అబిడ్స్: కేంద్ర ప్రభుత్వ కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా గ్రేటర్ హైదరాబాద్‌లోని జ్యువెలరీ దుకాణాలు మూతపడ్డాయి. ఆలిండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫెడరేషన్ పిలుపు మేరకు జంటనగరాల్లో దాదాపు వెయ్యి దుకాణదారులు బుధవారం బంద్‌లో పాల్గొన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా రెండు లక్షలకు పైగా జ్యువెలరీ కొనుగోలు చేసిన పక్షంలో తప్పనిసరిగా పాన్‌కార్డ్ వివరాలు దుకాణదారుడికి తెలపాలని నిబంధన పెట్టారు.
దీనిని వ్యతిరేకిస్తున్న జ్యువెలరీ దుకాణాల యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో 5 లక్షలకు పైగా జ్యువెలరీ కొనుగోలు చేసిన సమయంలో పాన్‌కార్డ్ వివరాల నిబంధన ఉండగా, తాము రూ.10 లక్షలకు పైగా కొన్నవారికే వర్తింపజేయాలని కోరుతున్నామని... ఇవన్నీ వదిలేసి కేవలం రూ. 2 లక్షలకు నిబంధనను కుదించడం తమను ఇబ్బందులకు గురి చేయాడానికే అని వ్యాపారులు నిరసనకు దిగారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజుకు దాదాపు రూ.100 కోట్ల వరకు జ్యువెలరీ వ్యాపారాలు జరుగుతున్నాయి. జ్యువెలరీ షాపుల బంద్తో అటు ప్రభుత్వానికి, ఇటు వ్యాపారులకు ఒక్కరోజులోనే భారీ నష్టాలు వచ్చాయి.
వారికి కార్డులే ఉండవు కదా...
కేంద్ర ప్రభుత్వం వెంటనే రూ. 2 లక్షల నిబంధనను ఎత్తివేయకుంటే జ్యువెలరీ వ్యాపారులంతా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ట్విన్‌సిటీస్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫెడరేషన్ అధ్యక్షుడు కైలాష్ చరణ్, కార్యదర్శి ప్రవీణ్ అగర్వాల్ హెచ్చరించారు. బుధవారం బంద్ సందర్భంగా వారు సాక్షితో మాట్లాడుతూ... నేడు సామాన్యుడు సైతం పెళ్లి చేయాలనుకుంటే రూ.4 నుంచి రూ 5 లక్షల వరకు బంగారు నగలను కొనుగోలు చేస్తున్నారని అయితే వారి వద్ద మాత్రం పాన్‌కార్డ్‌లు లేవని గుర్తుచేశారు. ఉన్నత వర్గాల కోసం రూ.10 లక్షలకు పైగా నిబంధనను వర్తింపజేస్తే వ్యాపారులకు, ప్రభుత్వానికి ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు.