తాజ్‌గోల్డ్ షాపును పరిశీలిస్తున్న డాగ్‌స్వాడ్ , దొంగలు చేసిన రంధ్రం
కందుకూరు: పట్టణంలోని రెండు బంగారు దుకాణాల్లో చోరీకి తెగబడ్డ దొంగలు భంగపడి చేతికందిన కొద్దిపాటి సొత్తుతో పరారయ్యారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి పట్టణంలోని పొట్టి శ్రీరాములు బొమ్మసెంటర్‌లో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యాపారి తాజ్‌గోల్డ్ జ్యూయలరీ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ దుకాణం పక్కనే షేక్ సలీం అనే యువకునికి చెందిన బంగారు నగల తయారీ షాపు కూడా ఉంది. ఈ నేపథ్యంలో తొలుత దొంగలు తాజ్‌గోల్డ్‌షాపు భవనం పైభాగం నుంచి రంధ్రం చేసి లోపలకి వెళ్లారు. అయితే యజమాని ప్రతి రోజూ నగలను అక్కడ ఉంచకుండా మరో చోట దాస్తాడు. ఇది తెలియని దొంగలు ఆశపడి భంగపడ్డారు. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో పక్కనే ఉన్న సలీం దుకాణం పై భాగంలో రేకులు తొలగించి లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్న రూ. 60 వేల విలువ చేసే ఒక జత బంగారు కమ్మలు, వెండి వస్తువులు తీసుకొని పరారయ్యారు. సోమవారం ఉదయం షాపులు తీసిన యజమానులు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సీఐ నరసింహారావు, రూరల్ ఎస్సై ప్రభాకర్‌తో పాటు, డాగ్‌స్వాడ్, క్లూస్‌టీం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే సెంటర్‌లో బంగారుషాపులను దొంగలు లక్ష్యంగా చేసుకోవడం పట్ల భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment