స్కిల్ ఇండియాకు 1,600 కోట్లు
రుణానికి ప్రపంచ బ్యాంకు అంగీకారం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ ఇండియా పథకానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. దేశంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేందుకు అనువుగా శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి రూ.1,600 (250 మిలియన్ డాలర్లు) కోట్ల రుణం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత దేశ ఆర్థికాభివృద్ధికి, సుసంప న్నతకు యువత తోడ్పాటు అందించేందుకు ఈ సాయం దోహదపడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
స్కిల్ ఇండియా మిషన్‌కు 250 మిలియన్ డాలర్లు అందించేందుకు ప్రపంచ బ్యాంకు బోర్డు ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపారని, రాష్ట్ర స్థాయిలోనూ.. జాతీయ స్థాయిలోనూ స్వల్పకాలిక స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్(3–12 నెలలు లేదా 600 గంటల వరకూ)కు ప్రోత్సాహం అందించేందుకు ఈ సాయం ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. 2022 నాటికి దేశంలోని 24 కీలక రంగాల్లో 10.9 కోట్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉంటుందని అధికార గణాంకాలు అంచనా వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ పథకం కింద 15–59 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు, తక్కువ ఉపాధి కలిగిన వారికి నైపుణ్య శిక్షణ అందిస్తారు. అలాగే ఏటా లేబర్ మార్కెట్‌లోకి వస్తున్న 1.2 కోట్ల మంది 15–29 ఏళ్ల వయసు కలిగిన యువతను కూడా ఇందులో చేరుస్తారు. ఆరేళ్ల కాల పరిమితి కలిగిన ఈ కార్యక్రమం పూర్తయ్యే నాటికి 88 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకుని.. మెరుగైన అవకా శాలను.. మెరుగైన వేతనాన్ని పొందుతారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా 15 వేల మంది ట్రైనర్లకు, 3 వేల మంది మదింపు అధికారులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించింది.