ముంబై: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని రంగాల్లోని చిన్న సంస్థలకు ప్రాణవాయువైన ఆక్సిజన్ అందకుండా పోయే పరిస్థితి నెలకొంది. దీన్ని వైద్య అవసరాల కోసం కేటాయించాల్సి వస్తుండటమే ఇందుకు కారణం. దీనివల్ల చిన్న కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్–19 కేసులు పెరిగిపోతుండటంతో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ గణనీయంగా ఎగిసిన మహారాష్ట్ర, న్యూఢిల్లీ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోని కంపెనీలపై ఇది ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. అయితే, ఇది ప్రస్తుతానికైతే తాత్కాలిక ధోరణిగానే కనిపిస్తోందని, ఆయా సంస్థల రుణ నాణ్యతపై ప్రభావం ఉండకపోవచ్చని క్రిసిల్ పేర్కొంది. కరోనా వైరస్ పూర్వస్థాయితో పోలిస్తే ఏప్రిల్ రెండో వారంలో (కేసులు భారీగా పెరగడం మొదలైనప్పట్నుంచీ) మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ అయిదు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది.
మెటల్ ఫ్యాబ్రికేషన్ రంగాలకు ప్రతికూలం
‘పారిశ్రామిక వినియోగానికి ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే మెటల్ ఫ్యాబ్రికేషన్, ఆటోమోటివ్ విడిభాగాలు, షిప్ బ్రేకింగ్, పేపర్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లోని చిన్న, మధ్య స్థాయి కంపెనీల ఆదాయాలపై తాత్కాలికంగా ప్రభావం పడే అవకాశం ఉంది‘ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి తెలిపారు. సాధారణంగా ఈ రంగాల సంస్థలకు సొంత ఆక్సిజన్ ప్లాంట్లు ఉండవని పేర్కొన్నారు. వెల్డింగ్, కటింగ్ వంటి పనులకు అవసరమైన గ్యాస్‌ల కోసం సరఫరా వ్యాపారస్తులపైనే ఆధారపడాల్సి ఉంటోందని వివరించారు.
అలాగని సొంతంగా ప్లాంటు ఏర్పాటు చేసుకోవడమన్నా, ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవడమన్నా లాభసాటి వ్యవహారం కాదని, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని గౌతమ్ తెలిపారు. ప్రస్తుతానికైతే పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఎదురవ్వొచ్చని క్రిసిల్ అసోసియేట్ డైరెక్టర్ సుశాంత్ సరోదే తెలిపారు. ప్రభావిత సంస్థలు తమ దగ్గర నిల్వ ఉంచుకున్న ఆక్సిజన్‌తో ప్రస్తుతం గట్టెక్కవచ్చని పేర్కొన్నారు. అయితే, కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి సుదీర్ఘ కాలం పాటు కొనసాగితే, ఆక్సిజన్ సరఫరాకి ఆటంకాలు మరింత దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో మాత్రం కాస్త రిస్కులు తప్పకపోవచ్చన్నారు.
రెండు రకాలుగా వినియోగం ..
సాధారణంగా ఆన్‌సైట్ వినియోగానికి, మర్చంట్ సేల్స్ కింద వ్యాపార అవసరాల కోసం విక్రయించడానికి దేశీయంగా ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. తమ అవసరాల కోసం పరిశ్రమలు సొంతంగా ఏర్పాటు చేసుకునే ప్లాంట్లను ఆన్–సైట్‌గా వ్యవహరిస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌లో సింహభాగం (75–80%) వాటా దీనిదే ఉంటోంది. ఇక, మిగతా 20–25 శాతం వాటా వ్యాపార అవసరాల కోసం విక్రయించే మర్చంట్ సేల్స్ విభాగానిది ఉంటోంది. ద్రవ రూపంలో క్రయోజనిక్ ట్యాంకులు, సిలిండర్ల ద్వారా ఈ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. మర్చంట్ సేల్స్ విభాగం కింద వచ్చే ఆక్సిజన్‌లో హెల్త్‌కేర్ రంగం వినియోగించేది కేవలం 10 శాతం మాత్రమే ఉంటోంది.
చిన్న సంస్థలకు ఆక్సిజన్ కష్టాలు
Published Thu, Apr 22 2021 3:55 AM | Last Updated on Thu, Apr 22 2021 4:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment