సెన్సెక్స్ 75 పాయింట్లు అప్...
ఫార్మా షేర్ల దన్ను
- 28,298కు సెన్సెక్స్
- 21 పాయింట్ల లాభంతో 8,589కు నిప్టీ
ఫార్మా, వినియోగ వస్తువులు తయారు చేసే కంపెనీల షేర్ల ర్యాలీతో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 75 పాయింట్ల లాభంతో 28,298 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 8,589 పాయింట్ల వద్ద ముగిశాయి. చైనా మార్కెట్ల పతనం, ముడి చమురు ధరలు క్షీణిస్తుండడం, ఈపీఎఫ్‌ఓ స్టాక్ మార్కెట్ ఆరంగేట్రం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. కన్సూమర్ డ్యూరబుల్స్, ఫార్మా షేర్లతో పాటు క్యాపిటల్ గూడ్స్,వాహన, బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కంటే భారత స్టాక్ మార్కెట్ మంచి పనితీరు కనబరుస్తోందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా అభిప్రాయపడింది.
ఆల్‌టైమ్ హైని తాకిన డాక్టర్ రెడ్డీస్..
అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ఆమ్‌జెన్‌తో మార్కెటింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ 1.7 శాతం వృద్ధితో రూ.4,270కు ఎగసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి(రూ.4,325)ను తాకింది. కాగా 30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు లాభపడ్డాయి.