![Markets to track inflation data, global trends this week says market experts](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/MARKET-OUTLOOK.jpg.webp?itok=sldZa6gL)
విదేశీ ఇన్వెస్టర్ల తీరుపైనా దృష్టి
ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల ఎఫెక్ట్
ఈ వారం దేశీ మార్కెట్ల ట్రెండ్!
స్టాక్ విశ్లేషకుల తాజా అంచనాలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వస్తున్న నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు ఇతర అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ప్రధానంగా ద్రవ్యోల్బణ గణాంకాలు, ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు ప్రభావం చూపనున్నట్లు పేర్కొన్నారు. వీటితోపాటు యూఎస్ రిటైల్ సేల్స్, యూకే జీడీపీ గణాంకాలు తదితరాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. ఇతర వివరాలు చూద్దాం..
క్యూ3 ఫలితాలకు రెడీ
ఇప్పటికే అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాల సీజన్ ముగింపునకు వచ్చింది. ఈ బాటలో మరికొన్ని కంపెనీలు క్యూ3 పనితీరు ప్రకటించనున్నాయి. జాబితాలో ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, వొడాఫోన్ ఐడియా, సెయిల్, నాల్కో, లుమాక్స్, అపోలో హాస్పిటల్స్, అశోకా బిల్డ్‌కాన్, అవంతీ ఫీడ్స్, రెయిన్‌బో చి్రల్డన్స్, బిర్లా కేబుల్, బామర్‌లారీ, బాటా, ఎస్కార్ట్స్, గలక్సీ సర్ఫక్టేంట్స్, జిలెట్ తదితరాలున్నట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు.
12న గణాంకాలు
బుధవారం(12న) జనవరి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ), డిసెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐసీ) గణాంకాలు వెలువడనున్నాయి. డిసెంబర్‌లో సీపీఐ 5.22 శాతంగా నమోదైంది. ఇక నవంబర్‌లో ఐఐపీ 3.5 శాతం వృద్ధిని చూపింది. ఈ బాటలో జనవరి నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) గణాంకాలు 14న విడుదలకానున్నాయి. డిసెంబర్‌లో డబ్ల్యూపీఐ 2.37 శాతంగా నమోదైంది. ఇదే విధంగా జనవరి వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. డిసెంబర్‌లో వాణిజ్య లోటు 21.94 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
అంతర్జాతీయంగా యూఎస్ రిటైల్ అమ్మకాలు, ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగం, యూకే జీడీపీ గణాంకాలూ కీలకంగా నిలవనున్నట్లు సింఘానియా తెలియజేశారు. ఫెడ్ గత పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా 4.25–4.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇవికాకుండా డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) తీరు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు వివరించారు.
గత వారమిలా
గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు(0.5 శాతం) బలపడి 77,860 వద్ద ముగిసిది. నిఫ్టీ 78 పాయింట్లు(0.3%) పుంజుకుని 23,560 వద్ద స్థిరపడింది.
చివరికి ఢిల్లీ
కోటలో పాగా దాదాపు మూడు దశాబ్దాల తదుపరి మళ్లీ న్యూఢిల్లీ కోటలో బీజేపీ పాగా వేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ దశాబ్ద కాలం పాలనకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెక్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల బాటలో రాష్ట్రంలోనూ సీట్లు సాధించడంతో స్థానికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో స్టాక్ మార్కెట్లలో స్వల్ప కాలానికి సెంటిమెంటు బలపడనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొన్నారు. ప్రో త్సాహకర బడ్జెట్, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత దీనికి జత కలవనున్నట్లు అభిప్రాయపడ్డారు.
అమ్మకాలు వీడని ఎఫ్‌పీఐలు
ఇటీవల దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత వారం సైతం ఇదే బాటలో సాగారు. ఫిబ్రవరి తొలి వారంలో నికరంగా రూ. 7,300 కోట్ల(84 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. జనవరిలోనూ ఎఫ్‌పీఐలు నగదు విభాగంలో రూ. 78,027 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే అంతకుముందు అంటే డిసెంబర్ మధ్యలో అమ్మకాలను వీడి కొనుగోళ్లు చేపట్టారు. దీంతో 2024 చివరి నెలలో నికరంగా రూ. 15,446 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment