service sector
-
వృద్ధి బాటలో సేవల రంగం..
దేశీయంగా సెప్టెంబర్‌లో పది నెలల కనిష్టానికి పడిపోయిన సేవల విభాగం సూచీ (పీఎంఐ) అక్టోబర్‌లో తిరిగి కోలుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 58.5కి మెరుగుపడింది. డిమాండ్ పటిష్టంగా ఉండటంతో కొత్త ఆర్డర్లు రావడం, సర్వీసులు పెరగడం, ఫలితంగా ఉపాధి కల్పనకు ఊతం లభించడం మొదలైనవి దీనికి తోడ్పడ్డాయి.తయారీ, సేవల రంగం పనితీరుకు పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్‌ను (పీఎంఐ) కొలమానంగా పరిగణిస్తారు. వివిధ కంపెనీలవ్యాప్తంగా కొత్త ఆర్డర్లు, నిల్వల స్థాయులు, ఉత్పత్తి, ఉద్యోగాల కల్పన తదితర అంశాల్లో పర్చేజింగ్ మేనేజర్లతో నిర్వహించిన సర్వే ఆధారంగా దీని స్కోరు ఉంటుంది. సాధారణంగా ఇది 50కి పైన ఉంటే వృద్ధిని, 50కి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. ‘భారత సర్వీసెస్ పీఎంఐ సెప్టెంబర్ నాటి పది నెలల కనిష్ట స్థాయి నుంచి అక్టోబర్‌లో 58.5 స్థాయికి మెరుగుపడింది. ఉత్పత్తి, డిమాండ్‌తో పాటు ఉద్యోగాల కల్పన విషయంలోనూ భారతీయ సర్వీసుల రంగం గణనీయంగా మెరుగుపడింది’ అని హెచ్ఎస్బీసీ చీఫ్ ఎకానమిస్ట్ ప్రాంజల్ భండారీ తెలిపారు.ఇదీ చదవండి: రూ.55 కోట్లు సమీకరించిన హైదరాబాద్ కంపెనీ -
2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. 2030 నాటికి దేశంలో 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని కోసం సర్వీస్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లను పెంచాలని చెబుతున్నారు. ఇది జరిగితే ఇండియా ఎకానమీ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే.. సంవత్సరానికి 1.65 కోట్ల ఉద్యోగాలను సృష్టించవలసి ఉంటుంది. గత దశాబ్దంలో ప్రతి ఏటా 1.24 కోట్ల ఉద్యోగాలు పెరిగాయని నాటిక్సిస్ ఎస్ఏ సీనియర్ ఎకనమిస్ట్ 'ట్రిన్ న్గుయెన్' సోమవారం ఒక నివేదికలో పేర్కొన్నారు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. అయితే దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉద్యోగావకాశాలు మందకొడిగానే సాగుతున్నాయి. మూడో సారి మోదీ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగం పెద్ద సవాలుగా మారుతుందని పలువురు చెబుతున్నారు.గత దశాబ్దంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించినప్పటికీ, కేవలం 10 శాతం ఉద్యోగాలు మాత్రమే అధికారికంగా ఉన్నాయని న్గుయెన్ రాశారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం, దేశం మొత్తం శ్రామిక శక్తి రేటు 58 శాతంగా ఉంది. ఇది ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. చాలా తక్కువ. ఉద్యోగావకాశాలు ఎప్పుడైతే పెరుగుతాయో.. అప్పుడే ఇతర దేశాలతో భారత్ పోటీ పడగలదని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. -
భారత ఆర్థికవ్యవస్థను ఇంజిన్‌లా ముందుకు తీసుకెళుతున్న సేవారంగం
142 కోట్ల జనాభాలో 120 కోట్ల తక్కువ ఆదాయవర్గం కొనుగోలు శక్తి పెరిగితే ప్రగతి రథం పరుగులు పెడుతుంది! ప్రపంచంలో అనేక అభివృద్దిచెందిన దేశాలు, వర్ధమాన దేశాలు నేడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆయా దేశాల్లో ఆర్థిక మందగమనం తరచు దర్శనమిస్తోంది. అయితే, ప్రపంచంలో అత్యధిక జనాభా, విస్తృత మార్కెట్ ఉన్న ఇండియా అంతర్జాతీయ కుదుపుల ప్రభావం పెద్దగా లేకుండా ముందుకు సాగుతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6–7 శాతం మధ్య కొనసాగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను సేవారంగం రైలింజిన్లా ముందుకు వేగంగా నడిపిస్తోంది. భారత జీడీపీలో 60% వాటా కలిగి ఉన్న సేవారంగం ఏడాదికి 10 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోంది. జీడీపీ ఆరు శాతం వార్షిక వృద్ధి రేటుతో కొనసాగడానికి సేవారంగం ప్రధాన పునాదిగా పనిచేస్తోంది. సేవారంగం పోగా మిగిలిన రెండు కీలకరంగాలైన పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు జీడీపీలో వరుసగా 26%, 14% వాటా కలిగి ఉన్నాయి. అనూహ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశమున్న ఈ రెండు రంగాలు కాస్త అటూ ఇటూ అయినా పటిష్ఠమైన సేవారంగం ప్రగతితో భారత ఆర్థిక వ్యవస్థ మంచి ఆరోగ్యంతో పరుగులు తీస్తోంది. వ్యవసాయం, పారిశ్రామిక–తయారీ రంగాలు వరుసగా 4%, 5.5% వార్షిక వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాయి. ఈ రెండు రంగాల అభివృద్ధి రేటు మరో ఐదు శాతం పెరిగితే దేశ జీడీపీ రేటు 8 శాతానికి పెరగడం సాధ్యమేనని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. జనాభాలో నంబర్ 1 అయినా– యువత నైపుణ్యం, ప్రతిభాపాటవాలు పెరగాలి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇండియా అవతరించిన మాట నిజమే. అలాగే, ఇక్కడి జనసంఖ్యలో యువత వాటా ఇతర దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ. కాని, కళాశాలల్లో చదువులు పూర్తిచేసుకుని పట్టభద్రులుగా తిరిగొస్తున్న భారత యువతీయువకుల్లో ఉద్యోగాలు సమర్ధంగా చేసే నైపుణ్యాలు చాలా తక్కువని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అలాంటి యువతకు అవసరమైనంత నైపుణ్యం సమకూర్చడానికి సర్కారు 2015 జులై 15న నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ (ఎనెస్ డీఎం) ఏర్పాటు చేసింది. మంచి శిక్షణ పొందిన, నైపుణ్యమున్న కార్మికుల కొరత దేశంలో తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని ఎనెస్ డీఎం వివరిస్తూ, ‘‘ఇండియాలో ఉద్యోగంలో చేరడానికి ముందు శిక్షణ పొందిన ఉద్యోగలు లేదా కార్మికుల సంఖ్య కేవలం 2.3% మాత్రమే. అదే యూకేలో 68%, జర్మనీలో 75%, అమెరికాలో 52%, జపాన్ లో 80%, దక్షిణ కొరియాలో 96% ఉద్యోగ శిక్షణ పొందినవారే. ఉద్యోగాలిచ్చే సంస్థల యజమానుల అవసరాలకు అనుగుణంగా, దేశ ఆర్థిక ప్రగతిని పెంచడానికి యువత ప్రతిభాపాటవాలు పెంచడానికి తగిన శిక్షణ అవసరం’ అని నొక్కిచెప్పింది. పెరుగుతున్న వస్తుసేవల వినియోగం దేశంలో వస్తుసేవల ఉత్పత్తిలో వృద్ధికి అనుగుణంగా వాటి వినియోగం కూడా వాంఛనీయ స్థాయిలో పెరుగుతోంది. బ్లూమ్ వెంచర్స్ అనే సంస్థ రూపొందించిన తన 2023 ఇండస్ వ్యాలీ నివేదిక ప్రకారం దేశంలో అగ్రశ్రేణి వినియోగదారులు 12 కోట్ల మంది ఉన్నారు. వారి సగటు వార్షిక ఆదాయం రూ.10 లక్షలు. వారిలో రూ.29 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ఓ చిన్న సంపన్న శ్రేణి జనాభా రెండున్నర కోట్ల మంది. ద్వితీయ శ్రేణి వినియోగదారుల జనాభా 10 కోట్లు. వారి సగటు వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు. ఈ ఆదాయవర్గాన్నే మధ్య తరగతి అని పిలుస్తారు. ఇక అసలు సిసలు ఇండియాగా పరిగణించే మూడో తరగతి వినియోగదారుల సంఖ్య 120 కోట్లని అంచనా. వారి సగటు వార్షికాదాయం రూ.1.20 లక్షలు. డాలర్–రూపాయి మారకం విలువ, అమెరికాలో వస్తుసేవల ధరలను పరిగణనలోకి తీసుకుంటే రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్న భారతీయుడు అమెరికాలో అంతే మొత్తం ఆదాయం (డాలర్లలో 12,00) ఉన్న వ్యక్తి కన్నా ఎక్కువ సరకులు కొనుగోలు చేయగలడని బ్లూమ్ వెంచర్స్ నివేదిక అంచనా వేసింది. ఈ లెక్కన 22 కోట్ల జనాభా ఉన్న మొదటి, రెండో అగ్రశ్రేణి వినియోగదారుల కొనుగోలు శక్తి భారత ఆర్థిక వ్యవస్థను సాఫీగా నడిపించడానికి దోహదం చేస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భావిస్తోంది. అయితే, 142 కోట్ల జనాభాలో 120 కోట్ల మంది ఉన్న తక్కువ ఆదాయవర్గం ఆదాయం, కొనుగోలు శక్తీ కూడా అభిలషణీయ స్థాయిలో పెరిగితే భారత ప్రగతి రథం అందరూ కోరుకునే రీతిలో వేగం పుంజుకుంటుంది. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
భారత్ ‘సేవలు’ భేష్...
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఫిబ్రవరిలో చక్కటి పనితీరు ప్రదర్శించింది. దేశ ఎకానమీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న ఈ రంగానికి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 59.4 వద్ద ముగిసింది. గత 12 ఏళ్లలో ఈ స్థాయి పురోగతి ఇదే తొలిసారి. దేశంలో డిమాండ్ పరిస్థితులు, కొత్త వ్యాపారాలు ఊపందుకోవడం వంటి అంశాలు దీనికి కారణమని గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. సూచీ జనవరిలో 57.2 వద్ద ఉంది. అయితే ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన చూస్తే, సేవల రంగం వరుసగా 19 నెలల నుంచి వృద్ధిలోనే కొనసాగుతోంది. కాగా, ఉపాధి అవకాశాల పరిస్థితులు మాత్రం ఇంకా మందగమనంలోనే ఉన్నట్లు డీ లిమా తెలిపారు. సేవలు–తయారీ కలిపినా... పురోగతి! తయారీ, సేవల రంగం కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా ఫిబ్రవరిలో పటిష్ట స్థాయిలో 59 వద్దకు చేరింది. జనవరిలో సూచీ 57.5 వద్ద ఉంది. ఇది 11 ఏళ్ల గరిష్టం. ఒక్క తయారీ రంగాన్ని చూస్తే మాత్రం సూచీ ఫిబ్రవరిలో 55.3 వద్ద ఉంది. జనవరికన్నా (55.4) సూచీ స్వల్పంగా వెనుకబడింది. -
జనవరిలో తగ్గిన ‘సేవలు’
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం జనవరిలో మందగించింది. ఎస్‌అండ్‌బీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ డిసెంబర్లో 58.5 వద్ద ఉండగా, జనవరిలో ఇది 57.2కి పడిపోయింది. అయితే సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ లెక్కనన వరుసగా 18 నెలల నుంచి సేవల రంగం అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. సేవలు–తయారీ కలిపినా మైనస్సే.. కాగా సేవలు– తయారీ రంగం కలగలిపిన బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ జనవరిలో 57.2కు తగ్గింది. డిసెంబర్లో ఇది 58.5 వద్ద ఉంది. ఒక్క తయారీ ఇండెక్స్ జనవరిలో 55.4గా నమోదయ్యింది. డిసెంబర్లో ఈ సూచీ 57.8 వద్ద ఉంది. చదవండి: అదానీ గ్రూప్: బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ -
కొత్త ఏడాదిలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. ఏ రంగంలో ఎక్కువంటే?
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో కొత్త కొలువులు పలకరించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు పెరుగుతున్నా భారత్‌లో మాత్రం వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్టు టీమ్‌లీజ్ సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా సేవల రంగం (సర్వీస్ సెక్టార్)లో జనవరి–మార్చి మధ్య కొత్తగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు లభిస్తాయని.. దేశంలోని 79 శాతం సంస్థలు కొత్తవారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు టీమ్‌లీజ్ సంస్థ తమ ‘ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్’ను తాజాగా విడుదల చేసింది. దేశంలోని 14 నగరాలు, 14 సేవారంగాలకు చెందిన 573 చిన్న, మధ్యతరహా, పెద్ద కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు పేర్కొంది. పెద్ద నగరాల్లో.. కొత్తవారికి, ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు అవకాశాల కల్పనలో పెద్ద నగరాలు ముందువరసలో ఉన్నట్టు టీమ్‌లీజ్ సంస్థ తమ నివేదికలో పేర్కొంది. టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థల్లో ఉద్యోగావకాశాల విషయంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై మెట్రోసిటీలు అగ్రభాగాన నిలుస్తున్నట్టు తెలిపింది. సేవల రంగంలో ముఖ్యంగా ఈ–కామర్స్ (98 శాతం), టెలీకమ్యూనికేషన్స్ (94 శాతం), ఎడ్యుకేషనల్ (93 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (88 శాతం), రిటైల్ (85 శాతం), లాజిస్టిక్స్ కంపెనీల్లో (81 «శాతం) స్థిరమైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నట్టు అంచనా వేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సర్వీసెస్ సెక్టార్లో భారత్ ‘గ్లోబల్ లీడర్’గా ఉద్భవించే దిశలో సాగుతోందని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మయూర్ టాడే పేర్కొన్నారు. ‘‘దేశంలోని పలు నగరాల్లో 5జీ టెలికం సర్వీసులు మొదలయ్యాయి. దానికి తగ్గట్టుగానే పరిశ్రమలు, సంస్థలు ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరుస్తూ అప్ స్కిల్లింగ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా ఎడ్యుకేషనల్, ఫైనాన్షియల్, ఔట్సోర్సింగ్ సర్వీసులపై సానుకూల ప్రభావానికి కారణమయ్యాయి’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అజోయ్ థామస్ పేర్కొన్నారు. -
ఆ రంగంలో బలంగా నియామకాలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2023 జనవరి–మార్చి)లో సేవల రంగంలో నియామకాలు బలంగా ఉంటాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ ‘ఎంప్లాయర్స్ అవుట్‌లుక్ నివేదిక’ తెలియజేసింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 77 శాతం కంపెనీల ప్రతినిధులు క్యూ4లో నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3) త్రైమాసికంలో ఇలా చెప్పిన సంస్థలు 73 శాతంతో పోలిస్తే నియామకాల సెంటిమెంట్ మెరుగుపడినట్టు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం అంచనాలతో పోలిస్తే 27 శాతం అధికమని టీమ్‌లీజ్ సర్వీసెస్ నివేదిక తెలిపింది. ఫ్రెషర్లకు (గ్రాడ్యుయేట్లు) ఎక్కువ అవకాశాలు ఇస్తామని 79 శాతం కంపెనీలు చెప్పాయి. ఈ కామర్స్ విభాగంలో 98 శాతం, టెలికమ్యూనికేషన్స్‌లో 94 శాతం, విద్యా సంబంధిత సేవల్లో 93 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 88 శాతం, రిటైల్‌లో 85 శాతం, లాజిస్టిక్స్‌లో 81 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టనున్నాయి. ‘‘అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో ఉద్యోగాల తొలగింపులు, నియామకాల నిలిపివేతల ప్రభావం సేవల రంగంపై ఉంది. కానీ, భారత్‌లో ఈ సెంటిమెంట్ ఎగువ దిశగా బలంగా ఉంది. 77 శాతం మంది నియామకాలు చేపట్టే ధోరణితో ఉన్నారు’’అని టీమ్ లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మయూర్ తెలిపారు. చదవండి: ఆరేళ్లలో బ్యాంకింగ్ రుణ మాఫీ ఎన్ని లక్షల కోట్లు తెలుసా? -
సెప్టెంబర్‌లో సేవలపై ద్రవ్యోల్బణ భారం
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం సెప్టెంబర్‌లో ఆరు నెలల కనిష్ట స్థాయిని చూసింది. మార్చి నుంచి ఎన్నడూ లేనంత స్థాయిలో కొత్త బిజినెస్ ఆర్డర్లు తగ్గాయి. ఆగస్టులో 57.2 వద్ద ఉన్న ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్, సెప్టెంబర్‌లో 54.3కు పడిపోయింది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు, పోటీ పూర్వక పరిస్థితులు దీనికి కారణం. అయితే సూచీ 50లోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. ఆపైన సూచీ ఉంటే, దానిని వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. ఈ లెక్కన గడచిన 14 నెలలుగా సేవల రంగం పురోగతి బాటన నడిచినట్లయ్యింది. ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం వాటా దాదాపు 60 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. సేవలు–తయారీ కలిపినా కిందకే.. మరోవైపు సేవలు, తయారీ రంగాలు కలిపిన ఎస్అండ్పీ కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా మార్చి నెల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆగస్టులో 58.2 వద్ద ఉన్న సూచీ, సెప్టెంబర్‌లో 55.1కు పడిపోయింది. ప్రైవేటు రంగం అమ్మకాలు ఆరు నెలల కనిష్టానికి తగ్గాయి. ఒక్క తయారీ రంగాన్ని చూసినా, సెప్టెంబర్‌లో స్పీడ్ తగ్గింది. తయారీ రంగం స్పీడ్ సెప్టెంబర్‌లో 55.1కి తగ్గినట్లు మేనేజర్స్ ఇండెక్స్ పేర్కొంది. ఆగస్టులో సూచీ 56.2 వద్ద ఉంది. అయితే తయారీ రంగం వృద్ధి బాటన ఉండడం (50 పైన) వరుసగా ఇది 15వ నెల. దాదాపు 400 సంస్థల పర్చేజింగ్ మేనేజర్స్ నుంచి పొందిన సమాచారం ఆధారంగా ఎస్అండ్పీ గ్లోబల్ సూచీ రూపొందిస్తుంది. -
అగ్రశ్రేణి కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం, పారదర్శకమైన ప్రభుత్వ పాలసీలతోపాటు దేశంలోనే అత్యుత్తమ వాతావరణం తెలంగాణ సొంతమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల్లో గత ఎనిమిదేళ్లుగా నమోదైన ప్రగతితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, ప్రోత్సాహకాలతో ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకున్నాయన్నారు. తెలంగాణకు భారీ పెట్టుబడులను రప్పించడం లక్ష్యంగా మంత్రి కేటీ ఆర్ శుక్రవారం ‘డిప్లొమాట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్’ను నిర్వహించారు. టీ–హబ్ 2.0లో జరిగిన ఈ సమావేశానికి సుమారు 50 దేశాలకు చెందిన రాయబారు లు, ప్రతినిధులు, కాన్సుల్ జనరల్స్, గౌరవ కాన్సు ల్ జనరల్స్, హైకమిషనర్లు, ట్రేడ్ కమిషనర్లు హాజరయ్యారు. తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంపై కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వివరించారు. తెలంగాణ పెట్టుబడుల సలహాదారు (టియా) పేరిట రూపొందించిన వర్చువల్ మస్కట్, చాట్ బాట్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కేటీఆర్ ప్రజెంటేషన్ అనంతరం విదేశాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దౌత్యవేత్తలు, దౌత్యాధికారులు టీ హబ్ ప్రాంగణాన్ని పరిశీలించి వివిధ స్టార్టప్‌ల ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వ చొరవతో ప్రారంభమైన టీ–హబ్, టీ–వర్క్స్, టీఎస్ఐసీ, టాస్క్ సంస్థల లక్ష్యాలు, పనితీరును దౌత్యవేత్తలు ప్రశంసించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, టీ–హబ్ సీఈఓ ఎం శ్రీనివాస్‌రావు, పరిశ్రమలు, ఐటీ శాఖకు చెందిన వివిధ విభాగాల డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. -
అసలేం జరుగుతోంది.. భారత్‌లో సేవా రంగం స్పీడు తగ్గింది
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం స్పీడ్ జూలైలో భారీగా తగ్గింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ జూలైలో 55.5కు పడిపోయింది. గడచిన నాలుగు నెలల్లో సూచీ ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. జూన్‌లో సూచీ 59.2 వద్ద ఉంది. అయితే ఈ సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సేవల రంగం వృద్ధి ధోరణిలోనే ఉండడం ఇది వరుసగా 12వ నెల. భారత సేవల ఎకానమీలో క్రియాశీలత భారీగా తగ్గినట్లు సర్వేలో వెల్లడైందని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటిలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. ఇక సేవలు, తయారీ రంగం కలిసిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ జూన్‌లో 58.2 వద్ద ఉంటే, జూలైలో 56.6కు తగ్గినట్లు పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. మార్చి తర్వాత ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. చదవండి: Airtel 5G Service: గెట్ రెడీ.. ఆగస్ట్‌లో 5జీ సేవలు: ఎయిర్టెల్ -
డిసెంబర్లో ‘సేవలు’ పేలవం
న్యూఢిల్లీ: భారత సేవల రంగానికి సంబంధించి బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ డిసెంబర్లో 55.5కు పడిపోయింది. నవంబర్‌లో ఈ సూచీ 58.1 వద్ద ఉంది. సెప్టెంబర్ 2021 తర్వాత సూచీ ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. అయితే సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన గడచిన ఐదు నెలల్లో సూచీ వృద్ధి బాటలోనే ఉంది. డిసెంబర్లో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయని, ధరల తీవ్రత ఉందని, మూడవ వేవ్ భయాందోళనలు పొంచిఉన్నాయని, ఆయా అంశాలు బిజినెస్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని నెలవారీ సర్వే పేర్కొంది. సేవల రంగంలో ఉపాధి అవకాశాలు కూడా డిసెంబర్లో నామమాత్రంగానే ఉన్నాయని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. భారత్‌లో నిరుద్యోగం డిసెంబర్లో నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) ఇటీవలి గణాంకాలు వెల్లడించడం గమనార్హం. -
సేవల రంగం.. సూపర్ స్పీడ్!
న్యూఢిల్లీ: భారత్ సేవలకు సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ గత పదిన్నర సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వేగాన్ని అక్టోబర్‌లో నమోదుచేసుకుంది. సెప్టెంబర్‌లో 55.2 వద్ద ఉన్న ఇండెక్స్ అక్టోబర్‌లో 58.4కు ఎగసింది. డిమాండ్, ఆర్థిక రికవరీకి ఇది సంకేతమని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా వ్యాపార విశ్వాసం తగ్గినప్పటికీ, కొత్త వ్యాపారాల్లో గుర్తించదగిన పురోగతి కనిపిస్తోందని, కొత్త ఉద్యోగ కల్పనకూ ఇది దారితీసిందని ఆమె విశ్లేషించారు. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపు క్షీణతగా పరిగణిస్తారు. సెకండ్‌వేవ్ ఆంక్షల తొలగింపు నేపథ్యంలో గత మూడు నెలలుగా సూచీ 50 పైన కొనసాగడం గమనార్హం. ముడి పదార్థాల ధరల భారం... ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగడంతో, కంపెనీలు దాదాపు నాలుగున్నర సంవత్సరాలలో అత్యంత వేగంగా తమ ఫీజులను పెంచేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నట్లు పోలియానా డీ లిమా పేర్కొన్నారు. ఇంధనం, మెటీరియల్, రిటైల్, సిబ్బంది, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగినట్లు కంపెనీలు పేర్కొంటున్నాయని వెల్లడించారు. కాగా, నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు రాబోయే సంవత్సరంలో వృద్ధిని అడ్డుకోవచ్చని సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన చెందుతున్నారని, భవిష్యత్ వ్యాపార విశ్వాసంపై కొంత ప్రతికూల ధోరణి ఉందని ఆమె పేర్కొన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో భారత్ సేవలకు అంతర్జాతీయ డిమాండ్ బలహీనంగా కొనసాగుతోందని ఆమె తెలిపారు. సేవలు–తయారీ కలిపినా దూకుడే... కాగా సేవలు–తయారీ రంగాలు కలిపిన కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సెప్టెంబర్‌లో 55.3 వద్ద ఉంటే, అక్టోబర్‌లో 58.7కు ఎగసింది. 2012 తర్వాత పటిష్ట నెలవారీ విస్తరణను ఇది సూచిస్తోందని ఎకనమిస్ట్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. వరుసగా రెండవనెలా ప్రైవేటు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల సృష్టి జరిగింది. ఒక్క తయారీ రంగాన్ని చూసినా మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. ఎకానమీ రికవరీ సంకేతాలను సూచిస్తూ అక్టోబర్ ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 55.9గా నమోదయ్యింది. ఇది సెప్టెంబర్‌లో 53.7 వద్ద ఉంది. ఫిబ్రవరి తర్వాత ఎకానమీ గణాంకాలు గణనీయంగా మెరుగుపడినట్లు తమ సర్వేద్వారా వెల్లడవుతున్నట్లు ఎకనమిస్ట్ పాలీయానా డీ లిమా పేర్కొన్నారు. -
ఏపీకి రూ.1,975 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు అక్టోబరు 2019 నుంచి డిసెంబరు 2020 మధ్య పదిహేను నెలల కాలానికి రూ.1,975 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి. ఇందుకు సంబంధించిన గణాంకాలను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) విడుదల చేసింది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం రూ. 5,54,613.65 కోట్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇందులో 31.92 శాతంతో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా రూ.1,77,052 కోట్ల మేర ఈ రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. రూ.1,53,351 కోట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. మొత్తం ఎఫ్డీఐలో మహారాష్ట్ర వాటా 27.65 శాతంగా ఉంది. అలాగే, రూ.78,159 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి కర్ణాటక మూడో స్థానంలో.. రూ.59,830 కోట్లతో ఢిల్లీ నాలుగో స్థానంలో, రూ.19,733 కోట్లతో తమిళనాడు ఐదో స్థానంలో నిలిచాయి. రూ.11,331.61 కోట్ల మేర ఎఫ్‌డీఐలతో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. ఇది మొత్తం ఎఫ్‌డీఐల్లో 2.4 శాతంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రూ.1,975 కోట్ల ఎఫ్‌డీఐలతో 12వ స్థానంలో నిలిచింది. ఐటీ రంగం విస్తరించిన హైదరాబాద్.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు వెళ్లిపోవడంతో ఎఫ్‌డీఐల రాక కూడా అక్కడే కేంద్రీకృతమై ఉన్నట్లు అవగతమవుతోంది. మారిషస్ నుంచే అత్యధికం కాగా, గడిచిన 20 ఏళ్లలో 2000 ఏప్రిల్ నుంచి డిసెంబరు 2020 వరకు దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐల్లో 28 శాతం మారిషస్ నుంచే ఉన్నాయి. తదుపరి 22 శాతం సింగపూర్ నుంచి వచ్చాయి. అమెరికా నుంచి 8 శాతం, నెదర్లాండ్స్ నుంచి 7 శాతం, జపాన్ నుంచి 7 శాతం, యూకే నుంచి 6 శాతం ఉన్నాయి. అయితే, ఇటీవలి సంవత్సరాల్లో సింగపూర్, యూఎస్ఏ, కేమన్ ఐలాండ్స్, యూఏఈల నుంచి అత్యధికంగా ఎఫ్‌డీఐలు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు సింగపూర్ నుంచి రూ.1,16,812 కోట్లు, యూఎస్ఏ నుంచి రూ. 95,246 కోట్లు, యూఏఈ నుంచి రూ. 29,149 కోట్లు, కేమన్ ఐలాండ్స్ నుంచి రూ. 18,842 కోట్లు వచ్చాయి. సేవ, సాఫ్ట్వేర్ రంగాల్లోనే అత్యధికం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సేవా రంగంలోనే అత్యధికంగా వస్తున్నాయి. ఫైనాన్షియల్, బ్యాంకింగ్, నాన్–ఫైనాన్షియల్, ఔట్సోర్సింగ్, పరిశోధన–అభివృద్ధి, కొరియర్, టెక్నాలజీ, టెస్టింగ్ అండ్ అనాలసిస్ తదితర సేవలు అందించే ఈ రంగానికి 16 శాతం ఎఫ్‌డీఐలు రాగా, కంప్యూటర్స్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమలోకి 13 శాతం పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమలోకి ఏకంగా> రూ.1,81,470 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రెండు రంగాల తరువాత వరుసగా టెలికమ్యునికేషన్లు (7 శాతం), ట్రేడింగ్ (6 శాతం), భవన నిర్మాణ రంగం (5 శాతం), ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ (5 శాతం), మౌలిక వసతుల నిర్మాణ రంగం (5 శాతం), రసాయనాలు (4 శాతం), ఫార్మాస్యూటికల్స్ (3 శాతం), హోటల్, టూరిజం (3 శాతం) రంగాలు నిలిచాయి. -
సత్తా చాటిన సేవల రంగం..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో అన్ని రంగాలూ కుదేలవుతుంటే వృద్ధి రేటులో కీలక పాత్ర పోషించే సేవల రంగం నవంబర్‌లో సత్తా చాటింది. గత నాలుగు నెలల్లో ఎన్నడూ లేని రీతిలో సేవల రంగం వృద్ధిని కనబరచడం ఆర్థిక వ్యవస్థ గాడినపడుతుందనే సంకేతాలు పంపింది. నూతన వ్యాపారాలు ఊపందుకోవడం, పలు సేవలకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో సేవల రంగం గణనీయంగా వృద్ధి చెందుతోందని ప్రైవేట్ రంగానికి చెందిన నిక్కీఐహెచ్ఎస్ మార్కిట్ సర్వీసెస్ సర్వే వెల్లడించింది. నవంబర్‌లో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 52.7కు ఎగబాకగా, అక్టోబర్‌లో ఇది 49.2గా నమోదైంది. నూతన వ్యాపారాలతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగాయని సర్వే పేర్కొంది. సేవల కార్యకలాపాలు విస్తృతమవడంతో వ్యాపార విశ్వాసం ఇనుమడించిందని దీంతో నవంబర్ సర్వేలో మెరుగైన ఫలితాలు వచ్చాయని ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రధాన ఆర్థికవేత్త పాలిన్న డి లిమ పేర్కొన్నారు. వ్యవస్ధలో డిమాండ్‌ను మదించే సబ్ ఇండెక్స్ సైతం అక్టోబర్‌లో 501గా ఉండగా నవంబర్‌లో 53.2కు పెరిగింది. గత మూడు నెలల్లో సంస్థలు ఉద్యోగులను పెద్దసంఖ్యలో నియామకాలు చేపడుతున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. సెప్టెంబర్ క్వార్టర్లో దేశ జీడీపీ కేవలం 4.5 శాతానికి పరిమితం కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సర్వే కొంత ఊరట కల్పించింది. -
సేవల రంగం జోరు..
న్యూఢిల్లీ: కొత్త వర్క్ ఆర్డర్లు, సానుకూల మార్కెట్ పరిస్థితుల ఊతంతో నవంబర్‌లో సేవల రంగం వృద్ధి వేగం పుంజుకుంది. నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ నవంబర్‌లో 53.7 పాయింట్లుగా నమోదైంది. దీంతో వరుసగా ఆరో నెల కూడా వృద్ధి నమోదైనట్లయింది. అక్టోబర్‌లో ఇది 52.2 పాయింట్లుగా ఉంది. పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) ప్రమాణాల ప్రకారం సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే పెరుగుదలను, దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. మరోవైపు తయారీ, సేవల రంగాలు రెండింటి పనితీరును ప్రతిఫలించే నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ సూచీ.. నవంబర్‌లో అత్యంత వేగవంతమైన వృద్ధి కనపర్చింది. అక్టోబర్‌లో 53గా ఉన్న సూచీ నవంబర్‌లో 54.5గా నమోదైంది. 2016 అక్టోబర్ తర్వాత ఇంత అధికంగా వృద్ధి చెందడం ఇదే ప్రథమం. సానుకూల మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో పదహారు నెలలుగా ఉద్యోగాల కల్పన కొనసాగుతోందని నివేదిక రూపొందించిన ఐహెచ్ఎస్ మార్కిట్ సంస్థ ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ పోల్యానా డె లిమా తెలిపారు. వృద్ధికి ఊతం: గర్గ్ వ్యాపార కార్యకలాపాలు, డిమాండ్ పెరుగుదలను నవంబర్ పీఎంఐ డేటా ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ చెప్పారు. గత నాలుగేళ్ల కాలం చూస్తే.. నవంబర్‌లో ఎగుమతుల వృద్ధి రేటు మరింత మెరుగ్గా ఉందని ఆయన ట్వీట్ చేశారు. అక్టోబర్‌లో ఎగుమతులు 18 శాతం పెరిగి దాదాపు 27 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలంలో ఎగుమతులు 13 శాతం వృద్ధితో 191 బిలియన్ డాలర్లకు చేరాయి. -
ఆగస్ట్‌లో తగ్గిన సేవల రంగం వృద్ధి
న్యూఢిల్లీ: దేశీయ సేవల రంగం కార్యకలాపాలు 21 నెలల గరిష్ట స్థాయి నుంచి ఆగస్ట్‌లో తగ్గుముఖం పట్టాయి. నూతన ఆర్డర్లు తగ్గడం, అదే సమయంలో కంపెనీలు ఉద్యోగులను పెంచుకోవడంతో ఉత్పత్తి వ్యయం ఎగిసేందుకు దారితీసినట్టు నెలవారీ సర్వేలో తెలిసింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ జూలైలో 54.2 శాతానికి చేరగా, ఆగస్ట్‌లో 51.5 శాతానికి తగ్గింది. ఆగస్ట్‌లో నూతన ఆర్డర్ల రాక మూడు నెలల్లోనే కనిష్టంగా ఉంది. సేవల రంగం వృద్ధి గరిష్టానికి చేరి చల్లబడినట్టు ఈ గణాంకాలు సంకేతాలిస్తున్నాయని ఐహెచ్ఎస్ మార్కిట్ అనలిస్ట్ ఆష్నా దోధియా తెలిపారు. ఇక సీజన్‌వారీగా సర్దుబాటు చేసిన నికాయ్ ఇండియా కాంపోజిట్ (సేవలు, తయారీ) పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ సైతం జూలైలో 54.1 శాతం కాగా, ఆగస్ట్‌లో 51.9 శాతానికి తగ్గింది. తయారీ, సేవలు రెండింటిలోనూ వృద్ధి బలహీనంగా ఉందని ఇది తెలియజేస్తోంది. ఇన్పుట్ వ్యయానికి సంబంధించి ద్రవ్యోల్బణం తొమ్మిది నెలల్లోనే బలంగా ఉందని తేలింది. సానుకూల అంశం ఏమిటంటే వ్యాపార విశ్వాసం ఈ ఏడాది మే నెల తర్వాత అధిక స్థాయికి చేరింది. -
జోరుమీదున్న సేవా రంగం
న్యూఢిల్లీ: దేశీ సేవల రంగ కార్యకలాపాలు జోరుమీదున్నాయి. వరుసగా 2వ నెలలోనూ వృద్ధి చెంది అక్టోబర్ 2016 తరువాత అత్యంత గరిష్టస్థాయిని నమోదుచేశాయి. జూన్‌లో 52.6 శాతంగా ఉన్న నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ జూలైలో 54.2 శాతానికి ఎగసింది. డిమాండ్ ఊపందుకోవడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో ఈ రంగం జోరు కొనసాగుతోందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. గతేడాది జూన్ నుంచి బలమైన వృద్ధిరేటును కొనసాగిస్తూ సేవా రంగం ఆశాజనకంగా ఉందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఆర్థిక వేత్త ఆశ్నా దోధియా వ్యాఖ్యానించారు. ఇక సేవారంగం, తయారీ రంగానికి సంయుక్త సూచీగా ఉన్న నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎమ్ఐ అవుట్‌పుట్ ఇండెక్స్ జూలైలో 54.1 శాతానికి చేరింది. ఈ సూచీ అంతక్రితం నెలలో 53.3 శాతంగా ఉంది. -
మిషెల్ ప్రసంగం స్ఫూర్తితో..
► సేవా రంగం వైపు భారతీయ యువతి సింధూ ► ఒబామాకు లేఖ వాషింగ్టన్ : ‘అది 1996వ సంవత్సరం. నేనొక చర్చిలో కూర్చొని ఉన్నాను. ఆ సమయంలో ఎవరో ప్రసంగిస్తున్నారు. ఆ ప్రసంగించే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు. కానీ ఆమె ప్రసంగం మాత్రం నాలో స్ఫూర్తిని రగిలించింది. ఆమె రగిలించిన ఆ స్ఫూర్తిని నేనెప్పటికీ మరచిపోలేను. ఆ స్ఫూర్తితోనే నా తదుపరి జీవితాన్ని సేవకు అంకితం చేశాను. ఒక ఆసుపత్రిలో స్వచ్ఛంద సేవకురాలిగానూ, సమాజంలో వెనుకబడిన విద్యార్థులకు సాహిత్యాన్ని బోధించడంలోనూ సహాయపడ్డాను. అయితే చాలా రోజుల తర్వాత నాకొక విషయం తెలిసింది. నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా అని.. ఈ సందర్భంగా ఒబామా దంపతులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ భారత సంతతికి చెందిన 38 ఏళ్ల సింధూ ఒబామాకు జనవరిలో లేఖ రాసింది. ప్రస్తుతం ఆ లేఖను మహిళా దినోత్సవం సందర్భంగా మీడియం అనే సామాజిక మాధ్యమం ద్వారా బరాక్ ఒబామా పంచుకున్నారు. ‘సింధూ జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చిన నా భార్యను చూసి నేనెంతో గర్వపడు తున్నారు. సింధూ కథను చదివి ఎంతో స్ఫూర్తి పొందాను. అందుకే ఈ కథను మీతో పంచుకోవాలని భావించాను’ అని ఒబామా తెలిపారు. -
కెనడా వీసాపై ఆందోళన
న్యూఢిల్లీ: తాత్కాలిక విదేశీ కార్మికులకు సంబంధించిన వీసా కార్యక్రమంలో కెనడా మార్పులు చేయడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో భారత కంపెనీలు తమ ఉద్యోగులను స్వల్పకాల వీసాలపై ఆ దేశానికి పంపడం కష్టమవడంతో పాటు సేవారంగంపై ప్రభావం పడుతుంది. భారత పర్యటనలో ఉన్న కెనడా అధికారుల దృష్టికి వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని తీసుకెళ్లగా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. నిర్మలా సీతారామన్ , కెనడా విదేశీ వాణిజ్య మంత్రి ఫ్రానోయిస్ ఫిలిప్పె చాంపేన్ మధ్య జరిగిన చర్చల్లో ఇది ప్రస్తావనకు వచ్చింది. -
గాజువాకలో డబ్బులు కాస్తున్నాయ్
సేవా రంగంలో విజయవాడ ముందంజ పారిశ్రామిక ప్రగతిలోనూ గాజువాకే టాప్ కైకలూరు రైతుల చేపల పంట పండింది తొలి త్రైమాసికం వృద్ధి గణాంకాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల వృద్ధితో పాటు తలసరి ఆదాయంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించి వాటికి రాష్ట్ర ప్రభుత్వం ర్యాంకులు కేటాయించింది. ప్రభుత్వ వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గ ప్రజలు తలసరి ఆదాయంలో దూసుకుపోతున్నారు. అలాగే పారిశ్రామిక ప్రగతిలోనూ గాజువాకనే ముందంజలో ఉంది. గాజువాక నియోజకవర్గ ప్రజలు రూ.2,64,232 తలసరి ఆదాయంతో తొలి ర్యాంకులో నిలిచారు. అలాగే విశాఖ(పశ్చిమ) నియోజకవర్గం రూ.1,74,109తో రెండో ర్యాంకు సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈ కేటగిరీలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం అత్యంత వెనుకబడిపోయింది. ఈ నియోజకవర్గ ప్రజలు రూ.46,905 రూపాయలతో 175వ స్థానంలో నిలిచారు. ఇక పారిశ్రామిక ప్రగతిలోనూ గాజువాక నియోజకవర్గమే ముందంజలో ఉందని ప్రభుత్వం తెలిపింది. స్టీల్ ప్లాంటు ఉండటమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. పారిశ్రామిక ప్రగతిలో గాజువాక రూ.7,359 కోట్లతో తొలి ర్యాంక్ దక్కించుకుంది. ఇదే జిల్లాకు చెందిన పెందుర్తి రెండో ర్యాంకులో నిలిచింది. ఈ విభాగంలో చివరి ర్యాంకు(175) కూడా ఇదే జిల్లాకు చెందిన అరకు నియోజకవర్గానికి దక్కడం గమనార్హం. సేవా రంగంలో కూడా కృష్ణా జిల్లాకు చెందిన విజయవాడ(పశ్చిమ) నియోజకవర్గం రూ.4,923 కోట్లతో మొదటి ర్యాంకులో నిలిచింది. ఇక్కడ వ్యవసాయ రంగంలో పురోగతి లేకపోయినప్పటికీ రియల్ ఎస్టేట్‌లో దూసుకుపోతుండటంతో విజయవాడ(పశ్చిమ) తొలి ర్యాంకు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రంగంలో కృష్ణా జిల్లాకే చెందిన పెడన నియోజకవర్గం రూ.510 కోట్లతో చివరి స్థానంలో నిలిచింది. వ్యవసాయ రంగం ఎటువంటి వృద్ధి సాధించలేదని పేర్కొంటూనే.. చేపలు, పాలు, గుడ్లు, మాంసం రంగాల్లో వృద్ధి సాధించినట్లు సర్కార్ పేర్కొంది. వ్యవసాయ రంగంలో కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం రూ.3,471 కోట్లతో తొలి ర్యాంకు సాధించింది. అయితే వ్యవసాయ పంటల ద్వారా కాకుండా చే పల చెరువుల ద్వారానే ఈ ర్యాంకు సాధించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇదే వ్యవసాయ రంగంలో గుంటూరు (తూర్పు) నియోజకవర్గం చివరి స్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గం పంటలు, పశుసంవర్థకం, చేపల చెరువుల్లో ఎలాంటి ప్రగతి సాధించలేదని ప్రభుత్వం వెల్లడించింది. -
జనవరిలో సేవల జోరు..
న్యూఢిల్లీ: సేవల రంగం జనవరిలో మంచి పనితీరు ప్రదర్శించినట్లు నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) అవుట్‌పుట్ ఇండెక్స్ పేర్కొంది. ఈ రంగం క్రియాశీలత 19 నెలల గరిష్ట స్థాయిలో 54.3 పాయింట్లకు ఎగసినట్లు ఇండెక్స్ తెలిపింది. జనవరిలో ఈ సూచీ 53.6 పాయింట్ల వద్ద ఉంది. డిమాండ్, వాతావరణ పరిస్థితులు మెరుగుపడ్డం వంటి అంశాలు సేవల రంగం పురోగతికి కారణమని సర్వేను చేసిన మార్కిట్ సంస్థ ఎకనమిస్ట్ పోలీనా డీ లిమా పేర్కొన్నారు. కాగా తయారీ, సేవల రంగాలు రెండింటికీ సంబంధించిన నికాయ్ కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ డిసెంబర్లో 51.6 పాయింట్ల వద్ద ఉండగా, జనవరిలో 11 నెలల గరిష్ట స్థాయిలో 53.3 పాయింట్లకు ఎగసింది. -
‘పద్మ’ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
ఏలూరు (పశ్చిమ గోదావరి): సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసిన వారి నుంచి కేంద్ర ప్రభుత్వ ‘పద్మ’ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఏపీ యువజన సర్వీసుల శాఖ పరిధిలోని సెట్వెల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తాము చేసిన సేవా కార్యక్రమాల వివరాలను రెండు పేజీలకు మించకుండా తెలియజేస్తూ జూలై 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హమైన వాటిని 2016 పద్మ పురస్కారాలకు సిఫారసు చేస్తామని చెప్పారు. దరఖాస్తులను సెట్వెల్, ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఏలూరు చిరునామాకు పంపించాలని తెలిపారు. -
చిన్న సంస్థలకు ప్రపంచ బ్యాంకు రుణం
న్యూఢిల్లీ: దేశీ తయారీ, సేవల రంగంలోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) 500 మిలియన్ డాలర్ల రుణం అందించే ప్రతిపాదనకు ప్రపంచ బ్యాంకు ఆమోదముద్ర వేసింది. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు(సిడ్బి), ఇతరత్రా ఆర్థిక సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టు కింద ఎస్ఎంఈలకు వివిధ దశల్లో కావాల్సిన నిధులు లభిస్తాయి. ఎస్ఎంఈలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించగలవని, అయితే ఇందుకోసం వాటికి నిధులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని వరల్డ్ బ్యాంక్ కంట్రీ డెరైక్టర్ (భారత్) ఓనో రుహల్ తెలిపారు. అలాంటి అడ్డంకులు అధిగమించి పూర్తి సామర్ధ్యంతో చిన్న సంస్థలు పనిచేసేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడగలదన్నారు. దేశీ పరిశ్రమల్లో 80 శాతం పైగా చిన్న తరహా సంస్థలే ఉన్నాయి. ఇవి 8 వేల పైచిలుకు వివిధ ఉత్పత్తులు తయారు చేస్తూ సుమారు 6 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పరోక్షంగా, ప్రత్యక్షంగా మొత్తం తయారీ రంగ ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతుల్లో దాదాపు 40 శాతం వాటా ఎస్ఎంఈలదే ఉంటోంది. కానీ, అవసరానికి నిధులు అందుబాటులో లేకపోతుండటం ఎస్ఎంఈలకు ప్రధాన సమస్యగా ఉంటున్న నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ తాజా రుణం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సేవల రంగం నుంచే కొత్త కంపెనీల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అక్టోబరులో 6,586 కంపెనీలు కొత్తగా నమోదయ్యాయి. ఇందులో 70 శాతం కంపెనీలు సేవల రంగం నుంచి రావడం విశేషం. రంగాల వారీగా చూస్తే పరిశ్రమలు, వ్యవసాయం ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక వీటన్నిటి అధీకృత మూలధనం రూ.2,833.87 కోట్లని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం. అక్టోబరులో 20 విదేశీ కంపెనీలు భారత్‌కు వచ్చిచేరాయి. వీటిలో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ఒక్కొక్కటి ఆరు కంపెనీలను ఆకర్శించాయి. మొత్తంగా మహారాష్ట్రలో 1,304, ఢిల్లీలో 1,149, ఉత్తర ప్రదేశ్‌లో 536 కంపెనీలు కొత్తగా అడుగుపెట్టాయి. అక్టోబరు చివరినాటికి దేశంలో నమోదిత కంపెనీల సంఖ్య 13.5 లక్షలు. 9.12 లక్షల కంపెనీలు చురుకుగా ఉన్నాయి. 2.65 లక్షల కంపెనీలు మూతపడ్డాయి.