
ఈ వారం ట్రేడింగ్ 4 రోజులే
శుక్రవారం హోలీ సెలవు
యూఎస్ టారిఫ్‌ల ప్రభావం
ఆటుపోట్లు తప్పకపోవచ్చు
మార్కెట్లపై నిపుణుల అంచనా
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ పరిస్థితులు, స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నాయి. వీటికితోడు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్‌ల విధింపు చర్యలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. టారిఫ్‌ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ నీరసించవచ్చన్న అంచనాలు తెరమీదకు వస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గత వారం యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలు డీలాపడటంతో నాస్‌డాక్ ఇండెక్స్ పతనమైన సంగతి తెలిసిందే. దీంతో గ్లోబల్ ట్రెండ్ సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. వారాంతాన(14న) హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.
ఐఐపీ, సీపీఐ
జనవరి నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు బుధవారం(12న) విడుదలకానున్నాయి. 3.7 శాతం వృద్ధి నమోదుకాగలదని అంచనా. 2024 జనవరిలో 4.2 శాతం పురోగమించగా.. డిసెంబర్‌లో 3.2 శాతం వృద్ధి చూపింది. ఇక ఫిబ్రవరి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. 2025 జనవరిలో సీపీఐ 3.2 శాతంగా నమోదైంది. 2024 డిసెంబర్‌లో నమోదైన 3 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది.
ఇతర అంశాలూ కీలకమే
దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల నిరంతరంగా అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో ఎఫ్‌పీఐల తీరు మార్కెట్లలో కీలకంగా నిలుస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. కాగా.. మరోవైపు యూఎస్ డాలరుతోపాటు ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం అటు మార్కెట్లను, ఇటు రూపాయినీ దెబ్బతీస్తున్నాయి. వీటితోపాటు రాజకీయ భౌగోళిక అనిశి్చతులు, ముడిచమురు ధరలు సైతం ఇన్వెస్టర్లను ఆందోళనకు లోను చేస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు.
గత వారమిలా
గత వారం(3–7) దేశీ స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాల నుంచి బయటపడ్డాయి. ఇండెక్సులు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ నికరంగా 1,134 పాయింట్లు(1.6 శాతం) ఎగసి 74,333 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 428 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 22,553 వద్ద స్థిరపడింది. యూఎస్ టారిఫ్‌ల విధింపు ఆలస్యంకానున్న అంచనాలు, వీటిపై చర్చలకు ఆస్కారమున్నట్లు వెలువడిన అంచనాలు మార్కెట్లు బలపడేందుకు దోహదం చేసినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్
తెలియజేశారు.
అమ్మకాలువీడని ఎఫ్‌పీఐలు
మార్చి తొలివారంలో రూ. 24,753 కోట్లు
దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ నెలలో ఇప్పటి(7)వరకూ రూ. 24,753 కోట్ల(2.8 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. జనవరిలోనూ రూ. 78,027 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. వెరసి ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటిరకూ రూ. 1.37 లక్షల విలువైన స్టాక్స్ విక్రయించారు. ప్రపంచ వాణిజ్య ఆందోళనలు, దేశీ కార్పొరేట్ ఫలితాల నిరాశ వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. 2024 డిసెంబర్ 13 నుంచి చూస్తే ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్ మార్కెట్ల నుంచి నికరంగా 17.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించారు.
Comments
Please login to add a commentAdd a comment