
ఈ వారం సైతం లాభాల పరుగు!
ఫెడ్, ఎఫ్‌పీఐ పెట్టుబడుల బూస్ట్
మార్చి ఎఫ్‌అండ్‌వో ముగింపుపై కన్ను
మార్కెట్లో ట్రెండ్‌పై విశ్లేషకుల అంచనాలు
ముంబై: సెంటిమెంటుపై ప్రభావం చూపగల అంశాలు కొరవడిన నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా విదేశీ అంశాలు దోహదపడనున్నట్లు తెలియజేశారు. గత వారం మార్కెట్లు నష్టాల నుంచి బయటపడి ఒక్కసారిగా స్పీడందుకోవడంతో స్వల్ప కాలానికి లాభాల పరుగు కొనసాగనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. అయితే ఈ వారం మార్చి నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. దీంతో సెంటిమెంటు సానుకూలంగా ఉన్నప్పటికీ కొంతమేర ఆటుపోట్లకు అవకాశమున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
23,100 వద్ద సపోర్ట్
ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి తొలుత 23,100 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించే వీలున్నట్లు టెక్నికల్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జోరందుకున్న నేపథ్యంలో 100 రోజుల చలన సగటు 23,522 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని అంచనా వేశారు. 23,600 స్థాయి కీలకంకాగా.. 23,700, 23,800ను అధిగమిస్తే మరింత బలపడవచ్చని భావిస్తున్నారు. స్వల్ప కాలంలో 24,069 వద్ద తీవ్ర అవరోధం ఎదురుకావచ్చని అంచనా.
ఇతర అంశాలు
యూఎస్ టారిఫ్ వార్తలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా అమ్మకాలతోపాటు.. డాలరు ఇండెక్స్, ముడిచమురు ధరల కదలికలపై ఈ వారం ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నారు. గత వారం అమ్మకాల బాట వీడి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు దిగారు. అయితే దేశీ ఫండ్స్ విక్రయాలవైపు చూపు సారించాయి. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు కొంతమేర బలహీనపడింది. దీంతో రూపాయి 1 శాతంమేర బలపడింది. ఈ నేపథ్యంలో గత వారం మార్కెట్లు జోరందుకున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. యూఎస్ మార్కెట్లు సైతం పుంజుకున్నప్పటికీ రానున్న రోజుల్లో హెచ్చుతగ్గులు ఎదురుకావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
గత వారమిలా
గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి జోరందుకోవడంతో సెన్సెక్స్ 77,000 మైలురాయికి చేరువైంది. నిఫ్టీ కీలకమైన 23,300ను అధిగమించింది. నికరంగా సెన్సెక్స్ 3,077 పాయింట్లు(4.2 శాతం) జంప్‌చేసి 76,906 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 953 పాయింట్లు(4.3 శాతం) ఎగసి 23,350 వద్ద ముగిసింది. ఇదేవిధంగా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 7 శాతం జంప్‌చేయగా.. స్మాల్ క్యాప్ మరింత వేగంగా 8 శాతం జోరు చూపింది.
గణాంకాలపై దృష్టి
2024 చివరి త్రైమాసిక (అక్టోబర్–డిసెంబర్) యూఎస్ జీడీపీ త్రైమాసికవారీ గణాంకాలు గురువారం(27న) వెల్లడికానున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం గతేడాది క్యూ4లో రియల్ జీడీపీ 2.3 శాతం పుంజుకుంది. ఫిబ్రవరి నెలకు యూఎస్ మన్నికైన వస్తువుల (డ్యూరబుస్) ఆర్డర్ల వివరాలు బుధవారం(26) వెలువడనున్నాయి. ఈ బాటలో శుక్రవారం(28న) ఫిబ్రవరి నెలకు కీలక పీసీఈ ధరల ఇండెక్స్‌ను ప్రకటించనుంది. జనవరిలో 0.3%
పెరిగింది.
ఎఫ్‌పీఐల యూటర్న్
కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత వారం చివర్లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నారు. ఉన్నట్టుండి పెట్టుబడుల బాట పట్టారు. చివరి రెండు రోజుల్లో నగదు విభాగంలో రూ. 11,000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. దీంతో గత వారం నికరంగా 19.4 కోట్ల డాలర్లు(రూ. 1,700 కోట్లు) విలువైన అమ్మకాలు నమోదయ్యాయి. అంతకుముందు వారం 4 రోజుల ట్రేడింగ్‌లోనే 60.4 కోట్ల(రూ. 5,230 కోట్లు) డాలర్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం గమనార్హం! కాగా.. మార్చిలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 31,719 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, జనవరిలో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులు వెనక్కి
తీసుకున్నారు.
టాప్–10 కంపెనీల స్పీడ్
రూ. 3 లక్షల కోట్ల విలువ ప్లస్
గత వారం మార్కెట్ల జోరుతో మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)రీత్యా టాప్–10 లిస్టెడ్ కంపెనీలు భారీగా బలపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే వీటి మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లకుపైగా పెరిగింది. ప్రయివేట్ రంగ దిగ్గజాలు ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రధానంగా బలపడగా.. ఐటీసీ మాత్రమే డీలాపడింది. ప్రామాణిక ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ 4.2 శాతం చొప్పున ఎగశాయి. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ అత్యధికంగా రూ. 64,426 కోట్లకుపైగా పుంజుకుని 9,47,628 కోట్లను అధిగమించింది. ఈ బాటలో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ. 53,286 కోట్లు జంప్‌చేసి రూ. 9,84,354 కోట్లను దాటింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువకు రూ. 49,105 కోట్లు జమయ్యింది. దీంతో బ్యాంక్ విలువ రూ. 13,54,275 కోట్లను తాకింది.
రిలయన్స్ సైతం
టాప్–10 దిగ్గజాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ దాదాపు రూ. 39,312 కోట్లు బలపడి రూ. 17,27,340 కోట్లకు చేరింది. ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ విలువ సుమారు రూ. 30,954 కోట్లు ఎగసి రూ. 5,52,846 కోట్లను అధిగమించింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 24,259 కోట్లు పెరిగి రూ. 12,95,058 కోట్లను తాకింది. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ విలువ రూ. 22,535 కోట్లు మెరుగుపడి రూ. 6,72,024 కోట్లకు చేరింది. ఎఫ్‌ఎంసీజీ బ్లూచిప్ హిందుస్తాన్ యూనిలీవర్ క్యాపిటలైజేషన్ రూ. 16,823 కోట్లు ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment