న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీల సెక్యూరిటీల విషయంలో పారదర్శకతను పెంచే దిశగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఐ) కీలక ఆదేశాలిచ్చింది. 2024 సెప్టెంబర్ నుంచి ప్రైవేట్ కంపెనీలన్నీ డీమ్యాట్ (డిజిటల్) రూపంలోనే సెక్యూరిటీలను జారీ చేయాలని ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.
చిన్న సంస్థలు, ప్రభుత్వ రంగ కంపెనీలకు దీన్నుంచి మినహాయింపునిచ్చింది. కొన్ని సంస్థలు భౌతిక ఫార్మాట్‌లో జారీ చేసే షేర్లకు సంబంధించి అవకతవకలు చోటుచేసుకునే అవకాశాలను కట్టడి చేసేందుకు ఈ ఆదేశాలు ఉపయోగపడనున్నాయి. కంపెనీల చట్టం కింద ప్రస్తుతం రిజిస్టరయిన 14 లక్షల పైచిలుకు ప్రైవేట్ సంస్థలపై దీని ప్రభావం పడవచ్చని న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్‌నర్ ఆనంద్ జయచంద్రన్ తెలిపారు.
సాధారణంగా షేర్ల జారీకి సంబంధించి కంపెనీల చట్టం 2013 కింద ప్రైవేట్ కంపెనీలకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిలో షేర్‌హోల్డర్ల సంఖ్య 200కు మించి ఉండకూడదు. నోటిఫికేషన్ ప్రకారం 2024 సెప్టెంబర్ తర్వాత నుంచి ప్రైవేట్ సంస్థలు షేర్ల జారీ, బైబ్యాక్, బోనస్ ఇష్యూ లేదా రైట్స్ ఆఫర్ మొదలైనవన్నీ డీమ్యాట్ రూపంలోనే జరగాలి.
నాలుగు కోట్ల రూపాయల వరకు పెయిడప్ షేర్ క్యాపిటల్, రూ. 40 కోట్ల వరకు టర్నోవరు ఉన్న చిన్న సంస్థలకు, కొన్ని పరిమితులకు లోబడి, మినహాయింపు ఉంటుంది. మరోవైపు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్స్ (ఎల్‌ఎల్‌పీ)ల నిబంధనలను కూడా ఎంసీఏ సవరించింది. వీటి ప్రకారం .. ఏర్పాటైన తేదీ నుంచి ప్రతి ఎల్‌ఎల్‌పీ తమ భాగస్వాముల చిరునామా, పాన్ నంబరు మొదలైన వివరాలతో ఒక రిజిస్టర్‌ను నిర్వహించాలి.
Comments
Please login to add a commentAdd a comment