![India Needs to Create 11 5 Crore Jobs By 2030 Details](/styles/webp/s3/article_images/2024/05/21/jobs.jpg.webp?itok=i4aRqgaZ)
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. 2030 నాటికి దేశంలో 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని కోసం సర్వీస్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లను పెంచాలని చెబుతున్నారు. ఇది జరిగితే ఇండియా ఎకానమీ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.
ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే.. సంవత్సరానికి 1.65 కోట్ల ఉద్యోగాలను సృష్టించవలసి ఉంటుంది. గత దశాబ్దంలో ప్రతి ఏటా 1.24 కోట్ల ఉద్యోగాలు పెరిగాయని నాటిక్సిస్ ఎస్ఏ సీనియర్ ఎకనమిస్ట్ 'ట్రిన్ న్గుయెన్' సోమవారం ఒక నివేదికలో పేర్కొన్నారు.
![](/sites/default/files/inline-images/manufacturing.jpg)
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. అయితే దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉద్యోగావకాశాలు మందకొడిగానే సాగుతున్నాయి. మూడో సారి మోదీ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగం పెద్ద సవాలుగా మారుతుందని పలువురు చెబుతున్నారు.
గత దశాబ్దంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించినప్పటికీ, కేవలం 10 శాతం ఉద్యోగాలు మాత్రమే అధికారికంగా ఉన్నాయని న్గుయెన్ రాశారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం, దేశం మొత్తం శ్రామిక శక్తి రేటు 58 శాతంగా ఉంది. ఇది ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. చాలా తక్కువ. ఉద్యోగావకాశాలు ఎప్పుడైతే పెరుగుతాయో.. అప్పుడే ఇతర దేశాలతో భారత్ పోటీ పడగలదని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment