Companies shares
-
చిన్న షేర్లకు పెద్ద కష్టం
ముంబై: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన తర్వాత దేశీయ ఈక్విటీ మార్కెట్ ఈ ఏడాది ఆరంభం నుంచి స్థిరీకరణ దిశగా సాగింది. ఈ క్రమంలో చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లు(స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ షేర్లు) భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బీఎస్ఈ స్మాల్ ఇండెక్సు 4 శాతం, స్మాల్ క్యాప్ సూచీ మూడు శాతం చొప్పున డీలా పడ్డాయి. ఇదే సమయంలో సెన్సెక్స్ రెండుశాతమే నష్టపోయింది. సాధారణంగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు చిన్న, మధ్య తరహా రంగాల షేర్లను, విదేశీ ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. గతేడాదిలో దేశీయ ఈక్విటీ మార్కెట్ 22 శాతం ర్యాలీ చేసింది. ఇవీ కారణాలు రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, రికార్డు స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణ ఆందోళనలతో ఈ ఏడాది ఆరంభం నుంచి దేశీయ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంది. భారత కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదుచేయలేకపోయాయి. తాజాగా ఫెడ్ రిజర్వ్ కఠిన ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలకు మొగ్గుచూపొచ్చనే సంకేతాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ పెద్ద ఎత్తున చిన్న, మధ్య తరహా షేర్లను అమ్మేశారు. ‘‘సాధారణంగా బేరిష్ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీల షేర్లను(లార్జ్ క్యాప్) రక్షణాత్మక షేర్లుగా భావిస్తూ అట్టిపెట్టుకుంటారు. సెన్సెక్స్, నిఫ్టీలు ఏదో ఒక స్థాయి వద్ద స్థిరపడి.., మళ్లీ సానుకూలత ఏర్పడే వరకు చిన్న, తరహా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతూనే ఉంటాయి. అయితే ధీర్ఘకాల దృష్ట్యా భారత ఈక్విటీ మార్కెట్లో బుల్ రన్ జరిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అప్పుడు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో తిరిగి ర్యాలీ ప్రారంభం అవుతుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ న్యాతి తెలిపారు. ► గతేడాది మే 4న బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 21,847 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఈ ఏడాది జనవరి 18న 31,304 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని నమోదుచేసింది. 2021లో 63 శాతం ర్యాలీ చేసింది. ► బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ గతేడాది అక్టోబర్ 19 తేదీన 27,246 స్థాయి వద్ద 52–వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఇదే సూచీ ఈ ఏడాదిలో మార్చి 4న 20,184 స్థాయి వద్ద ఏడాది కనిష్టానికి దిగివచ్చింది. 2021లో 39 శాతం ర్యాలీ చేసింది. -
ఐపీవోల జాతర.. ప్రజల నుంచి 70 వేల కోట్లు సమీకరణ
ముంబై: తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం కంపెనీల్లో ఆత్రుత పెరుగుతోంది. ఒకదాని వెంట ఒకటి ఐపీవోకు దరఖాస్తులు దాఖలు చేస్తూనే ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల వద్ద స్థిరంగా కొనసాగుతుండడం కంపెనీలను ఐపీవో వైపు వేగంగా అడుగులు వేయిస్తున్నాయి. దాదాపు అన్ని ఐపీవోలు అధిక స్పందన అందుకుంటుండడంతో.. ఇంతకుమించిన అనుకూలత ఉండదన్న ధోరణి కంపెనీల్లో కనిపిస్తోంది. ఆగస్ట్‌లో మొదటి 20 రోజుల్లోనే ఐపీవోలకు అనుమతి కోరుతూ 23 దరఖాస్తులు సెబీ వద్ద దాఖలయ్యాయి. అంతేకాదు ఈనెల్లో ఇప్పటికే 18 కంపెనీలు ఇష్యూలను పూర్తి చేసుకుని రూ.18,200 కోట్లను ప్రజల నుంచి సమీకరించేశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 40 కంపెనీలు లిస్ట్ అయ్యాయి. ఇవి రూ.70,000 కోట్లను ప్రజల నుంచి సమీకరించాయి. ప్రతీ ఐపీవోలోనూ రిటైల్ ఇన్వెస్టర్లు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 100 రెట్లకు పైగా బిడ్లు అందుకున్న ఐపీవోలు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీవోల సంఖ్య సెంచరీ (100) దాటుతుందని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు.. ఈ నెలలో ఐపీవోకు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసిన వాటిల్లో ఢిల్లీలోకి చెందిన పీబీ ఇన్ఫోటెక్ (పాలసీబజార్) ముఖ్యమైనది. రూ.6,000 కోట్లను ఐపీవో ద్వారా సమీకరించే ప్రణాళికతో ఈ సంస్థ ఉంది. పుణెకు చెందిన ఎమ్క్యూర్ ఫార్మా సైతం రూ.5,000 కోట్ల ఇష్యూను చేపట్టాలనుకుంటోంది. ఈ సంస్థ కూడా దరఖాస్తు సమర్పించింది. అలాగే, ఇతర ప్రముఖ సంస్థల్లో ఎఫ్ఎంసీజీ కంపెనీ అదానీ విల్మార్ (రూ.4,500 కోట్లు), ఆన్లైన్ ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ నైకా (రూ.4,000 కోట్లు) కూడా ఉన్నాయి. ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే ఇక్సిగో మాతృసంస్థ లీట్రావెన్యూస్ టెక్నాలజీ సైతం రూ.1,800 కోట్ల సమీకరణకు ఐపీవో దరఖాస్తు దాఖలు చేసింది. ఎస్ఏఏఎస్ కంపెనీ రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ కూడా రూ.1,500 కోట్ల సమీకరణకు ఐపీవోకు రానుంది. ఈ జాబితాలో ఇంకా టార్సన్స్ ప్రొడక్ట్స్, వీఎల్సీసీ, సాఫైర్ ఫుడ్స్, గోఫ్యాషన్ ఇండియా, ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. ఇటీవలే ఐపీవో పూర్తి చేసుకున్న సిమెంట్ తయారీ కంపెనీ నువోకో విస్టా కార్పొరేషన్ వచ్చే సోమవారం లిస్ట్ కానుంది. ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందిన ఐపీవోల్లో జొమాటో, తత్వచింతన్ ఫార్మా, జీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ తదితర కంపెనీలుండడం గమనార్హం. -
బ్యాంకులకు ‘వీడియోకాన్’ లో 8 శాతం వాటాలు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కుదేలైన వీడియోకాన్ గ్రూప్‌లోని 11 అనుబంధ కంపెనీల విలీనంతో ఏర్పడే సంస్థలో ఆర్థిక రుణదాతలకు 8 శాతం వాటా లభించనుంది. వీడియోకాన్ కొనుగోలు కోసం ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళిక ప్రకారం.. లిస్టెడ్ కంపెనీలైన వీడియోకాన్ ఇండస్ట్రీస్ (వీఐఎల్), వేల్యూస్ ఇండస్ట్రీస్ (వీఏఐఎల్)ను డీలిస్ట్ చేస్తారు. ఆ తర్వాత వీఏఐఎల్ సహా గ్రూప్‌లోని 11 సంస్థలను వీడియోకాన్ ఇండస్ట్రీస్‌లో విలీనం చేస్తారు. అయితే, వీడియోకాన్ టెలికం మాత్రం అనుబంధ సంస్థగా కొనసాగుతుంది. వీఐఎల్ మొత్తం షేర్లలో 8 శాతాన్ని రుణదాతలకు నిర్దిష్ట నిష్పత్తి ప్రకారం కేటాయిస్తారు. వీఐఎల్, వీఏఐఎల్ డీలిస్టింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే, వీడియోకాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో డీలిస్టింగ్‌కు సంబంధించి ఈ రెండు సంస్థల షేర్హోల్డర్లకు దక్కేదేమీ లేదు. వీడియోకాన్ టేకోవర్‌కు మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కి చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సమర్పించిన రూ. 2,962 కోట్ల ప్రణాళికకు జూన్ 9న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. చదవండి: తల్లిదండ్రులారా జాగ్రత్త, మీ పిల్లల ఫోన్లపై కన్నేయండి -
అమెరికా ఎక్స్ఛేంజీల నుంచి డ్రాగన్ అవుట్ !
వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య వైరం రోజురోజుకు మరింతగా ముదురుతోంది. వాణిజ్య యుద్ధంగా మొదలైనది కాస్తా ఆ తర్వాత టెక్నాలజీ పోరుకు దారితీసింది. 5జీ టెలికం పరికరాల చైనా దిగ్గజం హువావేపై అమెరికా అనేక ఆంక్షలు విధించి దానితో తమ దేశ సంస్థలేవీ వ్యాపార లావాదేవీలు జరపకుండా దాదాపు అడ్డుకట్ట వేసేసింది. ఇక, కరోనా వైరస్ వివరాలను తొక్కిపెట్టి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిని వ్యాప్తి చేసిందంటూ చైనాపై మండిపడుతున్న అమెరికా ప్రస్తుతం మరో కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. తమ దేశ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయిన చైనా కంపెనీలను డీలిస్ట్ చేయడం ద్వారా బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు పెట్టుబడులుగా పొందుతున్న చైనీస్ సంస్థలను, పరోక్షంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. ‘నేను కొత్తగా మరో ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవడం లేదు. నేను..నాతో పాటు మిగతా అందరూ కూడా నిబంధనల ప్రకారం చైనా నడుచుకోవాలనే కోరుకుంటున్నారు‘ అని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టిన సెనేటర్లలో ఒకరైన జాన్ కెనెడీ వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో ఆలీబాబా, బైదు తదితర దిగ్గజ చైనా కంపెనీలకు డీలిస్టింగ్ గండం ఏర్పడింది. బిల్లు ఏం చెబుతోంది .. హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం అమెరికా సెక్యూరిటీస్ చట్టాలను పాటించడంలో విఫలమైనందుకు గాను నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్ చేయొచ్చు. గతేడాది మార్చిలోనే సెనేటర్లు జాన్ కెనెడీ, క్రిస్ వాన్ హోలెన్ దీన్ని సెనేట్‌లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం లిస్టెడ్ విదేశీ కంపెనీలు తమపై తమ దేశ ప్రభుత్వ నియంత్రణేమీ లేదంటూ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు అమెరికాలో పబ్లిక్ కంపెనీల ఖాతాలను సమీక్షించే బోర్డు పీసీఏవోబీ తమ ఖాతాలను కూడా తనిఖీ చేసేందుకు అంగీకరించాలి. వరుసగా మూడేళ్ల పాటు నిరాకరించిన పక్షంలో నిషేధం, డీలిస్టింగ్ తప్పదు. ఇది ప్రధానంగా విదేశీ కంపెనీలన్నింటికీ వర్తించేదే. అయితే, చైనా కంపెనీల ఆడిటింగ్ విషయంలోనే సహకారం దొరకడం లేదంటూ పీసీవోఏబీ చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలపైనే అమెరికా ఎక్కువ కఠినంగా చర్యలు అమలు చేయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సేల్స్ అకౌంటింగ్ మోసాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటు న్న చైనా సంస్థ ‘లకిన్ కాఫీ’ ను డీలిస్ట్ చేస్తున్నట్లు నాస్డాక్ ప్రకటించడం దీనికి మరింత ఊతమిస్తోంది. చైనా ముందస్తు వ్యూహాలు.. అమెరికా తమ కంపెనీలపై గురిపెట్టే ప్రమాదాన్ని ముందుగానే ఊహించినా చైనా కూడా తదుపరి వ్యూహాలతో సిద్ధంగా ఉంది. హాంకాంగ్‌లో నిరసనలను అణగదొక్కే విషయంలో తమకు మద్దతుగా నిల్చిన బ్రిటన్ వైపు చూస్తోంది. ఒకవేళ అమెరికన్ ఎక్సే్చంజీల నుంచి డీలిస్ట్ అయిపోతే ప్రత్యామ్నాయంగా లండన్ ఎక్సే్చంజీలో కంపెనీలను లిస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. లండన్‌లో లిస్ట్ కాదల్చుకున్న కంపెనీల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను పునఃప్రారంభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వదేశీ కంపెనీలకూ ట్రంప్ వార్నింగ్.. చైనాతో వాణిజ్య యుద్ధం మొదలైనప్పట్నుంచీ అమెరికన్ కంపెనీలను అక్కణ్నుంచి వచ్చేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో టెక్ దిగ్గజం యాపిల్ సహా పలు కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ తదితర దేశాలకు తయారీ కార్యకలాపాలు మళ్లించడంపై కసరత్తు చేస్తున్నాయి. అయితే, ఆయా కంపెనీలను అమెరికాకే రప్పించే ప్రయత్నాల్లో ట్రంప్ ఉన్నారు. చైనా నుంచి తయారీ కేంద్రాలను స్వదేశానికే తరలించాలని.. అలా కాకుండా భారత్, ఐర్లాండ్ వంటి ఇతర దేశాలకు వెడితే వాటిపై పన్నుల మోత మోగిస్తామని ఈమధ్యే మరోమారు హెచ్చరించారు. అంతే కాకుండా.. చైనా కంపెనీల్లో తమ సంస్థలు ఇన్వెస్ట్ చేయకుండా కూడా అమెరికా చర్యలు తీసుకుంటోంది. అమెరికాలో లిస్టయిన చైనా కంపెనీల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం శ్రేయస్కరం అంటూ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌రాక్‌కు నేషనల్ లీగల్ అండ్ పాలసీ సెంటర్ సూచించింది. పర్యావరణ కార్యకర్తల ఆందోళనల కారణంగా బ్లాక్‌రాక్ ఇప్పటికే కొన్ని బొగ్గు కంపెనీల నుంచి తప్పుకుంది. ప్రభుత్వ పెన్షన్ ఫండ్‌ను నిర్వహించే థ్రిఫ్ట్ సేవింగ్స్ ప్లాన్ సంస్థ .. ఇన్వెస్ట్ చేసే విదేశీ స్టాక్స్ జాబితా నుంచి చైనా కంపెనీలను తప్పించడంలోనూ ట్రంప్ ప్రస్తుతానికి సఫలమయ్యారు. ఇది దాదాపు 500 బిలియన్ డాలర్ల నిధిని నిర్వహిస్తోంది. తమ ఇన్వెస్టర్లకు కొత్తగా అంతర్జాతీయ స్టాక్స్‌లో కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో 50 బిలియన్ డాలర్ల ఇంటర్నేషనల్ ఫండ్ పథకం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన విదేశీ స్టాక్స్ జాబితాలో చైనా కంపెనీలు లేకుండా చూసేలా ట్రంప్ ఒత్తిడి తెచ్చారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దాదాపు 170 చైనా కంపెనీలు.. అమెరికాలోని నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల్లో దాదాపు 170 చైనా కంపెనీలు లిస్టయి ఉన్నాయి. చైనా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తూ అమెరికాలో లిస్టయిన భారీ కంపెనీలు పదికి పైగా ఉన్నాయి. పెట్రోచైనా, చైనా లైఫ్, చైనా టెలికం, చైనా ఈస్టర్న్, చైనా సదరన్, హువానెంగ్ పవర్, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ చైనా, చైనా పెట్రోలియం ఈ జాబితాలో ఉన్నాయి. ఇక టెక్ దిగ్గజాల్లో బైదు, ఆలీబాబా, పిన్‌డువోడువో, జేడీడాట్‌కామ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్, బైదు, జేడీడాట్‌కామ్ సంస్థల సంయుక్త మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది. -
సెన్సెక్స్ 75 పాయింట్లు అప్...
ఫార్మా షేర్ల దన్ను - 28,298కు సెన్సెక్స్ - 21 పాయింట్ల లాభంతో 8,589కు నిప్టీ ఫార్మా, వినియోగ వస్తువులు తయారు చేసే కంపెనీల షేర్ల ర్యాలీతో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటంతో బీఎస్ఈ సెన్సెక్స్ 75 పాయింట్ల లాభంతో 28,298 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 8,589 పాయింట్ల వద్ద ముగిశాయి. చైనా మార్కెట్ల పతనం, ముడి చమురు ధరలు క్షీణిస్తుండడం, ఈపీఎఫ్ఓ స్టాక్ మార్కెట్ ఆరంగేట్రం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. కన్సూమర్ డ్యూరబుల్స్, ఫార్మా షేర్లతో పాటు క్యాపిటల్ గూడ్స్,వాహన, బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కంటే భారత స్టాక్ మార్కెట్ మంచి పనితీరు కనబరుస్తోందని జియోజిత్ బీఎన్పీ పారిబా అభిప్రాయపడింది. ఆల్‌టైమ్ హైని తాకిన డాక్టర్ రెడ్డీస్.. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ఆమ్జెన్తో మార్కెటింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ 1.7 శాతం వృద్ధితో రూ.4,270కు ఎగసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి(రూ.4,325)ను తాకింది. కాగా 30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు లాభపడ్డాయి.