2024–25లో 7 శాతం అంచనా
ఎన్‌సీఏఈఆర్ విశ్లేషణ
న్యూఢిల్లీ: సాధారణ రుతుపవనాల అంచనాలు, ఇప్పటివరకు ఎటువంటి ప్రపంచ ప్రతికూలతలు లేకపోవడం వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ ఆర్థిక వ్యవస్థ 7 శాతం కంటే ఎక్కువగా వృద్ధి చెందడానికి దోహదపడే అవకాశం ఉందని ఎకనామిక్ థింక్ ట్యాంక్– ఎన్‌సీఏఈఆర్ తన నెలవారీ సమీక్షలో తెలిపింది.
దేశీయ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని హై–ఫ్రీక్వెన్సీ సూచికలు వెల్లడిస్తున్నాయని, 2024–25 వృద్ధి అంచనాలను దాదాపు అన్ని ఏజెన్సీలు కూడా ఎగువముఖంగా సవరిస్తున్నాయని పేర్కొంది. భారత్ వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 7.2 శాతం శ్రేణిలో ఉంటుందని పలు సంస్థలు అంచనావేస్తున్న విషయాన్ని ఎన్‌సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా పేర్కొంటూ.. ఎకానమీ వృద్ధి 2024–25లో 7 శాతం ఖాయమని, 7.5 శాతం వరకూ కూడా ఈ రేటు పురోగమించే వీలుందని అన్నారు. పూనమ్ గుప్తా పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి...
మార్చి త్రైమాసికంలో కనిపించిన ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, వృద్ధి, స్థూల ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలకు తోడు సాధారణ రుతుపవనాల అంచనాలు ఎకానమీకి ఊతం ఇస్తాయి.
ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిల్లోనే కొనసాగే అవకాశం ఉన్నందున, కీలక రెపో రేటు మరింత కఠినమయ్యే పరిస్థితులు లేవు.
అయితే ఆహార ధరలు ఇప్పుడు ప్రధానంగా సవాలు విసురుతున్న సమస్య. దీనిని పరిష్కరించడానికి విస్తృత విధాన ఫ్రేమ్‌వర్క్ అవసరం కావచ్చు. వాతావరణ సవాళ్లను తట్టుకునే ఆహార సరఫరాల చైన్‌ను వ్యవస్థీకరించడంతోపాలు, ప్యాక్ అయిన సురక్షిత ఆహార సరఫరాలవైపు క్రమంగా మారాలి. సరఫరా–డిమాండ్ అంతరాన్ని తగ్గించడానికి తగిన కృషి జరగాలి.
ప్రధాన పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపీ)లో వృద్ధి ఏప్రిల్ 2024లో వేగంగా ఉంది. వస్తువులు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఏడాది పొడవునా పటిష్టంగా ఉన్నాయి. వ్యక్తిగత రుణ వృద్ధిలో కొంత క్షీణత ఉన్నప్పటికీ, బ్యాంక్ క్రెడిట్ వృద్ధి 20 శాతం కంటే ఎక్కువగా ఉంది. జూన్‌లో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ’సాధారణం కంటే ఎక్కువ’ రుతుపవనాల అంచనాలు వ్యవసాయ రంగానికి ఊతం ఇస్తున్నాయి. భారత్ ఎకానమీ పురోగతిలో ఇవన్నీ కీలకాంశాలు.
Comments
Please login to add a commentAdd a comment