Small companies
-
చిన్న షేర్ల పెద్ద క్రాష్
సెన్సెక్స్ భారీ పతనంతో బీఎస్ఈలో రూ.13.47 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.372 లక్షల కోట్లకు దిగివచి్చంది. గత 3 రోజుల్లో రూ.20.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ముంబై: చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల భారీ పతనంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. అమెరికా ద్రవ్యోల్బణం దిగిరాకపోవడంతో ‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు’ ఆశలు సన్నగిల్లాయి. ట్రేడింగ్‌లో వినిమయ, ఇంధన, మెటల్ షేర్ల భారీ పతనంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ 73,000, నిఫ్టీ 22,000 స్థాయిలను కోల్పోయాయి. లాభాల నుంచి భారీ నష్టాల్లోకి ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టానికి దిగివచి్చన సానుకూల సంకేతాలతో ఉదయం స్టాక్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 325 పాయింట్లు పెరిగి 73,993 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు బలపడి 22,432 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే చిన్న, మధ్య తరహా షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలు జరుగుతున్నాయన్న సెబీ చైర్మన్ మాధవీ పురి ఇటీవలి వ్యాఖ్యలు దీనికి నేపథ్యం. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,152 పాయింట్లు క్షీణించి 72,516 వద్ద, నిఫ్టీ 430 పాయింట్లు దిగివచ్చి 21,906 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 906 పాయింట్లు నష్టపోయి 72,762 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 338 పాయింట్లు పతనమై 21,997 వద్ద స్థిరపడ్డాయి. ► స్కాటిష్ చమురు కంపెనీ కెయిర్న్‌కు రూ.77.6 కోట్లు చెల్లించాలంటూ సెబీ ఆదేశాలు జారీ చేయడంతో వేదాంత లిమిటెడ్ షేరు 7% నష్టపోయి రూ.252 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ 8% నష్టపోయి రూ.250 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కంపెనీకి రూ.6,858 కోట్ల నష్టం వాటిల్లింది. ► మార్కెట్ పతనంలో భాగంగా అదానీ గ్రూప్ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మొత్తం పదింటికి గానూ ఏడు కంపెనీల షేర్లు నష్టపోయాయి ► జీజే కెమికల్స్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.221)తో పోలిస్తే 4.52% డిస్కౌంట్‌తో రూ.211 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 18% క్షీణించి రూ.181 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 16% నష్టపోయి రూ.185 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.724 కోట్లుగా నమోదైంది. ఎఫ్‌అండ్‌వోపై దృష్టి ఆందోళనకరం రిటైల్ ఇన్వెస్టర్లకు సీఈఏ హెచ్చరిక అత్యధిక రిసు్కలతోకూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో లావాదేవీలు చేపట్టేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం ఆందోళనకరమని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా పేర్కొన్నారు. తక్షణ లాభాలపై దృష్టి పెట్టడం పెట్టుబడుల పురోగతికి ప్రతికూలమని సెబీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. -
దిగ్గజాలకు చిన్న సంస్థల సవాల్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో దిగ్గజ కంపెనీలకు చిన్న సంస్థలు సవాళ్లు విసురుతున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గడంతో చిన్న బ్రాండ్లు మళ్లీ బలంగా పుంజుకుంటున్నాయి. పెద్ద సంస్థలకు బలమైన పోటీనిస్తున్నాయి. మార్కెట్లో వాటాను పెంచుకంటూ, పెద్ద సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించక తప్పని పరిస్థితులను కలి్పస్తున్నాయి. సబ్బులు, టీ, డిటర్జెంట్, బిస్కట్ల విభాగంలో ఈ పరిస్థితి ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), గోద్రేజ్ కన్జ్యూమర్, మారికో, బ్రిటానియా, టాటా కన్జ్యూమర్ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాల విడుదల సందర్భంగా.. చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీ కారణంగా ఉత్పత్తుల ధరలను సవరించాల్చి వచి్చనట్టు పేర్కొనడం గమనార్హం. ‘‘ద్రవ్యోల్బణం గరిష్టాల్లో ఉన్నప్పుడు చిన్న సంస్థలకు ఉత్పత్తుల తయారీపై అధిక వ్యయం అవుతుంది. దీంతో అవి పెద్ద సంస్థలకు ధరల పరంగా గట్టి పోటీనిచ్చే పరిస్థితి ఉండదు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు మార్జిన్లు ఎక్కువగా ఉండడంతో అవి అధిక డిస్కౌంట్లు ఇవ్వగలవు’’అని బ్రిటానియా ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్, ఎండీ వరుణ్ బెర్రీ ఇన్వెస్టర్ల కాల్లో పేర్కొన్నారు. ఒక్కసారి కమోడిటీల ధరలు తగ్గడం మొదలైతే, వాటి మార్జిన్లు పెరుగుతాయని, దీంతో అధిక డిస్కౌంట్లు ఇవ్వడం మొదలు పెడతాయన్నారు. కొన్ని విభాగాల్లో అధిక పోటీ ‘‘ఒకవైపు బలమైన బ్రాండ్లతో పెద్ద సంస్థలతో పోటీ పడాలి. ధరల యుద్ధంతో అవి మార్కెట్ వాటాను చిన్న సంస్థలకు కోల్పోవాల్సి వస్తోంది. మేము ఈ చట్రంలో ఇరుక్కోవాలని అనుకోవడం లేదు. రెండింటి మధ్య సమతుల్యం ఉందనుకున్న విభాగంలోనే ముందుకు వెళతాం’’అని టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ పేర్కొనడం గమనార్హం. టీ పొడి మార్కెట్లో ప్రాంతీయంగా చిన్న సంస్థల నుంచి పోటీ ఉన్నట్టు తెలిపింది. ఇతర విభాగాల మాదిరిగా కాకుండా, టీ మార్కెట్లో అన్ బ్రాండెడ్ కారణంగా చిన్న సంస్థలు ఎప్పుడూ ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో దీని కారణంగా కొంత వ్యాపారం కోల్పోవాల్సి వస్తుందంటూ.. తమ ప్రీమియం ఉత్పత్తుల వాటా పెరుగుతున్నందున ఇది తమపై ఏమంత ప్రభావం చూపబోదని వాటాదారులకు టాటా కన్జ్యూమర్ వివరించింది. ధరలు తగ్గింపు.. చిన్న సంస్థలు చాలా చురుగ్గా ఉన్నాయని, వాటి కారణంగా మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొన్నట్టు మారికో ఎండీ, సీఈవో సౌగత గుప్తా తెలిపారు. ప్రస్తుత పరిణామాల్లో కొన్ని విభాగాల చిన్న సంస్థల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరలు తగ్గించి, వినియోగదారులకు విలువను చేకూర్చే చర్యలు అమ్మకాల వృద్ధికి వచ్చే కొన్ని త్రైమాసికాల్లో దోహదపడతాయి’8అని సౌగత గుప్తా తెలిపారు. -
అన్ని ప్రైవేట్ కంపెనీల షేర్లు డీమ్యాట్‌లోనే.. ఎంసీఐ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీల సెక్యూరిటీల విషయంలో పారదర్శకతను పెంచే దిశగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఐ) కీలక ఆదేశాలిచ్చింది. 2024 సెప్టెంబర్ నుంచి ప్రైవేట్ కంపెనీలన్నీ డీమ్యాట్ (డిజిటల్) రూపంలోనే సెక్యూరిటీలను జారీ చేయాలని ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. చిన్న సంస్థలు, ప్రభుత్వ రంగ కంపెనీలకు దీన్నుంచి మినహాయింపునిచ్చింది. కొన్ని సంస్థలు భౌతిక ఫార్మాట్లో జారీ చేసే షేర్లకు సంబంధించి అవకతవకలు చోటుచేసుకునే అవకాశాలను కట్టడి చేసేందుకు ఈ ఆదేశాలు ఉపయోగపడనున్నాయి. కంపెనీల చట్టం కింద ప్రస్తుతం రిజిస్టరయిన 14 లక్షల పైచిలుకు ప్రైవేట్ సంస్థలపై దీని ప్రభావం పడవచ్చని న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ ఆనంద్ జయచంద్రన్ తెలిపారు. సాధారణంగా షేర్ల జారీకి సంబంధించి కంపెనీల చట్టం 2013 కింద ప్రైవేట్ కంపెనీలకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిలో షేర్‌హోల్డర్ల సంఖ్య 200కు మించి ఉండకూడదు. నోటిఫికేషన్ ప్రకారం 2024 సెప్టెంబర్ తర్వాత నుంచి ప్రైవేట్ సంస్థలు షేర్ల జారీ, బైబ్యాక్, బోనస్ ఇష్యూ లేదా రైట్స్ ఆఫర్ మొదలైనవన్నీ డీమ్యాట్ రూపంలోనే జరగాలి. నాలుగు కోట్ల రూపాయల వరకు పెయిడప్ షేర్ క్యాపిటల్, రూ. 40 కోట్ల వరకు టర్నోవరు ఉన్న చిన్న సంస్థలకు, కొన్ని పరిమితులకు లోబడి, మినహాయింపు ఉంటుంది. మరోవైపు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ (ఎల్ఎల్పీ)ల నిబంధనలను కూడా ఎంసీఏ సవరించింది. వీటి ప్రకారం .. ఏర్పాటైన తేదీ నుంచి ప్రతి ఎల్ఎల్పీ తమ భాగస్వాముల చిరునామా, పాన్ నంబరు మొదలైన వివరాలతో ఒక రిజిస్టర్‌ను నిర్వహించాలి. -
చిన్న షేర్లకు పెద్ద కష్టం
ముంబై: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన తర్వాత దేశీయ ఈక్విటీ మార్కెట్ ఈ ఏడాది ఆరంభం నుంచి స్థిరీకరణ దిశగా సాగింది. ఈ క్రమంలో చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లు(స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ షేర్లు) భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బీఎస్ఈ స్మాల్ ఇండెక్సు 4 శాతం, స్మాల్ క్యాప్ సూచీ మూడు శాతం చొప్పున డీలా పడ్డాయి. ఇదే సమయంలో సెన్సెక్స్ రెండుశాతమే నష్టపోయింది. సాధారణంగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు చిన్న, మధ్య తరహా రంగాల షేర్లను, విదేశీ ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. గతేడాదిలో దేశీయ ఈక్విటీ మార్కెట్ 22 శాతం ర్యాలీ చేసింది. ఇవీ కారణాలు రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, రికార్డు స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణ ఆందోళనలతో ఈ ఏడాది ఆరంభం నుంచి దేశీయ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంది. భారత కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదుచేయలేకపోయాయి. తాజాగా ఫెడ్ రిజర్వ్ కఠిన ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలకు మొగ్గుచూపొచ్చనే సంకేతాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ పెద్ద ఎత్తున చిన్న, మధ్య తరహా షేర్లను అమ్మేశారు. ‘‘సాధారణంగా బేరిష్ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీల షేర్లను(లార్జ్ క్యాప్) రక్షణాత్మక షేర్లుగా భావిస్తూ అట్టిపెట్టుకుంటారు. సెన్సెక్స్, నిఫ్టీలు ఏదో ఒక స్థాయి వద్ద స్థిరపడి.., మళ్లీ సానుకూలత ఏర్పడే వరకు చిన్న, తరహా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతూనే ఉంటాయి. అయితే ధీర్ఘకాల దృష్ట్యా భారత ఈక్విటీ మార్కెట్లో బుల్ రన్ జరిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అప్పుడు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో తిరిగి ర్యాలీ ప్రారంభం అవుతుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ న్యాతి తెలిపారు. ► గతేడాది మే 4న బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 21,847 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఈ ఏడాది జనవరి 18న 31,304 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని నమోదుచేసింది. 2021లో 63 శాతం ర్యాలీ చేసింది. ► బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ గతేడాది అక్టోబర్ 19 తేదీన 27,246 స్థాయి వద్ద 52–వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఇదే సూచీ ఈ ఏడాదిలో మార్చి 4న 20,184 స్థాయి వద్ద ఏడాది కనిష్టానికి దిగివచ్చింది. 2021లో 39 శాతం ర్యాలీ చేసింది. -
చిన్న పెట్టుబడి.. చిగురించేనా..?
‘స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’.. కాదని ఎవరూ అనరు. చిన్నారుల పట్ల ఎంతో శ్రద్ధ, సంరక్షణ, ముద్దు చూపిస్తాం. వారు భవిష్యత్ తరాలకు ప్రతిరూపాలు. అందుకే ఆ మాత్రం కేరింగ్ ఉంటుంది. అలాగే, విరామం అన్నది లేకుండా కష్టపడి సంపాదించుకుని, మిగుల్చుకున్న కొద్ది మొత్తంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే ముందు శ్రద్ధ అవసరం లేదా..? కచ్చితంగా ఉండాలి. చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే విషయంలోనూ ఇన్వెస్టర్లకు అంతే శ్రద్ధ, పరిశీలన, జాగ్రత్త అవసరం. పెద్ద కంపెనీలతో పోలిస్తే.. ఒక నిర్ధేశిత కాలంలో చిన్న కంపెనీలు అధిక రాబడులు ఇస్తాయన్నది కాదనలేని నిజం. 2020 ఏప్రిల్ నుంచి చూసుకుంటే లార్జ్‌క్యాప్ కంపెనీలు నూరు శాతం వరకు రాబడులను ఇవ్వగా.. మిడ్‌క్యాప్ కంపెనీలు రెండు రెట్లు, అంతకంటే ఎక్కువ, స్మాల్‌క్యాప్‌లో ఐదు రెట్లు, పది రెట్ల లాభాలను కురిపించిన స్టాక్స్ ఎన్నో ఉన్నాయి. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మందికి చిన్న కంపెనీలంటే అంత ఆకర్షణ. కార్పొరేట్ ప్రపంచంలో ఎస్ఎంఈలు అంటే చాలా చిన్న కంపెనీలని అర్థం చేసుకోవాలి. పెద్ద కంపెనీలతో పోలిస్తే వేగంగా ఎదిగే సామర్థ్యం వీటికి సహజంగానే ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేని సమయాల్లో ఇవి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే.. ప్రతికూల పరిస్థితుల వల్ల ఒక పెద్ద కంపెనీ డివిడెండ్ ఆపేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక చిన్న కంపెనీ ఏకంగా మూతపడిపోవచ్చు. అందుకే ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. బీఎస్ఈ ‘ఎస్ఎంఈ’, ఎన్ఎస్ఈ ‘ఎమర్జ్’ ప్లాట్‌ఫామ్‌లు ఎస్ఎంఈల కోసం ఉద్దేశించినవి. ఇక్కడ సుమారు 380 స్టాక్స్ లిస్ట్ అయి ఉన్నాయి. వీటి మొత్తం మార్కెట్ విలువ రూ.25,600 కోట్లు. ఒక మిడ్‌క్యాప్ కంపెనీ మార్కెట్ విలువకు సమానం. మార్కెట్ విలువ విషయంలో నక్కకి, నాగలోకానికి అన్నట్టు ఈ కంపెనీల మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. ఒక కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4,000 కోట్లుగా ఉంటే, మరొక కంపెనీ మార్కెట్ విలువ కేవలం కోటి రూపాయలే. ఈ కంపెనీలన్నింటి టర్నోవర్ 2021 మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో రూ.26,000 కోట్లు. లాభం రూ.280 కోట్లుగానే ఉంది. ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరంలో ఒక వారంలో నమోదు చేసిన లాభంతో ఇది సమానం. కరోనా సంవత్సరంలో ఈ కంపెనీల రుణ భారం రూ.6,000 కోట్ల నుంచి రూ.6,500 కోట్లకు పెరిగింది. ప్రతీ నాలుగు కంపెనీల్లో ఒకటి నష్టాలను నమోదు చేసింది. ఇంత చిన్నవి కావడం, ఆర్థిక బలం తక్కువగా ఉండడం వల్ల సంక్షోభాల ప్రభావం వీటిపై ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. వాటిని ఎదుర్కొనే శక్తి కొన్నింటికే ఉంటుంది. ... ఇక లాభాలను పరిశీలిస్తే.. సగటు లాభాల మార్జిన్ ఎస్ఎంఈలకు ఒక శాతంగానే ఉంది. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇది సగటున 10 శాతం, మిడ్‌క్యాప్ కంపెనీలకు 5 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీలకు 3.4 శాతం చొప్పున ఉంది. వ్యాపార విస్తరణ అవకాశాలు, సరైన వ్యాపార నమూనాలు వీటికి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని అర్థం చేసుకోవచ్చు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్‌వోసీఈ) ఎస్ఎంఈ స్టాక్స్‌కు 8.5 శాతంగా ఉంటే, రిటర్న్ ఆన్ నెట్‌వర్త్ (ఆర్వోఎన్డబ్ల్యూ) 6.5 శాతం చొప్పున ఉంది. లార్జ్‌క్యాప్ కంపెనీలకు 12–16 శాతం మధ్య, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీలకు 11–16 శాతం మధ్య ఈ రేషియోలు ఉన్నాయి. పైగా చాలా వరకు ఎస్ఎంఈ కంపెనీలు టెక్నాలజీ, వినూత్న వ్యాపారాల్లోనివి కావు. ఇప్పటికే వేలాది కంపెనీలు పనిచేస్తున్న సంప్రదాయ వ్యాపారంలోనివే ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో ఈ కంపెనీల వ్యాపారానికి పోటీ తీవ్రంగా ఉంటుంది. తమ కంటే పెద్ద కంపెనీలతో పోటీపడేంత సామర్థ్యం తక్కువ వాటికే ఉంటుంది. రాళ్లలో రత్నాన్ని గుర్తించినప్పుడే ఇన్వెస్టర్లకు భారీ లాభాలు రాలతాయి. ఇందుకోసం లోతైన అధ్యయనం కావాల్సిందే. ఇబ్బందులు రాకుండా ఉండాలంటే... చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎస్ఎంఈ)ల కోసం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ల గురించి వినే ఉంటారు. ఈ విభాగంలో ఐపీవోల గురించి తెలిసింది తక్కువే. ఇటీవలి కాలంలో ఈ విభాగంలోనూ చాలా కంపెనీలు ఐపీవోల ద్వారా లిస్ట్ అవుతున్నాయి. కొన్ని కంపెనీలు స్వల్పకాలంలోనే కాసులు కురిపిస్తుండడంతో ఇప్పుడిప్పుడే ఇన్వెస్టర్లు ఇటువైపు చూస్తున్నారు. కొన్ని భారీ రాబడులను తెచ్చిపెడుతున్నది నిజమే. కానీ, నష్టాలు ఇచ్చేవీ ఉంటాయి. రాబడుల కోసం రిస్క్ తీసుకునే ముందు.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సినవి, పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. తగిన రక్షణ చర్యలతో ప్రయాణం ఆరంభిస్తే.. మధ్యలో ప్రతికూలతలు ఎదురైనా ధైర్యంగా ఎదురొడ్డగలరు. అనుకున్నట్టుగానే లక్ష్యాన్ని చేరుకోగలరు. అధ్యయనం చేస్తే లాభాలే.. అన్నింటినీ పరిశీలించి సరైన కంపెనీని ఎంపిక చేసుకుంటే లాభాలు ఖాయమనడానికి ఉదాహరణగా బీఈడబ్ల్యూ ఇంజనీరింగ్, ప్రివెస్ట్ డెన్‌ప్రో, ఓమ్ని పొటెంట్, ఫోకస్ బిజినెస్ సొల్యూషన్స్ లిస్టింగ్ నాడే 50–125 శాతం మధ్య లాభాలను ఇచ్చాయి. 2021లో 45 ఎస్ఎంఈ ఐపీవో లు రాగా ఇందులో లిస్టింగ్ రోజు 17 కంపెనీలు లాభాలను ఇవ్వలేకపోయాయి. కానీ, ఈకేఐ ఎనర్జీ, రంగోలి ట్రేడ్‌కామ్, నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్, బీఈడబ్ల్యూ ఇంజనీరింగ్, ప్రోమ్యా క్స్ పవర్ అండ్ ప్లాటినమోన్ బిజినెస్ 100 శాతం నుంచి 5,000 శాతానికి పైనే రాబడులను ఇచ్చాయి. 48 ఐపీవోల్లో 24 కంపెనీలు ఇప్పటికీ ఇష్యూ ధరకు దిగువనే ట్రేడ్ అవుతున్నాయి. విలువ, లభ్యత బుల్ మార్కెట్లలో రాబడులు ఆకర్షణీయంగానే ఉంటాయి. ఆ సమయంలో కంపెనీల స్టాక్ వ్యాల్యూషన్లు గరిష్టాలకు చేరడం సహజం. ఎస్ఎంఈ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే వారు బుల్ ర్యాలీల్లో చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో ఇతర కంపెనీలకు సంబంధించి ఒక్క షేరును అయినా కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, ఎస్ఎంఈ స్టాక్స్‌లో ఇది సాధ్యం కాదు. ఉదాహరణకు ఈకేఐ ఎనర్జీ స్టాక్‌నే తీసుకోండి. నెల క్రితం వరకు 1200 లాట్ సైజుగా ఉండేది. అప్పుడు ఒక్కో షేరు ధర రూ.3,000కుపైమాటే. అంటే రూ.36 లక్షలు పెడితేనే ఒక లాట్‌ను కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ఆ తర్వాత లాట్‌సైజ్ 50కు తగ్గింది. ప్రస్తుతం ధర రూ.5,800గా ఉండడంతో 50 షేర్లను కొనుగోలు చేయాలంటే పెట్టుబడిగా సుమారు రూ.3లక్షలు కావాల్సిందే. సాధారణ కంపెనీ ఐపీవోలో పాల్గొనేందుకు ఒక్క లాట్ కోసం రూ.15వేల పెట్టుబడి చాలు. కానీ, ఎస్ఎంఈ ఐపీవోలో పాల్గొనాలంటే సుమారు రూ.1.20 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. పీఈ రేషియో ఆధారంగా ఎస్ఎంఈ స్టాక్స్ ఎంపిక కాకుండా, ఇతర వ్యాల్యూషన్ అంశాలను కూడా చూడాల్సి ఉంటుంది. ఎంటర్ప్రైజ్ వ్యాల్యూ(ఈవీ) టు ఎబిట్డా, ప్రైస్ టు బుక్ వ్యాల్యూ, అమ్మకాలతో పోలిస్తే కంపెనీ మార్కెట్ క్యాప్ ఏ మేరకు ఉంది.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటి ఆధారంగా దిగ్గజ కంపెనీలతో పోలిస్తే ఈ చిన్న కంపెనీలు చౌకగా ఉన్నాయా లేక ఖరీదుగా ట్రేడవుతున్నాయా అన్న అవగాహనకు రావచ్చు. ఎస్ఎంఈ విభాగంలోని క్వాలిటీ ఫార్మా ఏకంగా 55 పీఈలో ట్రేడవుతోంది. అంటే ఫార్మాలో దిగ్గజాలైన దివిస్, గ్లాండ్ ఫార్మా, జీఎస్కే ఫార్మా, అబ్బాట్ ఇండియా, నాట్కో కంపెనీల పీఈ వ్యాల్యూషన్లలో ఈ కంపెనీ ఉంది. ఎస్ఎంఈ విభాగంలోని బ్రోకరేజీ స్టాక్ ఈస్ట్ ఇండియా సెక్యూరిటీస్ అయితే 7 పీఈలోనే చౌకగా అందుబాటులో ఉంది. బ్రోకరేజీలో దిగ్గజాలదే ఎప్పుడూ మార్కెట్ ఆధిపత్యం ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీలకు పోర్ట్‌ఫోలియోలో ప్రాధాన్యం ఇస్తారు. ఆటుపోట్లు అధికం పెద్ద కంపెనీలు అయితే మార్కెట్ల పతనాల్లో నష్టాల పరంగా రిస్క్ తక్కువగా ఉంటుంది. కానీ, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీలు ఎక్కువగా అస్థిరతలకు లోనవుతుంటాయి. ఎస్ఎంఈ విభాగంలో అయితే ఆటుపోట్లు మరింత అధికం. 2020 మార్చి సమయంలో ఈ విభాగంలోని ప్రతీ మూడు కంపెనీల్లో రెండు 25 శాతానికి పైనే నష్టపోయాయి. ఎస్ఎంఈ స్టాక్స్‌లో లిక్విడిటీ (వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. దీంతో ప్రతికూల సమయాల్లో, మార్కెట్ అస్థిరతల్లో విక్రయించుకోవడం కష్టంగా మారొచ్చు. ముఖ్యంగా డౌన్సర్క్యూట్లోకి వెళితే మరింత నష్టాలకు విక్రయించుకోవాల్సి రావచ్చు. చిన్న కంపెనీలు కావడంతో అందుబాటులో (ప్రీ ఫ్లోట్) షేర్లు కూడా పరిమితంగానే ఉంటుంటాయి. దీంతో ఒక సర్కిల్ ఆపరేటర్ల ఆధిపత్యంలోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల వల్ల కొంత కొనుగోలు మద్దతు రాగానే ధరలు అప్పర్ సర్క్యూట్‌కు వెళ్లడం.. కొంచెం విక్రయాల ఒత్తిడికే డౌన్ సర్క్యూట్‌ను చూడడం కనిపిస్తుంది. ఇది వ్యయాలను పెంచుతుంది. పైగా అన్ని స్టాక్స్ రోజువారీగా ట్రేడ్ అవుతాయని అనుకోవద్దు. బీఎస్ఈ ఎస్ఎంఈ విభాగంలో 201 స్టాక్స్‌కు గాను 90 స్టాక్స్‌లోనే రోజువారీగా ట్రేడింగ్ నమోదవుతుంటుంది. బీఎస్ఈలో ఎస్ఎంఈ షేర్లు ‘ఎం’ గ్రూపు కింద ట్రేడవుతుంటాయి. ఎస్ఎంఈలోని 21 కంపెనీలు గత 12 నెలల్లో రెట్టింపునకు పైగా పెరిగాయంటే.. సత్తానా లేక డిమాం డ్ వల్లనా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. కవరేజీ తక్కువ ఎస్ఎంఈ కంపెనీలకు బ్రోకరేజీ సంస్థలు, విశ్లేషకుల కవరేజీ అన్నది ఏదో ఒకటి రెండు కంపెనీలు మినహా దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. దీంతో ఆయా కంపెనీలు, వాటి వ్యాపార వ్యూహా లు, భవిష్యత్తు వృద్ధి ప్రణాళికలు, పోటీతత్వం, యాజమాన్యం సామర్థ్యం గురించి తెలుసుకునే అవకాశాలు ఉండవు. ఇదే పెద్ద ప్రతికూలత. అయితే, బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లు కొన్ని ఎస్ఎంఈ స్టాక్స్‌కు సంబం ధించి పరిశోధన నివేదికలను అందుబాటు లో ఉంచుతున్నాయి. కనుక ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ముందు ఈ నివేదికలను చదివి కంపెనీల గురించి తెలుసుకోవాలి. కంపెనీల సామర్థ్యాలు తెలియనప్పుడు కేవలం డిమాండే ఆయా స్టాక్స్ ధరలను నిర్ణయిస్తుంటుంది. కనుక కవరేజీ ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకోవడం కాస్తంత సురక్షితం. దీనివల్ల ఆయా కంపెనీల గురించి ఎక్కువ మందికి సమాచారం వెళుతుంది. పెట్టుబడులూ వస్తాయి. చిన్న కంపెనీలకు మద్దతుగా.. పెద్ద కంపెనీలకు నిధుల సమీకరణ పెద్ద కష్టమైన పని కాదు. కానీ, అతి చిన్నవైన కంపెనీలకు నిధులను రాబట్టుకోవడం ఎంతో కష్టం. వీటికి మద్దతుగా నిలిచేందుకే బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేశాయి. మెయిన్ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే ఎస్ఎంఈ విభాగంలోని కంపెనీలకు నిబంధనల పరంగా కొంత వెసులుబాటూ ఉంది. ఇతర కంపెనీలకు మాదిరిగా ఎస్ఎంఈల ఐపీవోలకు సెబీ అను మతి అక్కర్లేదు. ఎక్సే్ఛంజ్లే అబ్జర్వేషన్ లెటర్‌ను మంజూరు చేస్తాయి. మెయిన్ ప్లాట్‌ఫామ్‌ల్లోని కంపెనీలు ప్రతీ మూడు నెలలకోసారి ఖాతాలను ఆడిటింగ్ చేయించుకోవాలి. ఎస్ఎంఈలకు ఇది ఆరు నెలలుగా అమలవుతుంది. సత్తా ఉన్న కంపెనీలు చిన్నవైనా సరే నిధుల సమీకరణతో మరింత ఎదిగేందుకు అనుకూలమైన వేదికలుగా ఇవి ఉపయోగపడతాయి. కనుక ఈ వేదికలు పెట్టుబడులకే కానీ, ట్రేడింగ్‌కు అనుకూలంగా ఉండదు. -
చిన్న సంస్థలకు ఆక్సిజన్ కష్టాలు
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని రంగాల్లోని చిన్న సంస్థలకు ప్రాణవాయువైన ఆక్సిజన్ అందకుండా పోయే పరిస్థితి నెలకొంది. దీన్ని వైద్య అవసరాల కోసం కేటాయించాల్సి వస్తుండటమే ఇందుకు కారణం. దీనివల్ల చిన్న కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్–19 కేసులు పెరిగిపోతుండటంతో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ గణనీయంగా ఎగిసిన మహారాష్ట్ర, న్యూఢిల్లీ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోని కంపెనీలపై ఇది ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. అయితే, ఇది ప్రస్తుతానికైతే తాత్కాలిక ధోరణిగానే కనిపిస్తోందని, ఆయా సంస్థల రుణ నాణ్యతపై ప్రభావం ఉండకపోవచ్చని క్రిసిల్ పేర్కొంది. కరోనా వైరస్ పూర్వస్థాయితో పోలిస్తే ఏప్రిల్ రెండో వారంలో (కేసులు భారీగా పెరగడం మొదలైనప్పట్నుంచీ) మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ అయిదు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. మెటల్ ఫ్యాబ్రికేషన్ రంగాలకు ప్రతికూలం ‘పారిశ్రామిక వినియోగానికి ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే మెటల్ ఫ్యాబ్రికేషన్, ఆటోమోటివ్ విడిభాగాలు, షిప్ బ్రేకింగ్, పేపర్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లోని చిన్న, మధ్య స్థాయి కంపెనీల ఆదాయాలపై తాత్కాలికంగా ప్రభావం పడే అవకాశం ఉంది‘ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి తెలిపారు. సాధారణంగా ఈ రంగాల సంస్థలకు సొంత ఆక్సిజన్ ప్లాంట్లు ఉండవని పేర్కొన్నారు. వెల్డింగ్, కటింగ్ వంటి పనులకు అవసరమైన గ్యాస్‌ల కోసం సరఫరా వ్యాపారస్తులపైనే ఆధారపడాల్సి ఉంటోందని వివరించారు. అలాగని సొంతంగా ప్లాంటు ఏర్పాటు చేసుకోవడమన్నా, ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవడమన్నా లాభసాటి వ్యవహారం కాదని, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని గౌతమ్ తెలిపారు. ప్రస్తుతానికైతే పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఎదురవ్వొచ్చని క్రిసిల్ అసోసియేట్ డైరెక్టర్ సుశాంత్ సరోదే తెలిపారు. ప్రభావిత సంస్థలు తమ దగ్గర నిల్వ ఉంచుకున్న ఆక్సిజన్‌తో ప్రస్తుతం గట్టెక్కవచ్చని పేర్కొన్నారు. అయితే, కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి సుదీర్ఘ కాలం పాటు కొనసాగితే, ఆక్సిజన్ సరఫరాకి ఆటంకాలు మరింత దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో మాత్రం కాస్త రిస్కులు తప్పకపోవచ్చన్నారు. రెండు రకాలుగా వినియోగం .. సాధారణంగా ఆన్సైట్ వినియోగానికి, మర్చంట్ సేల్స్ కింద వ్యాపార అవసరాల కోసం విక్రయించడానికి దేశీయంగా ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. తమ అవసరాల కోసం పరిశ్రమలు సొంతంగా ఏర్పాటు చేసుకునే ప్లాంట్లను ఆన్–సైట్‌గా వ్యవహరిస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌లో సింహభాగం (75–80%) వాటా దీనిదే ఉంటోంది. ఇక, మిగతా 20–25 శాతం వాటా వ్యాపార అవసరాల కోసం విక్రయించే మర్చంట్ సేల్స్ విభాగానిది ఉంటోంది. ద్రవ రూపంలో క్రయోజనిక్ ట్యాంకులు, సిలిండర్ల ద్వారా ఈ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. మర్చంట్ సేల్స్ విభాగం కింద వచ్చే ఆక్సిజన్‌లో హెల్త్‌కేర్ రంగం వినియోగించేది కేవలం 10 శాతం మాత్రమే ఉంటోంది. -
చిన్న సంస్థల ఐపీవోలపై మరింత నిఘా
న్యూఢిల్లీ: ఐపీవోల ద్వారా సమీకరించే నిధులను చిన్న సంస్థలు దుర్వినియోగం చేయకుండా మార్కెట్ల పర్యవేక్షణ, నియంత్రణ సంస్థ సెబీ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. రూ.500 కోట్లకు మించి నిధులను సమీకరించే ఐపీవోల పర్యవేక్షణ కోసం ఓ ఏజెన్సీని నియమించాలనే నిబంధన ఇప్పటి వరకు అమల్లో ఉండేది. ఇకపై రూ.100 కోట్ల నిధుల్ని సమీకరించే ఐపీవోలు కూడా ఈ నిబంధనను అమలు చేయాల్సి ఉంటుంది. పర్యవేక్షణకు ఏజెన్సీ అనేది బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ అయినా కావచ్చు. కొన్ని సంస్థలు ఐపీవో పత్రాల్లో పేర్కొన్న అవసరాలకు కాకుండా ఇతర కార్యక్రమాలకు నిధులు మళ్లిస్తున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సెబీ ఈ మార్పులు చేసింది. మరోవైపు ఐపీవోల్లో అర్హతగల సంస్థాగత మదుపరుల (క్యూఐబీ) విభాగంలో పాల్గొనేందుకు ఎన్బీఎఫ్సీ సంస్థలకు సెబీ అర్హత కల్పించింది. దీంతో బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల మాదిరిగా క్యూఐబీ పోర్షన్లో ఎన్బీఎఫ్సీ సంస్థలు బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. రూ.500 కోట్ల నెట్‌వర్త్ కలిగి, ఆర్బీఐ వద్ద నమోదైన సంస్థలకు ఈ అవకాశం ఉంటుంది. -
చిన్న సంస్థలకు ప్రపంచ బ్యాంకు రుణం
న్యూఢిల్లీ: దేశీ తయారీ, సేవల రంగంలోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) 500 మిలియన్ డాలర్ల రుణం అందించే ప్రతిపాదనకు ప్రపంచ బ్యాంకు ఆమోదముద్ర వేసింది. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు(సిడ్బి), ఇతరత్రా ఆర్థిక సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టు కింద ఎస్ఎంఈలకు వివిధ దశల్లో కావాల్సిన నిధులు లభిస్తాయి. ఎస్ఎంఈలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించగలవని, అయితే ఇందుకోసం వాటికి నిధులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని వరల్డ్ బ్యాంక్ కంట్రీ డెరైక్టర్ (భారత్) ఓనో రుహల్ తెలిపారు. అలాంటి అడ్డంకులు అధిగమించి పూర్తి సామర్ధ్యంతో చిన్న సంస్థలు పనిచేసేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడగలదన్నారు. దేశీ పరిశ్రమల్లో 80 శాతం పైగా చిన్న తరహా సంస్థలే ఉన్నాయి. ఇవి 8 వేల పైచిలుకు వివిధ ఉత్పత్తులు తయారు చేస్తూ సుమారు 6 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పరోక్షంగా, ప్రత్యక్షంగా మొత్తం తయారీ రంగ ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతుల్లో దాదాపు 40 శాతం వాటా ఎస్ఎంఈలదే ఉంటోంది. కానీ, అవసరానికి నిధులు అందుబాటులో లేకపోతుండటం ఎస్ఎంఈలకు ప్రధాన సమస్యగా ఉంటున్న నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ తాజా రుణం ప్రాధాన్యం సంతరించుకుంది.