
క్యూ4 జీడీపీ గణాంకాలు కీలకం
బుధవారం ‘మహాశివరాత్రి’ సెలవు
ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులే
మరోసారి ఆటుపోట్లు తప్పకపోవచ్చు
దేశీ స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌పై నిçపుణుల అంచనాలు
ముంబై: ప్రధానంగా ప్రపంచ పరిణామాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాల కారణంగా నేలచూపులకే పరిమితమవుతున్నాయి. ఈ బాటలో మరోసారి ఆటుపోట్లు చవిచూడనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
చైనా ఎఫెక్ట్
యూఎస్ టారిఫ్‌లు తదితర పాలసీ నిర్ణయాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. కొద్ది నెలలుగా మార్కెట్లు దిద్దుబాటు ధోరణిలో సాగుతున్నాయి. దీంతో మార్కెట్లు ఎక్కడ టర్న్‌అరౌండ్ అయ్యేదీ అంచనా వేయడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల మరోసారి చైనా మార్కెట్లవైపు విదేశీ ఇన్వెస్టర్లు దృష్టి పెట్టినట్లు పేర్కొంటున్నారు. ఫలితంగా దేశీ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నట్లు తెలియజేశారు. దీంతో పలువురికి ఆదాయపన్ను ఉపశమనాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్, వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.25 శాతం కోత పెట్టిన ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష పెద్దగా ప్రభావం చూపలేకపోయినట్లు ప్రస్తావించారు.
వారాంతాన...
గత కేలండర్ ఏడాది(2024) చివరి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు శుక్రవారం(28న) వెల్లడికానుంది. అక్టోబర్–డిసెంబర్(క్యూ4)లో దేశ జీడీపీ పురోగతి గణాంకాలు విడుదలకానున్నాయి. జులై–సెప్టెంబర్(క్యూ3)లో జీడీపీ 5.4 శాతం వృద్ధి చూపింది. మరోపక్క యూఎస్ క్యూ4 జీడీపీ రెండో అంచనాలు 27న వెలువడనున్నాయి. ముందస్తు అంచనాలు 2.3 శాతం వృద్ధిని సంకేతించాయి. గత మూడు త్రైమాసికాలలో ఇది తక్కువకాగా.. క్యూ3లో 3.1 శాతం పురోగతి నమోదైంది. ఇదే రోజు జనవరి నెలకు యూఎస్ కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు, డ్యురబుల్ గూడ్స్ ఆర్డర్లు, వ్యక్తిగత ఆదాయం, వ్యయాలు తదితర గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. ఇన్వెస్టర్లు గ్లోబల్ అంశాలపైనా దృష్టి పెట్టనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసె స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు.
గత వారమిలా..గత వారం(17–21) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోవారంలోనూ డీలా పడ్డాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్ నికరంగా 628 పాయింట్లు(0.85 శాతం) క్షీణించి 75,311 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 133 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 22,796 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్‌ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.6 శాతం, 1 శాతం చొప్పున బలపడటం గమనార్హం!
ఇతర అంశాలు
రష్యా– ఉక్రెయిన్ యుద్ధం సంబంధిత వార్తలు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి తీరు సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు ఖేమ్కా పేర్కొన్నారు. దేశీ మార్కెట్లలో బలహీన సెంటిమెంటు నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు వినోద్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఆర్జన మెరుగుపడటం, గ్లోబల్ లిక్విడిటీ, కరెన్సీ నిలకడం వంటి సానుకూల పరిస్థితులు నెలకొనేవరకూ మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యే వీలున్నట్లు నిపుణులు వివరించారు. యూఎస్ విధిస్తున్న టారిఫ్‌లపై ఆందోళనలు దేశీ మార్కెట్లతోపాటు.. పలు ఇతర మార్కెట్లను సైతం ప్రభావితం చేయనున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలియజేశారు. సమీప భవిష్యత్‌లో టారిఫ్ వార్తలు ట్రెండ్‌ను నిర్దేశించవచ్చని అంచనా వేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లు కీలక భాగస్వామ్య దేశాలను ప్రభావితం చేయనున్నట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. దీనికితోడు దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు కొంతమేర నిరాశపరుస్తున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment