Domestic manufacturing
-
5 ఏళ్లు.. 50 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: వైద్య రంగంలో ఉపయోగించే పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే తయారీకి ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ 2023కి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. వైద్య పరికరాల రంగం వచ్చే అయిదేళ్లలో 50 బిలియన్ డాలర్ల స్థాయికి (దాదాపు రూ. 4.1 లక్షల కోట్లు) చేరేందుకు ఇది తోడ్పడనుంది. భారత్‌లో వైద్య పరికరాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటంతో వీటిని దేశీయంగానే ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియాకు తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దిగుమతులు కూడా ఉంటాయని, అయితే సాధ్యమైనంత మేరకు స్థానిక అవసరాలకు అనుగుణంగా దేశీయంగానే ఉత్పత్తిని పెంచుకోవడమే కొత్త విధానం లక్ష్యమని వివరించారు. ఆరు వ్యూహాలు..: నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీలో ఆరు వ్యూహాలను నిర్దేశించుకున్నారు. నియంత్రణ విధానాలను క్రమబద్ధీకరించడం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన.. అభివృద్ధి.. ఆవిష్కరణలకు తోడ్పాటు అందించడం, పరిశ్రమలోకి పెట్టుబడులను ఆకర్షించడం, మానవ వనరుల అభివృద్ధి, మన పరిశ్రమకు బ్రాండింగ్ సాధించడం .. అవగాహన కల్పించడం వంటివి ఈ వ్యూహాల్లో ఉన్నాయి. ఇటు భారత్, అటు ప్రపంచ హెల్త్‌కేర్ అవసరాలను తీర్చే దిశగా దేశీయంగా వైద్య పరికరాల రంగం స్వయం సమృద్ధి సాధించేలా, ఒడుదుడుకులను సమర్థంగా ఎదుర్కొంటూ పటిష్టమైన పరిశ్రమగా ఎదిగేలా అవసరమైన మద్దతు కల్పించి, దిశా నిర్దేశం చేసేందుకు ఈ పాలసీ ఉపయోగపడనుంది. ప్రధానంగా పేషంట్లను దృష్టిలో ఉంచుకుని, వారి అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను తయారు చేస్తూ వైద్య పరికరాల రంగం వేగవంతంగా వృద్ధి చెందేలా ఊతమివ్వాలని ఇందులో నిర్దేశించుకున్నారు. 11 బిలియన్ డాలర్ల పరిశ్రమ.. దేశీయంగా వైద్య పరికరాల మార్కెట్ 2020లో 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 90,000 కోట్లు) స్థాయిలో ఉందని అంచనా. అంతర్జాతీయంగా మెడికల్ డివైజ్‌ల మార్కెట్లో మన వాటా దాదాపు 1.5% వైద్య పరికరాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రం ఇప్పటికే ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని అమలు చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్‌లో 4 మెడికల్ డివైజ్ పార్క్‌ల ఏర్పాటు కోసం తోడ్పాటు అందిస్తోంది. ఈ స్కీము కింద ఇప్పటివరకు రూ. 1,206 కోట్ల విలువ చేసే పెట్టుబడులతో 26 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. 37 ఉత్పత్తులను తయారు చేసే 14 ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు వివరించింది. వీటిలో లీనియర్ యాక్సిలరేటర్, ఎంఆర్ఐ స్కాన్, సీటీ–స్కాన్, మామోగ్రామ్, సీ–ఆర్మ్, ఎంఆర్ఐ కాయిల్స్, అధునాతన ఎక్స్–రే ట్యూబ్స్ మొదలైనవి ఉత్పత్తి చేస్తున్నారు. -
వారికి ఊరట : దిగుమతి సుంకం రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ వస్త్ర ఉత్పత్తులకు, ఉత్పత్తిదారులు, ఊరట నిచ్చేలా కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెక్స్టైల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసింది. భారీ సంఖ్యలో ఈ ఉత్పత్తులపై 20 శాతం దిగుమతి సుంకం విధించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ను మంగళవారం ప్రభుత్వం లోక్‌సభకు సమర్పించింది. 328 రకాల వస్త్ర ఉత్పత్తులపై 20 శాతం పన్ను విధిస్తున్నట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పోన్ రాధాకృష్ణన్ లోకసభకు చెప్పారు. దిగుమతి చేసుకునే వస్త్ర ఉత్పత్తులపై ప్రస్తుతం పన్ను తక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కస్టమ్స్ యాక్ట్ (1962) సెక్షన్ 159 ప్రకారం రెట్టింపునకు నిర్ణయించినట్టు తెలిపారు. తద్వారా దేశీయ తయారీదారులకు మంచి ప్రోత్సాహం లభించడంతోపాటు, ఈ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. అయితే దిగుమతి చేసుకున్న వస్త్రాల ధరలుమాత్రం మోత మోగనున్నాయి. అలాగే కేంద్రం నిర్ణయంబ చైనా ఉత్పత్తులనే ఎక్కువగా ప్రభావితం చేయనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. కాగా గత నెలలో ప్రభుత్వం 50రకాల వస్త్రాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం రెండింతలు చేసింది. జాకెట్లు, సూట్లు, కార్పెట్లపై 20 శాతం దిగుమతి సుంకం విధించిన సంగతి తెలిసిందే. -
చిన్న సంస్థలకు ప్రపంచ బ్యాంకు రుణం
న్యూఢిల్లీ: దేశీ తయారీ, సేవల రంగంలోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) 500 మిలియన్ డాలర్ల రుణం అందించే ప్రతిపాదనకు ప్రపంచ బ్యాంకు ఆమోదముద్ర వేసింది. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు(సిడ్బి), ఇతరత్రా ఆర్థిక సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టు కింద ఎస్ఎంఈలకు వివిధ దశల్లో కావాల్సిన నిధులు లభిస్తాయి. ఎస్ఎంఈలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించగలవని, అయితే ఇందుకోసం వాటికి నిధులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని వరల్డ్ బ్యాంక్ కంట్రీ డెరైక్టర్ (భారత్) ఓనో రుహల్ తెలిపారు. అలాంటి అడ్డంకులు అధిగమించి పూర్తి సామర్ధ్యంతో చిన్న సంస్థలు పనిచేసేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడగలదన్నారు. దేశీ పరిశ్రమల్లో 80 శాతం పైగా చిన్న తరహా సంస్థలే ఉన్నాయి. ఇవి 8 వేల పైచిలుకు వివిధ ఉత్పత్తులు తయారు చేస్తూ సుమారు 6 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పరోక్షంగా, ప్రత్యక్షంగా మొత్తం తయారీ రంగ ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతుల్లో దాదాపు 40 శాతం వాటా ఎస్ఎంఈలదే ఉంటోంది. కానీ, అవసరానికి నిధులు అందుబాటులో లేకపోతుండటం ఎస్ఎంఈలకు ప్రధాన సమస్యగా ఉంటున్న నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ తాజా రుణం ప్రాధాన్యం సంతరించుకుంది.