సవాళ్ల పరిష్కారానికి కృషి చేయాలి
డీపీఐఐటీ కార్యదర్శి భాటియా సూచన
న్యూఢిల్లీ: వ్యాపార సవాళ్లు, ఇతర సమస్యలను పరిష్కరించుకునేందుకు పెద్ద కార్పొరేట్ సంస్థలు, అంకుర సంస్థలతో కలిసి పని చేయాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా సూచించారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు వృద్ధిలోకి వచ్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు.
ఇందుకోసం ఇప్పటికే పలు పెద్ద కంపెనీలు ముందుకొచ్చాయని, అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయని చెప్పారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన పదో ఏట.. మరిన్ని అంకుర సంస్థలతో కలిసి పని చేసేలా కంపెనీలను ప్రోత్సహించే అవకాశం ఉందని భాటియా చెప్పారు. కొన్ని పనులను స్టార్టప్‌లకు ఔట్‌సోర్స్ చేయడం, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు వాటితో కలిసి పనిచేయడం, మెంటార్‌షిప్ ద్వారా సహాయపడటం, ల్యాబ్‌లు.. టెస్టింగ్ కేంద్రాలకు యాక్సెస్ ఇవ్వడం తదితర మార్గాల్లో ఇది ఉండొచ్చని పేర్కొన్నారు.
మరోవైపు, విదేశాల నుండి భారత్‌కి తమ ప్రధాన కార్యాలయాలను మార్చుకోవాలనుకునే స్టార్టప్‌ల కోసం సదరు ప్రక్రియను కార్పొరేట్ వ్యవహారాల శాఖ వేగవంతం చేసినట్లు భాటియా చెప్పారు. అంకుర సంస్థలకు ప్రోత్సాహమిచ్చేందుకు 2016 జనవరి 16న కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. దీని కింద, వివిధ దశల్లోని అంకుర సంస్థల కోసం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ అనే మూడు స్కీములను అమలు చేస్తోంది. 1.5 లక్షల స్టార్టప్‌లను డీపీఐఐటీ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment