స్వర్ణ కాంతులు..
నేడు దంతెరాస్...
నగరంలో ముస్తాబైన జ్యువెలరీ షాపులు
పెరగనున్న స్వర్ణాభరణాల విక్రయాలు
సందడిగా మారనున్న గోల్డ్ మార్కెట్లు
20 శాతం వ్యాపారం పెరుగుతుందని అంచనాలు
సిటీబ్యూరో: మహానగరం స్వర్ణకాంతులు సంతరించుకుంటోంది. అంగరంగవైభవంగా ఐదు రోజులపాటు జరిగే దీపావళి పర్వదినం తొలి రోజున(సోమవారం)వచ్చే దంతెరాస్(ధన త్రయోదశి)కు...నగరంలోని ప్రతి ఇళ్లు, ప్రతి దుకాణం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. కొత్త అందాలు సంతరించుకుంటున్నాయి. పురాణేతిహాసాల ప్రకారం..పాలసముద్రం చిలికినపుడు దంతెరాస్ రోజున శ్రీమహాలక్ష్మి అవతరించింది. లక్ష్మీదేవిని ఈ రోజున యథాశక్తి పూజిస్తే అనంత శుభాలు, అష్టైశ్వర్యాలు సమకూరుతాయని, లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే క్రమంలో ఎంతో కొంత సువర్ణాన్ని కొనుగోలు చేస్తే సర్వశుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇదే విశ్వాసంతో ఉన్న మహిళలకు నగరంలోని ప్రముఖ స్వర్ణ, వజ్రాభరణాల దుకాణాలు పలు ఆకర్షణీయమైన ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. బంగారం ధర ఎక్కువైనా నాణ్యత, మన్నిక, ఆకర్షణ, హోదాకు చిహ్నం అని భావిస్తుండడంతో పలువురు మహిళలు, ఉద్యోగులు తమ స్తోమతను బట్టి స్వర్ణాభరణాల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. దీంతో నగరంలోని అబిడ్స్, కోఠి, అమీర్‌పేట్, బషీర్‌బాగ్, బంజారాహిల్స్,చార్మినార్, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్ తది తర ప్రాంతాల్లో ఉన్న బంగారు, వజ్రాభరణాల దుకాణాలు ప్ర త్యేక అమ్మకాలకు సిద్ధమయ్యా యి.
వినియోగదారుల సందడితో నేటి నుంచి దుకాణాలు కిటకిటలాడే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ధనలక్ష్మి పూజావిధానంలో నూతనంగా కొనుగోలు చేసిన స్వర్ణాభరణాలకు విశేష ప్రాధాన్యత ఉంటుందని వేదపండితులు సైతం సెలవిస్తుండడంతో ఆభరణాల అమ్మకాలు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం బంగా రం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం(పదిగ్రాములు) కు రూ.26 వేలు, 22 క్యారెట్ల బంగారం(పదిగ్రాములు)కు రూ.24,310 ఉందని వ్యాపారులు తెలిపారు. రోజురోజుకూ ధరవరల్లో మార్పులు అనివార్యమని చెప్పారు. మహానగర వ్యాప్తంగా వజ్రాభరణాల, స్వర్ణాభరణాల వ్యాపా రం ఈ దీపావళి పర్వదినం సందర్భంగా సుమారు రూ.50 కోట్లకు పైమాటేనని తెలి పారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యుడు సతమౌతున్నప్పటికీ దంతెరాస్ సెంటిమెంట్‌ను గౌరవించేవారూ లేకపోలేదని.. దీంతో గతేడాదితో పోలిస్తే బంగారం, ఆభరణాల అమ్మకాల్లో సుమారు 20 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నామన్నారు. ఇక ఆదివారం రాత్రి నుంచే పలు బంగారం దుకాణాల్లో సందడి కన్పిం చింది. షాపులను ప్రత్యేకంగా అలంకరించడం..ఆఫర్లు ప్రకటించడం..వెరైటీ ఆభరణాలు తయారు చేయడం ద్వారా ఆకర్షిస్తున్నారు.