ముంబై: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన తర్వాత దేశీయ ఈక్విటీ మార్కెట్ ఈ ఏడాది ఆరంభం నుంచి స్థిరీకరణ దిశగా సాగింది. ఈ క్రమంలో చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లు(స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ షేర్లు) భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బీఎస్‌ఈ స్మాల్ ఇండెక్సు 4 శాతం, స్మాల్ క్యాప్ సూచీ మూడు శాతం చొప్పున డీలా పడ్డాయి. ఇదే సమయంలో సెన్సెక్స్ రెండుశాతమే నష్టపోయింది. సాధారణంగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు చిన్న, మధ్య తరహా రంగాల షేర్లను, విదేశీ ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. గతేడాదిలో దేశీయ ఈక్విటీ మార్కెట్ 22 శాతం ర్యాలీ చేసింది.
ఇవీ కారణాలు
రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, రికార్డు స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణ ఆందోళనలతో ఈ ఏడాది ఆరంభం నుంచి దేశీయ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంది. భారత కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదుచేయలేకపోయాయి. తాజాగా ఫెడ్ రిజర్వ్ కఠిన ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలకు మొగ్గుచూపొచ్చనే సంకేతాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ పెద్ద ఎత్తున చిన్న, మధ్య తరహా షేర్లను అమ్మేశారు.
‘‘సాధారణంగా బేరిష్ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీల షేర్లను(లార్జ్ క్యాప్) రక్షణాత్మక షేర్లుగా భావిస్తూ అట్టిపెట్టుకుంటారు. సెన్సెక్స్, నిఫ్టీలు ఏదో ఒక స్థాయి వద్ద స్థిరపడి.., మళ్లీ సానుకూలత ఏర్పడే వరకు చిన్న, తరహా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతూనే ఉంటాయి. అయితే ధీర్ఘకాల దృష్ట్యా భారత ఈక్విటీ మార్కెట్‌లో బుల్ రన్ జరిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అప్పుడు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో తిరిగి ర్యాలీ ప్రారంభం అవుతుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ న్యాతి తెలిపారు.
► గతేడాది మే 4న బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 21,847 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఈ ఏడాది జనవరి 18న 31,304 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని నమోదుచేసింది. 2021లో 63 శాతం ర్యాలీ చేసింది.
► బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ గతేడాది అక్టోబర్ 19 తేదీన 27,246 స్థాయి వద్ద 52–వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఇదే సూచీ ఈ ఏడాదిలో మార్చి 4న 20,184 స్థాయి వద్ద ఏడాది కనిష్టానికి దిగివచ్చింది. 2021లో 39 శాతం ర్యాలీ చేసింది.
చిన్న షేర్లకు పెద్ద కష్టం
Published Wed, May 4 2022 5:50 AM | Last Updated on Wed, May 4 2022 5:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment