సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ముసుగులో సాగిన కుంభకోణాన్ని రాజ్యాంగ ప్రతిపత్తిగల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు చెందిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కూడా నిగ్గుతేల్చింది.
యువతకు నైపుణ్యాభివృద్ధి ముసుగులో సీమెన్స్ కంపెనీ పేరిట చంద్రబాబు ప్రభుత్వం నడిపించిన ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలను కడిగిపారేసింది. 2015 నుంచి 2018 వరకు సాగిన ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టు రికార్డులను కాగ్ 2018 మే 29 నుంచి జూన్ 22 వరకు పరిశీలించింది. అందులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండిపడిందని తేల్చింది. కాగ్ ప్రధానంగా లేవనెత్తిన అభ్యంతరాలివే..
రూ.370 కోట్ల ప్రాజెక్టును రూ.3,300 కోట్లుగా..
సీమెన్స్ కంపెనీ పేరిట ప్రాజెక్టు నివేదిక రూపకల్పనలోనే చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఆ ప్రాజెక్టులో పేర్కొన్న వివరాల ప్రకారం ఆ ఒప్పందం విలువ రూ.370కోట్లు మాత్రమే. ప్రైవేటు కంపెనీ సరఫరా చేస్తామని చెప్పిన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్‌లను పరిశీలిస్తే ఆ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లుగానే లెక్కతేలిందని పేర్కొంది. కానీ, అది రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా భ్రమింపజేసేలా అంచనాలను అమాంతంగా పెంచేసి నివేదికను రూపొందించారు. దాంతోనే ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఆస్కారం ఏర్పడింది.
ఇంతవరకూ లెక్కాపత్రం లేదు
ఇక ప్రాజెక్టు ఒప్పందంలో భాగంగా సరఫరా చేసిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ విలువ ఎంత అన్నది కనీసం నిర్థారించలేదు. నిపుణులైన ఏజెన్సీలతో నిర్థారించాలని 2017, నవంబరు 25న నిర్వహించిన ఏపీఎస్‌ఎస్‌డీసీ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. కానీ, ఆ మేరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. డిజైన్‌టెక్ కంపెనీ సరఫరా చేసిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కొనుగోలు ఆర్డర్ కాపీని ఆడిట్ కోసం అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం.
ఖజానాకు రూ.355 కోట్ల గండి
నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు రూపకల్పన, నిధుల విడుదలతో మొత్తం రూ.355 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ప్రాజెక్టులో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రాజెక్టు విలువలో ప్రభుత్వం 10శాతం నిధులు కేటాయించాలి. అంటే, ప్రాజెక్టు వాస్తవ విలువ రూ.370 కోట్లుగా చూపించి ఉంటే.. ప్రభుత్వం రూ.37 కోట్లు మాత్రమే విడుదల చేయాలి.
కానీ.. అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి.. ప్రభుత్వ వాటా 10 శాతంతో పాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలుపుతూ ఏకంగా రూ.370 కోట్లు విడుదల చేశారు. అలా రూ.333 కోట్లు కొల్లగొట్టారు. అంతేకాదు, ఒక ఏడాది ముందే.. అది కూడా ప్రాజెక్టు మొదలుకాకుండానే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం గమనార్హం. దాంతో రూ.22 కోట్ల వడ్డీ రూపంలో రావల్సిన ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లింది.
నకిలీ ఇన్వాయిస్‌లతో రూ.241కోట్లు కొల్లగొట్టారు
ఇక షెల్ కంపెనీలు సరఫరా చేసినట్లుగా నకిలీ ఇన్వాయిస్‌లు చూí³ంచి కనికట్టు చేశారు. ఆ విధంగా రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారు. అక్కడ నుంచి హవాలా మార్గంలో టీడీపీ పెద్దలకు ఆ నిధులు చేరాయని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది.
ఒప్పందంలో కాలేజీలకు భాగస్వామ్యం లేదు
అలాగే, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం చేసుకున్నామని చెబుతున్న ఈ ఒప్పందంలో సంబంధిత కాలేజీలను భాగస్వాములను చేయనేలేదు. దాంతో ఆ కాలేజీలకు ఎలాంటి పాత్రా లేకుండాపోయింది. వాటిల్లో నెలకొల్పిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఏర్పాటుచేసిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ విలువ ఎంతన్నది మదింపు చేయనేలేదు. ఆ కాలేజీల యాజమాన్యాలకు కూడా ఆ విషయంపై ఎలాంటి అవగాహనలేదు.
Comments
Please login to add a commentAdd a comment