చిన్న సంస్థలకు ప్రపంచ బ్యాంకు రుణం
న్యూఢిల్లీ: దేశీ తయారీ, సేవల రంగంలోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) 500 మిలియన్ డాలర్ల రుణం అందించే ప్రతిపాదనకు ప్రపంచ బ్యాంకు ఆమోదముద్ర వేసింది. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు(సిడ్బి), ఇతరత్రా ఆర్థిక సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టు కింద ఎస్‌ఎంఈలకు వివిధ దశల్లో కావాల్సిన నిధులు లభిస్తాయి. ఎస్‌ఎంఈలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించగలవని, అయితే ఇందుకోసం వాటికి నిధులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని వరల్డ్ బ్యాంక్ కంట్రీ డెరైక్టర్ (భారత్) ఓనో రుహల్ తెలిపారు.
అలాంటి అడ్డంకులు అధిగమించి పూర్తి సామర్ధ్యంతో చిన్న సంస్థలు పనిచేసేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడగలదన్నారు. దేశీ పరిశ్రమల్లో 80 శాతం పైగా చిన్న తరహా సంస్థలే ఉన్నాయి. ఇవి 8 వేల పైచిలుకు వివిధ ఉత్పత్తులు తయారు చేస్తూ సుమారు 6 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పరోక్షంగా, ప్రత్యక్షంగా మొత్తం తయారీ రంగ ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతుల్లో దాదాపు 40 శాతం వాటా ఎస్‌ఎంఈలదే ఉంటోంది. కానీ, అవసరానికి నిధులు అందుబాటులో లేకపోతుండటం ఎస్‌ఎంఈలకు ప్రధాన సమస్యగా ఉంటున్న నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ తాజా రుణం ప్రాధాన్యం సంతరించుకుంది.