కొత్త క్యాలండర్ ఏడాదిలోనూ ప్రైమరీ మార్కెట్ల దూకుడు కొనసాగనుంది. తాజాగా ఆరు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI) పచ్చ జెండా ఊపింది. జాబితాలో ఐటీ సర్వీసుల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్‌తోపాటు.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు విక్రన్ ఇంజినీరింగ్, అజాక్స్ ఇంజినీరింగ్, పీఎంఈఏ సోలార్ టెక్ సొల్యూషన్స్, ఆల్ టైమ్ ప్లాస్టిక్స్, స్కోడా ట్యూబ్స్ చేరాయి. ఈ ఆరు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ కోసం 2024 సెప్టెంబర్-డిసెంబర్ మధ్య ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. తద్వారా ఉమ్మడిగా రూ.10,000 కోట్లు సమీకరించనున్నాయి. వివరాలు చూద్దాం..
కార్లయిల్ మద్దతుతో..
డిజిటల్, ఐటీ సొల్యూషన్ల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ ఐపీవో(IPO)లో భాగంగా రూ. 9,950 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్ సంస్థ సీఏ మ్యాగ్నమ్ హోల్డింగ్స్ వీటిని ఆఫర్ చేయనుంది. హెక్సావేర్‌లో పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ సంస్థ సీఏకు ప్రస్తుతం 95.03 శాతం వాటా ఉంది. కంపెనీ ఫైనాన్షియల్, హెల్త్‌కేర్, తయారీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ తదితర రంగాలకు ఐటీ సర్వీసులు సమకూర్చుతోంది. గత ప్రమోటర్ బేరింగ్ పీఈ ఏషియా 2020లో హెక్సావేర్‌ను స్టాక్ ఎక్స్చేంజీల నుంచి డీలిస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఏడాది కాలంలో బేరింగ్ వాటాను కార్లయిల్ గ్రూప్ కొనుగోలు చేసింది. గతేడాది(2023–24) హెక్సావేర్ రూ.10,380 కోట్ల ఆదాయం, రూ.997 కోట్ల నికర లాభం ఆర్జించింది.
స్టెయిన్‌లెస్ స్టీల్
గుజరాత్ కంపెనీ స్కోడా ట్యూబ్స్ ఐపీవోలో భాగంగా రూ.275 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. సంస్థ ప్రధానంగా ఆయిల్, గ్యాస్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, విద్యుత్ తదితర రంగాలలో కార్యకలాపాలు నిర్వహించే ఈపీసీ, ఇండ్రస్టియల్ కంపెనీలకు స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యూబ్స్, పైపులను తయారు చేసి అందిస్తోంది.
ఈపీసీ కంపెనీ
మౌలిక రంగ ఈపీసీ సంస్థ విక్రన్ ఇంజినీరింగ్ ఐపీవోలో భాగంగా రూ.900 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీలో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కొచాలియాకు సైతం పెట్టుబడులున్నాయి. టర్న్‌కీ పద్ధతిలో డిజైన్, సప్లై, ఇన్‌స్టలేషన్, టెస్టింగ్, కమిషనింగ్ తదితర ఎండ్ టు ఎండ్ ఈపీసీ సర్వీసులదిస్తోంది.
సోలార్ టెక్
ఐపీవోలో భాగంగా పీఎంఈఏ సోలార్ టెక్ సొల్యూషన్స్ రూ.600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.12 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. 2006లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా సోలార్ ట్రాకింగ్ మౌంటింగ్ సిస్టమ్స్, ఎక్విప్‌మెంట్ తయారీలో ఉంది. మాడ్యూల్ మౌంటింగ్ అసెంబ్లీలో 16 గిగావాట్ల వార్షిక స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది.
కన్జూమర్ ప్రొడక్ట్స్
కస్టమర్ల కోసం కన్జూమర్‌వేర్ ప్రొడక్టులు తయారు చేసే ఆల్ టైమ్ ప్లాస్టిక్స్ ఐపీవోలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 52.5 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వైట్‌లేబుల్ కన్జూమర్‌వేర్ ప్రొడక్టుల తయారీ కంపెనీ క్లయింట్ల సొంత బ్రాండ్లను రూపొందించి అందిస్తోంది. కస్టమర్ల జాబితాలో గ్లోబల్ దిగ్గజాలు ఐకియా, ఏఎస్‌డీఏ స్టోర్స్, టెస్కో పీఎల్‌సీ, మైఖేల్స్ స్టోర్స్‌తోపాటు దేశీయంగా స్పెన్సర్స్ రిటైల్ తదితరాలున్నాయి.
ఇదీ చదవండి: అత్యంత విలువైన ఐటీ బ్రాండ్‌లు
కాంక్రీట్ ఎక్విప్‌మెంట్
పీఈ దిగ్గజం కేదారా క్యాపిటల్‌కు పెట్టుబడులున్న అజాక్స్ ఇంజినీరింగ్ కాంక్రీట్ ఎక్విప్‌మెంట్ తయారీలో కార్యకలాపాలు విస్తరించింది. ఐపీవోలో భాగంగా 2.28 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కేదారా క్యాపిటల్ 74.37 లక్షల షేర్లను ఆఫర్ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment