World Bank loan
-
రాయలసీమ కరువు నివారణకు ప్రపంచ బ్యాంకు సాయం
సాక్షి, అమరావతి: కరువుకు నెలవుగా మారిన రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించడానికి ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకరించింది. రాయలసీమ కరువు నివారణ ప్రణాళిక అమలుకు ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను(పీపీఆర్) తయారుచేసి.. పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రూ.33,869 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన పీపీఆర్‌ను ప్రపంచ బ్యాంకుకు పంపేందుకు జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రణాళిక అమలుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. ఈ నిధులతో కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లో రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా... కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచే పనులను యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిధుల సమీకరణకు స్పెషల్ పర్పస్ వెహికల్ కృష్ణా, గోదావరి, వంశధార తదితర నదుల వరద జలాలను ఒడిసిపట్టి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రచించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల పనులను శరవేగంగా పూర్తి చేయడానికి అవసరమైన నిధుల సమీకరణకు స్పెషల్ పర్పస్ వెహికల్‌ను(ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు సేకరించి, పనులు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. దాంతో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సంప్రదింపులు జరుపుతున్నారు. విధానాలు మార్చుకున్న ప్రపంచ బ్యాంకు కొత్తగా చేపట్టే సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ.. ఆధునీకరణ.. నీటి యాజమాన్య పద్ధతుల అమలు వంటి పనులకు మాత్రమే రుణాలు మంజూరు చేస్తోంది. కానీ, ప్రభుత్వ వినతి మేరకు ప్రపంచ బ్యాంక్ తన విధానాలను మార్చుకోవడానికి అంగీకారం తెలిపింది. రాయలసీమ కరవు నివారణ ప్రణాళిక అమలుకు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. బ్యాంకు సూచనల మేరకు.. కరువు నివారణ ప్రణాళిక అమలుకు రూ.33,869 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన పీపీఆర్‌ను రాష్ట్ర జలవనరుల శాఖ పంపనుంది. ఆ ప్రణాళికపై బ్యాంకు ఆమోదముద్ర వేస్తే.. దాని అమలుకు అయ్యే వ్యయంలో ఎంత వాటాను రుణం రూపంలో ఇచ్చే ఆంశాన్ని స్పష్టం చేస్తుంది. బ్యాంకు వాటాగా ఇచ్చే రుణానికి.. ప్రభుత్వ వాటాను జత చేసి కరువు నివారణ ప్రణాళికను అమలు చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. -
‘అది తప్పుడు ప్రచారం; ప్రజల దృష్టికి తీసుకెళ్లండి’
సాక్షి, అమరావతి : చంద్రబాబు దుర్మార్గాల వల్లనే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించిందని చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాజధాని నిర్మాణానికి రుణమివ్వాలని ప్రపంచ బ్యాంకును అడిగింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలతో రాజధాని రైతులు భయాందోళనకు గురయ్యారని చెప్పారు. అందువల్లనే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకు నివేదికలు పంపారని పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్ యాక్టును దుర్వినియోగం చేశారని, భూ రికార్డులను తారుమారు చేస్తున్నారని రైతులు ప్రపంచ బ్యాంకు దృష్టి తీసుకెళ్లారని వెల్లడించారు. కౌలు రైతులు, రైతులను టీడీపీ సర్కార్ ఇబ్బందులకు గురిచేసిన కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నారు. తమ భూములు కాజేస్తున్నారని దళితులు ప్రపంచబ్యాంకుకు సమాచారమిచ్చారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తేనే ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వడం లేదని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. -
రాజధానిలో ఉల్లంఘనలు నిజమే
సాక్షి, అమరావతి : ‘రాజధాని అమరావతి ప్రాజెక్ట్‌లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. స్థానిక ప్రజల జీవనోపాధితో పాటు పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చే ఇటువంటి ప్రాజెక్ట్‌లో మేం భాగస్వాములం కాలేం’ అని ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది. సుమారు రూ.5,005 కోట్ల విలువైన అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రపంచ బ్యాంక్ గురువారం తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.2,100 కోట్ల (300 మిలియన్ డాలర్లు) రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు వెబ్సైట్లో వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌కు రుణం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లుగా బుధవారం వరకు వెబ్సైట్లో కనిపించగా, గురువారం ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు ప్రకటించింది. మేథాపాట్కర్ హర్షం రాజధాని అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంక్ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్మాదా బచావో ఆందోళన సమితి కార్యకర్త మేథాపాట్కర్, వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్, రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అనుమోలు గాంధీ, మల్లెల శేషగిరిరావు వంటి మేధావులు మొదటి నుంచీ అమరావతి రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏటా నాలుగైదు పంటలు పండే భూముల్లో, అందునా నదీ పరీవాహక ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం చేపట్టడాన్ని వారంతా తప్పుపట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ రైతులు నేరుగా ప్రపంచ బ్యాంకుకే అనేకసార్లు లేఖలు రాశారు. కృష్ణా నది వరదలతో సహజసిద్ధంగా ఏర్పడిన అత్యంత సారవంతమైన భూముల నుంచి రాజధాని నిర్మాణానికి 20 వేల మంది రైతులను బలవంతంగా తరలించడాన్ని వీరు తప్పుపట్టారు. దీనిపై బాధిత రైతులు 2017లో ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్న బ్యాంక్ ప్రతినిధులు అనేకమార్లు రాష్ట్రానికి వచ్చి వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. ప్రజాభిప్రాయ సేకరణ సైతం జరిపారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించడంపై మేథాపాట్కర్ స్పందిస్తూ.. దీనిని ప్రజావిజయంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన చేశారు. పర్యావరణానికి తీవ్ర హాని చేయడంతోపాటు స్థానికుల జీవనోపాధిని దెబ్బతీసే ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రపంచ బ్యాంక్ వైదొలగడాన్ని ఆమె స్వాగతించారు. -
హడావుడిగా ప్రపంచ బ్యాంకు డాక్యుమెంటరీ చిత్రీకరణ
తుళ్లూరు: రైతుల భూములను చూపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం మండల కేంద్రమైన తుళ్లూరులోని స్థానిక సీఆర్డీఏ కార్యాలయ ప్రాంగణంలో ఏపీసీఆర్డీఏ, ఏడీసీ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకు డాక్యుమెంటరీ షూటింగ్ జరిగింది. అయితే ప్రపంచ బ్యాంకుకు రైతుల అభిప్రాయాలను డాక్యుమెంటరీ రూపంలో అందజేసేటప్పుడు రాజధాని ప్రాంత రైతులకు ముందస్తు సమాచారం ఇవాల్సి ఉంటుంది. రైతులందరూ ఎక్కడ తమ సమస్యలు చెప్పుకుంటారోననే ఆందోళనతో గుట్టుచప్పుడుగా, తమకు అనుకూలంగా వ్యవహరించే కొందరు రైతులతో మాట్లాడించి హడావుడిగా ముగించేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజధాని రైతులు తమకు సమాచారం ఇవ్వకుండా డాక్యుమెంటరీకి అభిప్రాయాలు ఎలా సేకరిస్తారని మండిపడుతున్నారు. తొలుత తమ భూములకు çసంబంధించిన సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో తమ భూములతో ప్రభుత్వం రుణాలు పొందాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. -
ప్రజారోగ్యానికి ప్రపంచబ్యాంకు రుణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రపంచబ్యాంకు రుణం తీసుకోవాలని శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రి మండలి నిర్ణయాలను విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్లతో కలసి సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. - రాష్ట్రంలో ప్రాథమిక వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.4,807 కోట్లు అవసరమని, వాటిలో ప్రపంచబ్యాంకు నుంచి 70 శాతం (రూ.3,365 కోట్లు) రుణంగాను, మిగిలిన 30 శాతం (రూ.1,442కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. - టాటా ట్రస్ట్‌కు బాలామృతం కార్యక్రమంలో పౌష్టికాహారాన్ని అందించే బాధ్యత అప్పగింత. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ ట్రస్టు ద్వారా మహిళలకు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాల్సి ఉంటుంది. - రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో రూ. 38,265 కోట్లతో 5 లక్షల ఇళ్ల నిర్మాణం. ఈ హౌజింగ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,035 కోట్లు, కేంద్రం రూ.7,500 కోట్లు భరిస్తాయి. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు సమకూర్చుకుంటాడు. -
స్కిల్ ఇండియాకు 1,600 కోట్లు
రుణానికి ప్రపంచ బ్యాంకు అంగీకారం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ ఇండియా పథకానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. దేశంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేందుకు అనువుగా శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి రూ.1,600 (250 మిలియన్ డాలర్లు) కోట్ల రుణం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత దేశ ఆర్థికాభివృద్ధికి, సుసంప న్నతకు యువత తోడ్పాటు అందించేందుకు ఈ సాయం దోహదపడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. స్కిల్ ఇండియా మిషన్‌కు 250 మిలియన్ డాలర్లు అందించేందుకు ప్రపంచ బ్యాంకు బోర్డు ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపారని, రాష్ట్ర స్థాయిలోనూ.. జాతీయ స్థాయిలోనూ స్వల్పకాలిక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్(3–12 నెలలు లేదా 600 గంటల వరకూ)కు ప్రోత్సాహం అందించేందుకు ఈ సాయం ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. 2022 నాటికి దేశంలోని 24 కీలక రంగాల్లో 10.9 కోట్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉంటుందని అధికార గణాంకాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ పథకం కింద 15–59 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు, తక్కువ ఉపాధి కలిగిన వారికి నైపుణ్య శిక్షణ అందిస్తారు. అలాగే ఏటా లేబర్ మార్కెట్లోకి వస్తున్న 1.2 కోట్ల మంది 15–29 ఏళ్ల వయసు కలిగిన యువతను కూడా ఇందులో చేరుస్తారు. ఆరేళ్ల కాల పరిమితి కలిగిన ఈ కార్యక్రమం పూర్తయ్యే నాటికి 88 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకుని.. మెరుగైన అవకా శాలను.. మెరుగైన వేతనాన్ని పొందుతారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా 15 వేల మంది ట్రైనర్లకు, 3 వేల మంది మదింపు అధికారులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించింది. -
చిన్న సంస్థలకు ప్రపంచ బ్యాంకు రుణం
న్యూఢిల్లీ: దేశీ తయారీ, సేవల రంగంలోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) 500 మిలియన్ డాలర్ల రుణం అందించే ప్రతిపాదనకు ప్రపంచ బ్యాంకు ఆమోదముద్ర వేసింది. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు(సిడ్బి), ఇతరత్రా ఆర్థిక సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టు కింద ఎస్ఎంఈలకు వివిధ దశల్లో కావాల్సిన నిధులు లభిస్తాయి. ఎస్ఎంఈలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించగలవని, అయితే ఇందుకోసం వాటికి నిధులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని వరల్డ్ బ్యాంక్ కంట్రీ డెరైక్టర్ (భారత్) ఓనో రుహల్ తెలిపారు. అలాంటి అడ్డంకులు అధిగమించి పూర్తి సామర్ధ్యంతో చిన్న సంస్థలు పనిచేసేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడగలదన్నారు. దేశీ పరిశ్రమల్లో 80 శాతం పైగా చిన్న తరహా సంస్థలే ఉన్నాయి. ఇవి 8 వేల పైచిలుకు వివిధ ఉత్పత్తులు తయారు చేస్తూ సుమారు 6 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పరోక్షంగా, ప్రత్యక్షంగా మొత్తం తయారీ రంగ ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతుల్లో దాదాపు 40 శాతం వాటా ఎస్ఎంఈలదే ఉంటోంది. కానీ, అవసరానికి నిధులు అందుబాటులో లేకపోతుండటం ఎస్ఎంఈలకు ప్రధాన సమస్యగా ఉంటున్న నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ తాజా రుణం ప్రాధాన్యం సంతరించుకుంది.