142 కోట్ల జనాభాలో 120 కోట్ల తక్కువ ఆదాయవర్గం కొనుగోలు శక్తి పెరిగితే ప్రగతి రథం పరుగులు పెడుతుంది!
ప్రపంచంలో అనేక అభివృద్దిచెందిన దేశాలు, వర్ధమాన దేశాలు నేడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆయా దేశాల్లో ఆర్థిక మందగమనం తరచు దర్శనమిస్తోంది. అయితే, ప్రపంచంలో అత్యధిక జనాభా, విస్తృత మార్కెట్ ఉన్న ఇండియా అంతర్జాతీయ కుదుపుల ప్రభావం పెద్దగా లేకుండా ముందుకు సాగుతోంది.
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6–7 శాతం మధ్య కొనసాగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను సేవారంగం రైలింజిన్లా ముందుకు వేగంగా నడిపిస్తోంది. భారత జీడీపీలో 60% వాటా కలిగి ఉన్న సేవారంగం ఏడాదికి 10 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోంది. జీడీపీ ఆరు శాతం వార్షిక వృద్ధి రేటుతో కొనసాగడానికి సేవారంగం ప్రధాన పునాదిగా పనిచేస్తోంది. సేవారంగం పోగా మిగిలిన రెండు కీలకరంగాలైన పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు జీడీపీలో వరుసగా 26%, 14% వాటా కలిగి ఉన్నాయి.
అనూహ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశమున్న ఈ రెండు రంగాలు కాస్త అటూ ఇటూ అయినా పటిష్ఠమైన సేవారంగం ప్రగతితో భారత ఆర్థిక వ్యవస్థ మంచి ఆరోగ్యంతో పరుగులు తీస్తోంది. వ్యవసాయం, పారిశ్రామిక–తయారీ రంగాలు వరుసగా 4%, 5.5% వార్షిక వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాయి. ఈ రెండు రంగాల అభివృద్ధి రేటు మరో ఐదు శాతం పెరిగితే దేశ జీడీపీ రేటు 8 శాతానికి పెరగడం సాధ్యమేనని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు.
జనాభాలో నంబర్ 1 అయినా– యువత నైపుణ్యం, ప్రతిభాపాటవాలు పెరగాలి
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇండియా అవతరించిన మాట నిజమే. అలాగే, ఇక్కడి జనసంఖ్యలో యువత వాటా ఇతర దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ. కాని, కళాశాలల్లో చదువులు పూర్తిచేసుకుని పట్టభద్రులుగా తిరిగొస్తున్న భారత యువతీయువకుల్లో ఉద్యోగాలు సమర్ధంగా చేసే నైపుణ్యాలు చాలా తక్కువని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అలాంటి యువతకు అవసరమైనంత నైపుణ్యం సమకూర్చడానికి సర్కారు 2015 జులై 15న నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ (ఎనెస్ డీఎం) ఏర్పాటు చేసింది.
మంచి శిక్షణ పొందిన, నైపుణ్యమున్న కార్మికుల కొరత దేశంలో తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని ఎనెస్ డీఎం వివరిస్తూ, ‘‘ఇండియాలో ఉద్యోగంలో చేరడానికి ముందు శిక్షణ పొందిన ఉద్యోగలు లేదా కార్మికుల సంఖ్య కేవలం 2.3% మాత్రమే. అదే యూకేలో 68%, జర్మనీలో 75%, అమెరికాలో 52%, జపాన్ లో 80%, దక్షిణ కొరియాలో 96% ఉద్యోగ శిక్షణ పొందినవారే. ఉద్యోగాలిచ్చే సంస్థల యజమానుల అవసరాలకు అనుగుణంగా, దేశ ఆర్థిక ప్రగతిని పెంచడానికి యువత ప్రతిభాపాటవాలు పెంచడానికి తగిన శిక్షణ అవసరం’ అని నొక్కిచెప్పింది.
పెరుగుతున్న వస్తుసేవల వినియోగం
దేశంలో వస్తుసేవల ఉత్పత్తిలో వృద్ధికి అనుగుణంగా వాటి వినియోగం కూడా వాంఛనీయ స్థాయిలో పెరుగుతోంది. బ్లూమ్ వెంచర్స్ అనే సంస్థ రూపొందించిన తన 2023 ఇండస్ వ్యాలీ నివేదిక ప్రకారం దేశంలో అగ్రశ్రేణి వినియోగదారులు 12 కోట్ల మంది ఉన్నారు. వారి సగటు వార్షిక ఆదాయం రూ.10 లక్షలు. వారిలో రూ.29 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ఓ చిన్న సంపన్న శ్రేణి జనాభా రెండున్నర కోట్ల మంది. ద్వితీయ శ్రేణి వినియోగదారుల జనాభా 10 కోట్లు. వారి సగటు వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు.
ఈ ఆదాయవర్గాన్నే మధ్య తరగతి అని పిలుస్తారు. ఇక అసలు సిసలు ఇండియాగా పరిగణించే మూడో తరగతి వినియోగదారుల సంఖ్య 120 కోట్లని అంచనా. వారి సగటు వార్షికాదాయం రూ.1.20 లక్షలు. డాలర్–రూపాయి మారకం విలువ, అమెరికాలో వస్తుసేవల ధరలను పరిగణనలోకి తీసుకుంటే రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్న భారతీయుడు అమెరికాలో అంతే మొత్తం ఆదాయం (డాలర్లలో 12,00) ఉన్న వ్యక్తి కన్నా ఎక్కువ సరకులు కొనుగోలు చేయగలడని బ్లూమ్ వెంచర్స్ నివేదిక అంచనా వేసింది.
ఈ లెక్కన 22 కోట్ల జనాభా ఉన్న మొదటి, రెండో అగ్రశ్రేణి వినియోగదారుల కొనుగోలు శక్తి భారత ఆర్థిక వ్యవస్థను సాఫీగా నడిపించడానికి దోహదం చేస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భావిస్తోంది. అయితే, 142 కోట్ల జనాభాలో 120 కోట్ల మంది ఉన్న తక్కువ ఆదాయవర్గం ఆదాయం, కొనుగోలు శక్తీ కూడా అభిలషణీయ స్థాయిలో పెరిగితే భారత ప్రగతి రథం అందరూ కోరుకునే రీతిలో వేగం పుంజుకుంటుంది.
-విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment