ఉత్తరానికి వెళ్లే రైలు | CM Revanth Reddy decision on Hyderabad Metro Rail New corridors | Sakshi
Sakshi News home page

ఉత్తరానికి వెళ్లే రైలు

Published Thu, Jan 2 2025 5:05 AM | Last Updated on Thu, Jan 2 2025 5:06 AM

CM Revanth Reddy decision on Hyderabad Metro Rail New corridors

సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేట్, మేడ్చల్‌ వరకు రెండు కొత్త మెట్రో కారిడార్లు

జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట 22 కి.మీ.. ప్యారడైజ్‌ నుంచి మేడ్చల్‌కు 23 కి.మీ.

కొత్త సంవత్సరం తొలి రోజున సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం..

డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశాలు 

గత నవంబర్‌లోనే ఫ్యూచర్‌సిటీ, పటాన్‌చెరు, ఇతర మెట్రో మార్గాలపై ప్రకటన 

అన్నీ పూర్తయితే.. 11 కారిడార్లతో 240.4 కిలోమీటర్లకు చేరనున్న హైదరాబాద్‌ మెట్రో 

ఉత్తర తెలంగాణవాసులకు ప్రయాణం ఇక సులువు: పొన్నం

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఉత్తర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. నగర ఉత్తర ప్రాంతాలను అనుసంధానిస్తూ రెండు కీలకమైన మెట్రో రైలు కారిడార్లను నిర్మించాలని నిర్ణయించారు. ప్యారడైజ్‌ నుంచి మేడ్చల్‌ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు 22 కిలోమీటర్ల పొడవుతో రెండు కారిడార్లకు ఆమోదం తెలిపారు. 

వీటికి సంబంధించి డీపీఆర్‌ తయా రు చేయాలని.. మెట్రో రైల్‌ ఫేజ్‌–2 ‘బీ’లో భాగంగా ఈ రెండు కారిడార్లను కూడా కేంద్రం అనుమతి కోసం పంపించాలని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డిని ఆదేశించారు. సీఎం బుధవారం ఈ అంశంపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, ఎన్వీఎస్‌ రెడ్డిలతో చర్చించారు. 

ప్రతిపాదిత కారిడార్లు ఇవీ.. 
ప్యారడైజ్‌ మెట్రోస్టేషన్‌ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ మీదుగా మేడ్చల్‌ వరకు దాదాపు 23 కిలోమీటర్లు కారిడార్‌ ఉంటుంది. ఇది నిజామాబాద్‌/ఆదిలాబాద్‌ వెళ్లే మార్గం (నేషనల్‌ హైవే నంబర్‌ 44) వెంట కొనసాగుతుంది. 

అలాగే జేబీఎస్‌ (జూబ్లీ బస్‌స్టేషన్‌) మెట్రోస్టేషన్‌ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ మీదుగా శామీర్‌పేట్‌ వరకు 22 కిలోమీటర్ల కారిడార్‌ నిర్మిస్తారు. ఇది కరీంనగర్‌/రామగుండం వెళ్లే రాజీవ్‌ రహదారి వెంట కొనసాగుతుంది. 

ఇప్పటికే ఈ రెండు మార్గాల్లో ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ కారిడార్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ నిర్ణయించింది కూడా. ఈ క్రమంలో ఎక్స్‌ప్రెస్‌ కారిడార్లు, మెట్రో కలసి డబుల్‌ డెక్కర్‌ మార్గంగా నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి పూర్తయితే ట్రాఫిక్‌ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. 

గతంలో తాను మల్కాజిగిరి ఎంపీగా ఉన్నందున ఆ ప్రాంతం ట్రాఫిక్‌ సమస్యలపై, కారిడార్ల రూట్‌ మ్యాప్‌లపై అవగాహన ఉందని... అయినా రూట్‌మ్యాప్‌ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ సూచనలు, సలహాలను తీసుకోవాలని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డికి సీఎం రేవంత్‌ సూచించారు. 

మూడు నెలల్లో డీపీఆర్‌  
సీఎం ఆదేశాల మేరకు ఉత్తర ప్రాంతంలోని రెండు మెట్రో కారిడార్లకు సంబంధించి మూడు నెలల్లో డీపీఆర్‌ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఈ రెండు కారిడార్లను మెట్రో రెండో దశలోని పార్ట్‌ ‘బీ’లో భాగంగా పరిగణిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్‌కు అనుమతి లభించిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తామని వెల్లడించారు. వీటి నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌గా చేపట్టనున్నట్టు తెలిపారు. 

రెండు నెలల కిందే రెండోదశ ఆమోదం 
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ రెండోదశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం గత నవంబర్‌లోనే ఆమోదం తెలిపింది. రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర పార్ట్‌–ఏ కింద ఐదు కారిడార్ల నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధం చేశారు. అలాగే పార్ట్‌–బి కింద శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌ సిటీ (స్కిల్‌ యూనివర్సిటీ) వరకు 40 కిలోమీటర్ల పొడవున ఆరో కారిడార్‌ నిర్మించనున్నారు. 

ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన ప్యారడైజ్‌– మేడ్చల్, జేబీఎస్‌– శామీర్‌పేట కారిడార్లను కూడా పార్ట్‌–బిలోనే చేర్చనున్నారు. ఇప్పటికే మూడు కారిడార్లలో నడుస్తున్న 69 కిలోమీటర్ల తొలిదశ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టుగా అధికారులు చెబుతున్నారు. రెండో దశలోని పార్ట్‌–ఏ, పార్ట్‌–బి మార్గాలు కూడా పూర్తయితే... హైదరాబాద్‌ మెట్రోరైల్‌ 11 కారిడార్లు, 240.4 కిలోమీటర్లకు చేరుతుంది. 

ఉత్తర ప్రాంతాలకు ఎంతో మేలు: మంత్రి పొన్నం ప్రభాకర్‌ 
శామీర్‌పేట, మేడ్చల్‌లకు రెండు కొత్త మెట్రో కారిడార్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ తీసుకున్న నిర్ణయం మంచి పరిణామమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ వైపు వెళ్లే వాహనాలకు, ప్రయాణికులకు నగరంలోని ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని గుర్తు చేశారు. ఈ రూట్లలో ఇప్పటికే ఎక్స్‌ప్రెస్‌ రోడ్లు మంజూరువడం, తాజాగా మెట్రో నిర్మాణం చేపట్టనుండటంతో.. ఈ ప్రాంతాల ప్రజల కష్టాలు తీరుతాయని మంత్రి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement