ఏడాది క్రితం నగరంలో అనుమానాస్పదంగా విజయ మృతి
నేటికీ చిక్కని నిందితుల జాడ
వంద మందిని విచారించిన పోలీసులు
కాజీపేట: ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా కొట్టి చంపి ఏడాది కాలం గడిచినా.. హంతకుల ఆనవాళ్లు పోలీసులకు చిక్కకపోవడం చర్చనీ యాంశంగా మారింది. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణం 62వ డివిజన్ రహమత్ నగర్ కాలనీలో ఉండే కోన విజయ (68) అనే మహిళ గత ఏడాది డిసెంబర్ 14న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి అర్ధరాత్రి విగతజీవిగా ఇంటి పక్క సందులో కనిపించింది. విజయ మృతదేహంపై దుస్తులు సరిగ్గా లేకపోవడంతోపాటు బంగారు నగలు కనిపించకుండాపోయాయి. వెంటనే స్థానికుల సాయంతో విజయ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విభిన్న కోణాల్లో పోలీసుల విచారణ..
పోలీసు అధికారులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సభ్యులు, డ్వాగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాల కోసం ప్రయత్నాలను ముమ్మ రం చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయ దాదాపు 16 గంటలపాటు పట్టణంలో ఎక్కడ ఉంది.. ఒంటిపై ఉన్న బంగారు నగల కోసమే నిందితులు హత్యచేసి ఇంటి వద్ద పడేసి ఉంటారా.. లేక తెల్సిన వాళ్లకు అప్పుడప్పుడు చిన్న మొత్తంలో నగదును ఇస్తుండే విజయను మరెవరైనా హత్య చేశారా..
అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినా ఆచూకీ లభించలేదు. అయితే .. విజయను ఏమార్చి కిడ్నాప్ చేసిన నిందితులు తలపై బలంగా కొట్టి చంపడంతోపాటు శరీరాన్ని పూర్తిగా సబ్బు పెట్టి కడిగి మృతురాలి ఇంటి పక్కన ఉన్న గల్లీలోనే అర్ధరాత్రి వేళ పడేసి వెళ్లారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో వెతికినా హత్యప్రదేశాన్ని గుర్తించకుండా ఉండేందుకు నిందితులు సబ్బుతో కడిగి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమైంది.
మృతురాలి శరీరంపై ఉన్న బంగారు నగల కోసమే హత్య చేసి ఉంటారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉండి ఉంటాయా.. అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పోలీసులకు నిందితులకు సంబంధించిన ఆచూకీ చిక్కకపోవడం అందరిని ఆశ్యర్యం కలిగిస్తుంది. హత్య జరిగినప్పుడు ఉన్న అధికారులు బదిలీపై వెళ్లడంతో కొత్తగా వచ్చిన అధికారులు హత్య కేసు ఫైల్‌ను తిరిగి తెరచి విచారణ జరుపుతున్నారు. ఘటనా సమయంలో ఉన్న అధికారులు ఒక క్రమపద్దతిలో విచారణ చేయకపోవడం కారణంగానే సమస్య తీవ్రత పెరగడంతోపాటు నిందితులు దొరక్కుండా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు ఇప్పటి వరకు సుమారు 100మందిని విచారించారు. చిన్న క్లూ దొరికినా విడిచి పెట్టకుండా నేరస్తుల ఆట కట్టిస్తున్న పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. విజయ కేసులో నానాటికీ చిక్కుముడులు పెరుగుతున్నాయి. మొదట్లో కేసును సునాయాసంగా పరిష్కరించవచ్చని భావించిన పోలీసులకు గతంలో వచ్చిన దృశ్యం సినిమాను జ్ఞప్తికి తేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సీపీ అంబర్ కిశోర్ ఝా క్రైమ్ సమీక్ష సమావేశాల్లో తరచూ ఈ కేసును పరిష్కరించాలంటూ ఆదేశిస్తున్నప్పటికీ పోలీసుల విచారణ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment