న్యూఢిల్లీ: కొత్త వర్క్ ఆర్డర్లు, సానుకూల మార్కెట్ పరిస్థితుల ఊతంతో నవంబర్‌లో సేవల రంగం వృద్ధి వేగం పుంజుకుంది. నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ నవంబర్‌లో 53.7 పాయింట్లుగా నమోదైంది. దీంతో వరుసగా ఆరో నెల కూడా వృద్ధి నమోదైనట్లయింది. అక్టోబర్‌లో ఇది 52.2 పాయింట్లుగా ఉంది. పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) ప్రమాణాల ప్రకారం సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే పెరుగుదలను, దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. మరోవైపు తయారీ, సేవల రంగాలు రెండింటి పనితీరును ప్రతిఫలించే నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ సూచీ.. నవంబర్‌లో అత్యంత వేగవంతమైన వృద్ధి కనపర్చింది. అక్టోబర్‌లో 53గా ఉన్న సూచీ నవంబర్‌లో 54.5గా నమోదైంది. 2016 అక్టోబర్ తర్వాత ఇంత అధికంగా వృద్ధి చెందడం ఇదే ప్రథమం. సానుకూల మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో పదహారు నెలలుగా ఉద్యోగాల కల్పన కొనసాగుతోందని నివేదిక రూపొందించిన ఐహెచ్‌ఎస్ మార్కిట్ సంస్థ ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ పోల్యానా డె లిమా తెలిపారు.
వృద్ధికి ఊతం: గర్గ్
వ్యాపార కార్యకలాపాలు, డిమాండ్ పెరుగుదలను నవంబర్ పీఎంఐ డేటా ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ చెప్పారు. గత నాలుగేళ్ల కాలం చూస్తే.. నవంబర్‌లో ఎగుమతుల వృద్ధి రేటు మరింత మెరుగ్గా ఉందని ఆయన ట్వీట్ చేశారు. అక్టోబర్‌లో ఎగుమతులు 18 శాతం పెరిగి దాదాపు 27 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలంలో ఎగుమతులు 13 శాతం వృద్ధితో 191 బిలియన్ డాలర్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment