
తయారీ, సర్వీసుల రంగాలపై దృష్టి
వెల్లడికానున్న దేశ, విదేశీ గణాంకాలు
అమల్లోకిరానున్న యూఎస్ టారిఫ్‌లు
ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ ఈ వారం ప్రధానంగా గణాంకాలపై ఆధారపడనుంది. దేశ, విదేశీ తయారీ, సర్వీసు రంగ గణాంకాలు ఈ వారంలో విడుదలకానున్నాయి. దీనికితోడు పలు దేశాలపై యూఎస్ ప్రభుత్వ తాజా టారిఫ్‌లు బుధవారం(2)నుంచి అమల్లోకి రానున్నాయి. వెరసి ఈ వారం మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా నేడు(31న) స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఇతర వివరాలు చూద్దాం.
జీడీపీ ఎఫెక్ట్
గత కేలండర్ ఏడాది(2024) చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో యూఎస్ జీడీపీ అంచనాలకు అనుగుణంగా నెమ్మదించింది. తుది అంచనాల ప్రకారం వార్షిక ప్రాతిపదికన వృద్ధి 3.1 శాతం నుంచి 2.4 శాతానికి మందగించింది. అయితే కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ తెరతీస్తున్న టారిఫ్‌లు ఆర్థిక వ్యవస్థకు మరిన్ని సవాళ్లు విసరనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బిజినెస్ ప్రణాళికలు, కన్జూమర్ వినియోగం తదితరాలపై ప్రతికూల ప్రభావం చూపే వీలున్నట్లు పేర్కొన్నారు. వెరసి ఈ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రసరించనున్నట్లు అభిప్రాయపడ్డారు.
సుంకాలపై కన్ను
ఈ వారం అమల్లోకిరానున్న ట్రంప్ సుంకాల(టారిఫ్‌లు)పై ప్రపంచవ్తాప్తంగా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సే పేర్కొన్నారు. వీటితోపాటు గణాంకాలను సైతం పరిగణనలోకి తీసుకోనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. మార్కెట్ ప్రభావిత అంశాలు కరవుకావడంతో గణాంకాలు, కీలక వాణిజ్య దేశాలపై యూఎస్ టారిఫ్‌లకు ప్రాధాన్యత ఏర్పడినట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా సైతం వివరించారు. అయితే గతేడాది క్యూ4 జీడీపీ నీరసించిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లపై కఠినంగా వ్యవహరించకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
హెచ్‌ఎస్‌బీసీ పీఎంఐ
బుధవారం మార్చి నెలకు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 56.3 నుంచి 57.6కు బలపడింది. అయితే శుక్రవారం(4న) విడుదలకానున్న మార్చి సర్వీసుల రంగ ఇండెక్స్ తొలి అంచనాలలో 59 నుంచి 57.7కు బలహీనపడింది. కాంపోజిటల్ పీఎంఐ సైతం 58.8 నుంచి 58.6కు స్వల్పంగా వెనకడుగు వేసింది. ఇక విదేశీ మారక నిల్వల వివరాలు సైతం 4న వెల్లడికానున్నాయి.
ఇక ప్రపంచ దేశాలలో చైనా ఎన్‌బీఎస్, కైగ్జిన్ తయారీ గణాంకాలు మార్చి నెలకు సోమవారం(నేడు), మంగళవారం(1న) విడుదలకానున్నాయి. ఈ బాటలో ఫిబవ్రరి నెలకు యూరో దేశాల రిటైల్ ధరల ద్రవ్యోల్బణ రేటు 1న వెల్లడికానుంది.
ఫిబ్రవరిలో కన్జూమర్ ధరల రేటు తొలి అంచనాల ప్రకారం 2.3 శాతంగా నమోదైంది. ఇదేరోజు యూఎస్ ఫిబ్రవరి ఐఎస్‌ఎం తయారీ ఇండెక్స్, ఉపాధి కల్పన గణాంకాలు విడుదలకానున్నాయి. 3న యూఎస్ ఐఎస్‌ఎం సర్వీసుల పీఎంఐ వెల్లడికానుంది. వారాంతాన(4న) వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు వెల్లడికానున్నాయి.
ఇతర అంశాలు
టారిఫ్‌లు, గణాంకాలతోపాటు.. ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో పలు ఇతర అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు వివరించారు. గతేడాది(2024) అక్టోబర్ నుంచీ అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఉన్నట్టుండి గత వారం నికర పెట్టుబడిదారులుగా స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే వారాంతాన(28న) తిరిగి భారీగా అమ్మకాలు చేపట్టారు.
దీంతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు లేదా అమ్మకాలకు ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఇదేసమయంలో డాలరు ఇండెక్స్ బలహీనపడటం, దేశీ కరెన్సీ ఒక్కసారిగా బలపడటం మార్కెట్లకు జోష్‌నిచి్చనట్లు పేర్కొన్నారు. దిగుమతుల బిల్లుపై ప్రభావం చూపే ముడిచమురు ధరలు వెనకడుగు వేస్తున్నప్పటికీ బంగారం ధరలు మెరుస్తుండటం కొంత ప్రతికూలమేనని తెలియజేశారు.
గత వారమిలా..
గత వారం(24–28) దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య నికరంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 509 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 77,415 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 169 పాయింట్లు(0.7%) బలపడి 23,519 వద్ద నిలిచింది. అయితే తిరిగి చిన్న షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం నీరసించింది.
స్మాల్‌క్యాప్ మరింత అధికంగా 1.4% క్షీణించింది. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2024–25)లో సెన్సెక్స్ 3,764 పాయింట్లు (5.1%) ర్యాలీ చేయగా.. నిఫ్టీ 1,192 పాయింట్లు (5.3 శాతం) లాభపడింది. ఈ బాటలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 5.6%, స్మాల్ క్యాప్ 8 శాతం చొప్పున ఎగశాయి. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 25,90,547 కోట్లు పెరిగి 4,12,87,647 కోట్ల(4.82 లక్షల కోట్ల డాలర్లు)కు చేరింది.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
కొద్ది నెలుగా అమ్మకాలకే అధికంగా ఆసక్తి చూపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల పెట్టుబడులవైపు దృష్టి మరల్చారు. వెరసి గత ఆరు సెషన్లలో నికరంగా రూ. 31,000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. పలు కంపెనీల షేర్లు అందుబాటు ధరల్లోకి రావడంతో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
దీంతో ఇటీవల మార్కెట్లు భారీ నష్టాల నుంచి బయటపడి 6 శాతం పుంజుకోడం గమనార్హం. కాగా.. తాజా పెట్టుబడుల ప్రభావంతో మార్చి నెలలో ఎఫ్‌పీఐల నికర అమ్మకాలు రూ. 3,973 కోట్లకు పరిమితమయ్యాయి! ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, జనవరిలో మరింత అధికంగా రూ. 78,027 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విషయం విదితమే.