Akshaya Thirdiya
-
‘అక్షయ’ అమ్మకాలు మిలమిల..!
ముంబై/న్యూఢిల్లీ: అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగాయి. క్రితం ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 25 శాతం పెరిగినట్టు అంచనా. బంగారం ధరలు తక్కువలోనే ఉండడం, వివాహాల సీజన్ కూత తోడు కావడం వినియోగదారులను కొనుగోళ్ల వైపు మొగ్గు చూపేలా చేశాయని వర్తకులు భావిస్తున్నారు. క్రితం ఏడాది అక్షయ తృతీయ రోజుతో పోలిస్తే బంగారం రిటైల్ ధరలు తులానికి 7 శాతం తక్కువగా రూ.32,000 స్థాయిలో ఉండడం గమనార్హం. 2016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తర్వాతి సంవత్సరాల్లో అమ్మకాలు అంత ఆశాజనకంగా లేవు. 2016 తర్వాత అమ్మకాల పరంగా ఈ ఏడాదే కాస్త ఆశాజనకంగా ఉండడం గమనార్హం. ‘‘పనిదినం అయినప్పటికీ, అధిక వేడి వాతావరణంలోనూ ప్రజలు తాము బుక్ చేసుకున్న ఆభరణాల కోసం వస్తున్నారు. కార్యాలయ వేళలు ముగిసిన తర్వాత మరింత పెద్ద మొత్తంలో అమ్మకాలు జరుగుతాయని అంచనా’’ అని ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ పేర్కొన్నారు. తాము ఎంతో ఆశావహంగా ఉన్నామని, క్రితం ఏడాదితో పోలిస్తే 25 శాతం అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి సానుకూల నివేదికలు వస్తున్నట్టు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ సైతం తెలిపారు. దక్షిణాదిన జోరుగా... ‘‘దక్షిణాదిలోనే అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరాది. దీర్ఘకాలం పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, ఆభరణాల అమ్మకాలు ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. తక్కువ ధరల వల్ల కస్టమర్లు కూడా ప్రయోజనం పొందుతున్నారు’’ అని కల్యాణ్ జ్యుయలర్స్ చైర్మన్ టీఎస్ కల్యాణరామన్ పేర్కొన్నారు. మెట్రోల్లో మొదటిసారి యువ కస్టమర్లు కొనుగోళ్లు చేశారని, నాన్ మెట్రోల్లోనూ సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. దక్షిణాదిన కర్ణాటక, కేరళ ముందున్నట్టు తెలిపారు. గతేడాదితో పోలిస్తే అమ్మకాల్లో డబుల్ డిజిట్ పెరుగుదల ఉందని, రోజులో మిగిలిన సమయంలో అమ్మకాలు ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు తనిష్క్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సందీప్కుల్హల్లి తెలిపారు. -
అక్షయ
చిన్నారులు, బాలికలు, మహిళలపై మునుపెన్నడూ లేనంత‘అక్షయం’గా అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి క్షయం అయిపోవాలి. వారి రక్షణ అక్షయం కావాలి. ఇవాళ అక్షయ తృతీయ! ఈ అక్షయ తృతీయ తిథి తెల్లవారుజామున 3.45కి మొదలైంది. రేపు రాత్రి 1.29కి ముగుస్తుంది. అక్షయ తృతీయ నాడు ఏదైనా తలపెడితే లాభం, శుభం అంటారు పండితులు. చాలా పవిత్రమైన రోజు. శక్తిమంతమైన రోజు. కుబేరుడు పోగొట్టుకున్న సంపదంతా ఇదే రోజున మళ్లీ ఆయన్ని చేరింది. శ్రీకృష్ణపరమాత్ముడు ఇదే రోజున కుచేలునికి సమృద్ధిగా ధనప్రాప్తిని కలిగించాడు. అన్నపూర్ణమ్మ పుట్టింది ఇవాళే. వేదవ్యాసుడు భారతాన్ని రాయడం ప్రారంభించిందీ ఈ రోజునే. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కనుకనే శుభ సంకల్పానికి అక్షయ తృతీయ తిరుగులేదని భారతీయుల భావన. అక్షయం అంటే ఎన్నటికీ తరిగిపోనిది. ఎప్పటికీ పొంగిపొర్లుతూ ఉండేది. ధనం అక్షయం అయితే సంపన్నం. ధాన్యం అక్షయం అయితే సుభిక్షం. కనకం అక్షయం అయితే మహాభాగ్యం. మంచితనం అక్షయం అయితే అభయం. మానవత్వం అక్షయం అయితే దైవత్వం. ఇవన్నీ అక్షయంగా ఉండేందుకే అక్షయ తృతీయ రోజు మనం చేసే లక్ష్మీపూజ. అయితే మంచి మాత్రమే సమాజంలో అక్షయంగా ఉండాలి. మంచిది కానిది అక్షయంగా ఉండిపోడానికి లేదు. చిన్నారులు, బాలికలు, మహిళలపై మునుపెన్నడూ లేనంత ‘అక్షయం’గా అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి క్షయం అయిపోవాలి. వారి రక్షణ అక్షయం కావాలి. లక్షీదేవికి ప్రతిరూపాలైన స్త్రీల రక్షణకు గట్టి సంకల్పం చెప్పుకోడానికి కూడా అక్షయ తృతీయను తగిన సందర్భంగా భావించడం ఒక మంచి ఆలోచన. -
‘అక్షయ’... జిగేల్!
♦ అక్షయ తృతీయకు పసిడి అమ్మకాల జోష్ ♦ కళకళలాడిన బంగారం దుకాణాలు ♦ విక్రయాల్లో 20 శాతం వృద్ధి:జీజేఎఫ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అక్షయ తృతీయకు బంగారం దుకాణాలు కళకళలాడాయి. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అంతంత మాత్రంగానే అమ్మకాలను సాగిస్తున్న షాపులు కాస్తా శుక్రవారం నాడు కస్టమర్లతో సందడిగా మారాయి. ప్రధాన నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సందడి ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. 2016 అక్షయతో పోలిస్తే ఈసారి 20 శాతం దాకా వృద్ధి నమోదైనట్లు ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ (జీజేఎఫ్) వెల్లడించింది. అక్షయ తృతీయ ఈ సారి రెండు రోజులు రావడంతో నేడు (శనివారం) కూడా అమ్మకాలుంటాయని, ఇది కలిసి వస్తుందని వర్తకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన కాయిన్స్.. గత కొన్నేళ్లుగా లైట్ వెయిట్ జువెల్లరీకి కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కనపడుతోంది. మెట్రోలు, ప్రధాన నగరాల్లో హ్యాండ్ క్రాఫ్టెడ్ జువెల్లరీ, ఇండో–ఇటాలియన్ ఆభరణాలకు డిమాండ్ పెరుగుతోంది. అక్షయకు ఆభరణాలు తీసుకోనివారు నాణేలను కొనుగోలు చేసేవారు. ఈసారి మాత్రం నాణేల అమ్మకాలు పడిపోయాయని బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి తెలిపారు. నాణేల స్థానంలో చిన్న చిన్న నగలను కొనుగోలు చేశారన్నారు. బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా ఉందని, కొనుగోలుకు మంచి తరుణమని చెప్పారు. 2016 అక్షయతో పోలిస్తే ఈసారి మొత్తం పరిశ్రమలో 20 శాతం దాకా వృద్ధి ఉందని జీజేఎఫ్ మాజీ చైర్మన్ జి.వి.శ్రీధర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. డిజిటల్దే అగ్రస్థానం.. గతంలో పుత్తడి కొనుగోళ్లలో నగదు లావాదేవీలే అధికం. కొన్ని నెలల క్రితం వరకు డిజిటల్ లావాదేవీల వాటా కేవలం 20 శాతం మాత్రమే. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత కారణంగా ఇప్పుడు డిజిటల్ వాటా ఏకంగా 60 శాతానికి చేరినట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కస్టమర్లను ఆకట్టుకోవడానికి చాలా కంపెనీలు తయారీ చార్జీలపై డిస్కౌంట్లను ప్రకటించాయి. కొన్ని కంపెనీలు ఉచిత కాయిన్లను ఆఫర్ చేస్తున్నాయి. టాప్ బ్రాండ్లు అయితే కొత్త కలెక్షన్లతో కస్టమర్లకు స్వాగతం పలికాయి. రానున్న రోజుల్లో బంగారం ధర రూ.30 వేలపైన కదలాడుతుందని కొటక్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అరబింద ప్రసాద్ గయన్ వ్యాఖ్యానించారు. పెట్టుబడి సాధనాల్లో ఇప్పుడు పుత్తడి ఆకట్టుకుంటోందని అన్నారు. ఇదీ జువెల్లరీ మార్కెట్.. దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల వ్యాపార పరిమాణం రూ.4,80,000 కోట్లుంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా అధికంగా 60% ఉంది. ఉత్తరాది రాష్ట్రాలు 40% వాటా కైవసం చేసుకున్నాయి. సగటున రోజువారీ అమ్మకాలతో పోలిస్తే అక్షయ తృతీయ రోజున 15–20 రెట్ల వ్యాపారం జరుగుతుందని వర్తకులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా గతేడాది ఈ పండక్కి 20 టన్నుల పుత్తడి విక్రయం అయినట్టు అంచనా. తొలి త్రైమాసికంలో కంజ్యూమర్ సెంటిమెంట్, అమ్మకాల వృద్ధి గతేడాది కంటే ఉత్తమంగా ఉందని టైటాన్ జువెల్లరీ విభాగం రిటైల్, మార్కెటింగ్ ఎస్వీపీ సందీప్ కులహల్లి తెలిపారు. కాగా, శుక్రవారం హైదరాబాద్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.29,700(10 గ్రాములు) పలికింది.