జాబితాలో బ్యాంకింగ్ దిగ్గజాలు, హెచ్‌యూఎల్, అ్రల్టాటెక్..
యూఎస్ ప్రెసిడెంట్‌గా నేడు ట్రంప్ ప్రమాణ స్వీకారం
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌పై నిపుణుల అంచనాలు
ముంబై: ప్రపంచ దేశాలన్నీ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి నేడు(20న) తెరలేవనుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి యూఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనుండటంతో కొంతకాలంగా వాణిజ్య వర్గాలు అధికంగా ప్రభావితం కానున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వాణిజ్యంతోపాటు ఫైనాన్షియల్ మార్కెట్లపైనా ట్రంప్ ఎఫెక్ట్ ఉండబోతున్నట్లు మరోపక్క ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.
ఇప్పటికే ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు నిరవధికంగా బలపడుతూ 109ను అధిగమించింది. అంతేకాకుండా 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 4.6 శాతాన్ని తాకాయి. ఈ ప్రభావంతో పలు ఆసియా కరెన్సీలతోపాటు రూపాయి సైతం డీలా పడుతోంది. డాలరుతో మారకంలో గత వారం దేశీ కరెన్సీ విలువ 86.62కు పడిపోయింది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను 47వ యూఎస్ ప్రెసిడెంట్‌కానున్న ట్రంప్ నిర్ణయాలు అత్యధికంగా ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు.
బ్లూచిప్స్ జోరు
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఆర్‌ఐఎల్, యాక్సిస్ బ్యాంక్‌తో ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభమైంది.
ఈ వారం మరికొన్ని దిగ్గజాలు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) పనితీరు వెల్లడించనున్నాయి. జాబితాలో బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, సెంట్రల్ బ్యాంకుతోపాటు ఎఫ్‌ఎంసీజీ బ్లూచిప్ హిందుస్తాన్ యూనిలీవర్, డాక్టర్ రెడ్డీస్, అ్రల్టాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్), జొమాటో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఆయా కంపెనీల పనితీరు ఆధారంగా స్టాక్స్‌లో యాక్టివిటీ నమోదయ్యే వీలున్నదని తెలియజేశారు.
బడ్జెట్‌పై కన్ను
క్యూ3 ఫలితాలతోపాటు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. ఆదాయపన్నుసహా పలు రంగాల నుంచి సంస్కరణలకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతులు అందుతున్న విషయం విదితమే. ద్రవ్య విధానాలు, ఆర్థిక వృద్ధి చర్యలు, పెట్టుబడుల కేటాయింపు, కీలక రంగాలలో సంస్కరణలు వంటి పలు అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదేవిధంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు సైతం మార్కెట్లలో సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు.
గత వారమిలా
దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారంలోనూ క్షీణపథంలోనే ముగిశాయి. 17తో ముగిసిన గత వారం సెన్సెక్స్ నికరంగా 760 పాయింట్లు(1 శాతం) నీరసించి 76,618 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 228 పాయింట్లు(1 శాతం) నష్టపోయి 23,203 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ నామమాత్ర నష్టంతో నిలవగా.. స్మాల్‌క్యాప్ 0.8 శాతం డీలా పడింది.
Comments
Please login to add a commentAdd a comment