ఈ ఏడాది నుంచే స్కిల్‌ కాలేజీలు | Skill colleges starting this year Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది నుంచే స్కిల్‌ కాలేజీలు

Published Tue, May 17 2022 4:55 AM | Last Updated on Tue, May 17 2022 8:37 AM

Skill colleges starting this year Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి:  ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో 26 స్కిల్స్‌ కాలేజీలు అందుబాటులోకి రానున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) వెల్లడించింది. కొత్త కాలేజీల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చేవరకూ తాత్కాలికంగా 26 స్కిల్‌ కాలేజీలను తక్షణమే ప్రారంభించబోతున్నట్లు సంస్థ ఎండీ ఎస్‌. సత్యనారాయణ తెలిపారు.

స్కిల్‌ కాలేజీల నిర్మాణాలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన కథనాల్లో ఏమాత్రం నిజంలేదని సోమవారం ఆయన ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్కిల్‌ కాలేజీలు, స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే పులివెందులలో మొదటి స్కిల్‌ కాలేజి నిర్మాణం ప్రారంభమైందని.. ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 

ప్రతి నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌ 
ఇక వీటికి అదనంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో స్కిల్‌ హబ్‌ను కూడా ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సత్యనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 86 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 89 స్కిల్‌ హబ్స్‌ కేంద్రాలను ఇప్పటికే గుర్తించారని.. వీటి ఏర్పాటుకు 194 పరిశ్రమలను సంప్రదించి డిమాండ్‌కు అవసరమైన 185 కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధంచేశారని పేర్కొన్నారు. ఈ శిక్షణా కేంద్రాల మ్యాపింగ్, పరిశ్రమల్లో ఎలాంటి ఉద్యోగాలకు డిమాండ్‌ ఉంది అన్న అంశాలపైనా సర్వే కూడా పూర్తయిందన్నారు.

కోర్సుల ఎంపిక, సిలబస్‌ రూపకల్పన, ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్, అసెస్మెంట్, ధృవీకరణ పత్రాల అందజేత లాంటి విషయాల్లో నేషనల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఎస్క్యూఎఫ్‌)కు అనుగుణంగానే కోర్సులను ఎంపిక చేస్తున్నామన్నారు. ఇందులో పరిశ్రమలు, వివిధ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్స్, విద్యారంగ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఇటీవలే విజయవాడలో ఒక సదస్సు నిర్వహించామని సత్యనారాయణ చెప్పారు. 

కోవిడ్‌ సమయంలో కూడా శిక్షణ 
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు నిలిచిపోయాయంటూ ఈనాడులో వచ్చిన కథనాన్ని సత్యనారాయణ ఖండించారు. కోవిడ్‌ సమయంలో శిక్షణా కార్యక్రమాలకు బ్రేక్‌ పడిందని.. కానీ, ఇప్పుడు తిరిగి శ్రీకారం చుట్టినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. గడచిన రెండేళ్లలో 13 లక్షల మంది నైపుణ్య శిక్షణ పొందారన్నారు. కోవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా రెండు లక్షల మంది లబ్ధిపొందారని వివరించారు.

కోవిడ్‌ సమయంలోనూ శిక్షణ ఇచ్చినందుకుగాను జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అవార్డుతో ఏపీఎస్‌ఎస్‌డీసీకి గుర్తింపు లభించిందన్నారు. ఇక ఈ ఏడాది జనవరి 4 నుంచి 10 వరకు ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువత ఏడు బంగారు, నాలుగు వెండి, రెండు రజతాలు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన కేటగిరిలో నాలుగు.. మొత్తం 17 పతకాలు సాధించారని సత్యనారాయణ గుర్తుచేశారు. అలాగే, గతంలో స్కిల్‌ ఇండియా పోటీల్లో 13వ స్థానంలో ఉన్న ఏపీ ఈ ఏడాది 5వ స్థానంలో నిలిచిందన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement