చిన్న సంస్థల ఐపీవోలపై మరింత నిఘా
న్యూఢిల్లీ: ఐపీవోల ద్వారా సమీకరించే నిధులను చిన్న సంస్థలు దుర్వినియోగం చేయకుండా మార్కెట్ల పర్యవేక్షణ, నియంత్రణ సంస్థ సెబీ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. రూ.500 కోట్లకు మించి నిధులను సమీకరించే ఐపీవోల పర్యవేక్షణ కోసం ఓ ఏజెన్సీని నియమించాలనే నిబంధన ఇప్పటి వరకు అమల్లో ఉండేది. ఇకపై రూ.100 కోట్ల నిధుల్ని సమీకరించే ఐపీవోలు కూడా ఈ నిబంధనను అమలు చేయాల్సి ఉంటుంది. పర్యవేక్షణకు ఏజెన్సీ అనేది బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ అయినా కావచ్చు.
కొన్ని సంస్థలు ఐపీవో పత్రాల్లో పేర్కొన్న అవసరాలకు కాకుండా ఇతర కార్యక్రమాలకు నిధులు మళ్లిస్తున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సెబీ ఈ మార్పులు చేసింది. మరోవైపు ఐపీవోల్లో అర్హతగల సంస్థాగత మదుపరుల (క్యూఐబీ) విభాగంలో పాల్గొనేందుకు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు సెబీ అర్హత కల్పించింది. దీంతో బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల మాదిరిగా క్యూఐబీ పోర్షన్‌లో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. రూ.500 కోట్ల నెట్‌వర్త్ కలిగి, ఆర్‌బీఐ వద్ద నమోదైన సంస్థలకు ఈ అవకాశం ఉంటుంది.