కుప్పకూలిన ఈక్విటీ మార్కెట్
73 వేల దిగువకు సెన్సెక్స్
22 వేల కిందికి నిఫ్టీ
సెన్సెక్స్ భారీ పతనంతో బీఎస్‌ఈలో రూ.13.47 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.372 లక్షల కోట్లకు దిగివచి్చంది. గత 3 రోజుల్లో రూ.20.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
ముంబై: చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల భారీ పతనంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. అమెరికా ద్రవ్యోల్బణం దిగిరాకపోవడంతో ‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు’ ఆశలు సన్నగిల్లాయి. ట్రేడింగ్‌లో వినిమయ, ఇంధన, మెటల్ షేర్ల భారీ పతనంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ 73,000, నిఫ్టీ 22,000 స్థాయిలను కోల్పోయాయి.
లాభాల నుంచి భారీ నష్టాల్లోకి
ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టానికి దిగివచి్చన సానుకూల సంకేతాలతో ఉదయం స్టాక్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 325 పాయింట్లు పెరిగి 73,993 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు బలపడి 22,432 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే చిన్న, మధ్య తరహా షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలు జరుగుతున్నాయన్న సెబీ చైర్మన్ మాధవీ పురి ఇటీవలి వ్యాఖ్యలు దీనికి నేపథ్యం. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,152 పాయింట్లు క్షీణించి 72,516 వద్ద, నిఫ్టీ 430 పాయింట్లు దిగివచ్చి 21,906 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 906 పాయింట్లు నష్టపోయి 72,762 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 338 పాయింట్లు పతనమై 21,997 వద్ద స్థిరపడ్డాయి.
► స్కాటిష్ చమురు కంపెనీ కెయిర్న్‌కు రూ.77.6 కోట్లు చెల్లించాలంటూ సెబీ ఆదేశాలు జారీ చేయడంతో వేదాంత లిమిటెడ్ షేరు 7% నష్టపోయి రూ.252 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ 8% నష్టపోయి రూ.250 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కంపెనీకి రూ.6,858 కోట్ల నష్టం వాటిల్లింది.
► మార్కెట్ పతనంలో భాగంగా అదానీ గ్రూప్ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మొత్తం పదింటికి గానూ ఏడు కంపెనీల షేర్లు నష్టపోయాయి
► జీజే కెమికల్స్ షేరు బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.221)తో పోలిస్తే 4.52% డిస్కౌంట్‌తో రూ.211 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 18% క్షీణించి రూ.181 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 16% నష్టపోయి రూ.185 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.724 కోట్లుగా నమోదైంది.
ఎఫ్‌అండ్‌వోపై దృష్టి ఆందోళనకరం
రిటైల్ ఇన్వెస్టర్లకు సీఈఏ హెచ్చరిక
అత్యధిక రిసు్కలతోకూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో లావాదేవీలు చేపట్టేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం ఆందోళనకరమని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా పేర్కొన్నారు. తక్షణ లాభాలపై దృష్టి పెట్టడం పెట్టుబడుల పురోగతికి ప్రతికూలమని సెబీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment