ వంటి అంశాలు సైతం అంతర్జాతీయంగా ధరను ప్రభావితం చేస్తున్నాయన్నారు.
ఏకీకృత ధర దిశగా..: దేశవ్యాప్తంగా బంగారం ధర ఒకేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని జీజేఎఫ్ ఎప్పటి నుంచో కోరుతోందని శ్రీధర్ తెలిపారు. ఆరు నెలల్లో బంగారం డిపాజిట్ స్కీంపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ప్రజల వద్ద 20,000 టన్నుల బంగారం ఉంది. ఇందులో 5% తిరిగి వ్యవస్థలోకి వచ్చినా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయొచ్చు. దొంగ రవాణాకు కట్టడి పడుతుంది. ముడి బంగారాన్ని బ్యాంకులు డిపాజిట్లుగా సేకరించాలి. ఈ బంగారాన్ని రుణం రూపంలో ఆభరణాల వర్తకులకు ఇవ్వాలి.
వర్తకులు తిరిగి బంగారాన్ని బ్యాంకులకు చెల్లించేలా స్కీం రావాలి’ అని అన్నారు. ఏపీ, తెలంగాణలో 20-30% వ్యాపారం తగ్గిందని ట్విన్‌సిటీస్ జువెల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ చెప్పారు. నకాషి, పచ్చి సెట్టింగ్ వర్క్, అన్‌కట్ డైమండ్ నగల తయారీలో భాగ్యనగరిదే పైచేయి అని హైదరాబాద్ జువెల్లరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ తయాల్ తెలిపారు.