
యూఎస్ టారిఫ్‌ల ఎఫెక్ట్
ఫెడ్ మినిట్స్‌కూ ప్రాధాన్యత
ఈ వారం ట్రేడింగ్ 4 రోజులే
ఆర్‌బీఐ పరపతి సమీక్షపై దృష్టి
ట్రెండ్‌పై నిపుణుల అంచనా
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు అత్యధిక సమయం పతనబాటలో సాగవచ్చని పలువురు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్ష, యూఎస్ టారిఫ్‌ల ప్రభావం, ఫెడ్ గత పాలసీ మినిట్స్ వెల్లడి తదితర పలు అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. దీంతో తీవ్ర ఆటుపోట్లకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం..
ముంబై: గత వారాంతాన యూఎస్ స్టాక్స్ అత్యంత భారీ పతనాన్ని చవిచూశాయి. నేడు(7న) యూఎస్ స్టాక్ మార్కెట్లకు ‘బ్లాక్‌మండే’ ఎదురుకావచ్చని అక్కడి నిపుణులు అంచనా వేశారు. భారత్‌సహా చైనా, జపాన్ తదితర ప్రధాన దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లను ప్రకటించడంతో అమెరికా ఆరి్ధక వ్యవస్థ దెబ్బతినవచ్చని, మాంద్యంలోకి జారుకోవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లలో సైతం అమ్మకాలకు తెరలేచే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020 తరువాత గత వారం యూఎస్ మార్కెట్లు 6 శాతం పడిపోయాయి. 5 లక్షల కోట్ల డాలర్లకుపైగా మార్కెట్ విలువ ఆవిరైంది. వెరసి ఈ వారం దేశీ మార్కెట్లు పతన బాటలో సాగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కాగా.. గురువారం(10న) శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది.
గత వారమిలా
ప్రపంచ దేశాలపై యూఎస్ టారిఫ్‌ల ఎఫెక్ట్‌తో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు సైతం డీలా పడ్డాయి. ఆటుపోట్ల మధ్య సెన్సెక్స్ నికరంగా 2,050 పాయింట్లు(2.65 శాతం) పతనమై 75,365 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ 615 పాయింట్లు(2.6 శాతం) కోల్పోయి 22,904 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.5 శాతం క్షీణించి 40,509కు చేరగా.. స్మాల్‌క్యాప్ 1.65 శాతం నీరసించి 45,867 వద్ద నిలిచింది.
టీసీఎస్ రెడీ
గురువారం సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ ఈ ఆర్ధిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసిక(క్యూ4) ఫలితాలు విడుదల చేయనుంది. దీంతో జనవరి–మార్చి(క్యూ4) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. కాగా.. అక్టోబర్ మొదలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మార్చి చివవి వారంలో నికర కొనుగోలుదారులుగా మారినప్పటికీ తిరిగి ఏప్రిల్‌లో అమ్మకాల బాట పట్టడం సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొన్నారు. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు రూ. 10,355 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఎఫ్‌పీఐలు ఫిబ్రవరిలో దేశీ స్టాక్స్ నుంచి రూ. 34,574 కోట్లు, జనవరిలో మరో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులు ఉపసంహరించిన సంగతి తెలిసిందే.