పసిడికి పెరిగిన డిమాండ్‌ | India gold demand to hit four-year low amid price rally says World Gold Council | Sakshi
Sakshi News home page

పసిడికి పెరిగిన డిమాండ్‌

Published Sat, Nov 2 2024 4:16 AM | Last Updated on Sat, Nov 2 2024 8:08 AM

India gold demand to hit four-year low amid price rally says World Gold Council

సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 248.2 టన్నులు 

ఆర్‌బీఐ నుంచి కొనసాగిన కొనుగోళ్లు  

2024లో 750 టన్నులుగా ఉండొచ్చు 

ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక వెల్లడి

ముంబై: దిగుమతి సుంకం తగ్గింపుతో బంగారానికి డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో 248.3 టన్నులుగా నమోదైంది. ముఖ్యంగా సుంకం తగ్గింపు ఆభరణాల కొనుగోళ్లను పెంచినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ‘2024 క్యూ3 గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌’ నివేదిక తెలిపింది. ‘‘బంగారం ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరడంతో.. ధరలు తగ్గే వరకు కొనుగోళ్ల కోసం ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించొచ్చు. దీంతో పూర్తి ఏడాదికి (2024) బంగారం డిమాండ్‌ 700–750 టన్నుల మేర ఉంటుంది. గతేడాదితో పోలి్చతే కొంత తక్కువ. 

2024 చివరి త్రైమాసికంలో ధనత్రయోదశి, వివాహాల సీజన్‌ మొత్తం మీద బంగారం డిమాండ్‌కు ఊతంగా నిలుస్తాయి’’అని ఈ నివేదిక తెలిపింది. 2023లో బంగారం డిమాండ్‌ 761 టన్నులుగా ఉంది. ధనత్రయోదశి సందర్భంగా డిమాండ్‌ పెరగడంతో మంగళవారం ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములకు రూ.300 పెరిగి రూ.81,400కు చేరడం గమనార్హం. ఇక విలువ పరంగా చూస్తే సెప్టెంబర్‌ క్వార్టర్‌లో బంగారం డిమాండ్‌ 53 శాతం పెరిగి రూ.1,65,380 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.1,07,700 కోట్లుగా ఉంది. బంగారం, వెండి దిగుమతులపై 15 శాతంగా ఉన్న కస్టమ్స్‌ డ్యూటీని 6 శాతానికి బడ్జెట్‌లో తగ్గించడం తెలిసిందే.  

బంగారం దిగుమతులు 22% జంప్‌  
పస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు జోరుగా సాగుతున్నాయి. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఆరు నెలల కాలంలో 22 శాతం అధికంగా 27 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బంగారం దిగుమతులు 22 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత పండుగల సీజన్‌ దిగుమతులు పెరగడానికి కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో మొత్తం మీద బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్‌ డాలర్ల మేర ఉన్నాయి. 

అత్యధికంగా స్విట్జర్లాండ్‌ 40 శాతం మేర మన దేశానికి బంగారం ఎగుమతి చేయగా, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటా ఆక్రమించాయి. దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం దిగుమతుల వాటా 5 శాతంగా ఉంటుంది. బంగారం దిగుమతులు పెరగడంతో దేశ వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) మొదటి ఆరు నెలల్లో (సెప్టెంబర్‌ చివరికి) 137.44 బిలియన్‌ డాలర్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వాణిజ్య లోటు 119.24 బిలియన్‌ డాలర్లుగానే ఉండడం గమనించొచ్చు. బంగారానికి చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద వినియోగదారుగా భారత్‌ ఉంటోంది. వెండి దిగుమతులు సైతం 376 శాతం పెరిగి 2.3 బిలియన్‌ డాలర్లుగా ఏప్రిల్‌–సెప్టెంబర్‌ కాలానికి నమోదయ్యాయి. కరెంటు ఖాతా లోటు ఒక శాతం ఎగసి 9.7 బిలియన్‌ డాలర్లకు చేరింది.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement