న్యూఢిల్లీ: భారత్ సేవలకు సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ గత పదిన్నర సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వేగాన్ని అక్టోబర్‌లో నమోదుచేసుకుంది. సెప్టెంబర్‌లో 55.2 వద్ద ఉన్న ఇండెక్స్ అక్టోబర్‌లో 58.4కు ఎగసింది. డిమాండ్, ఆర్థిక రికవరీకి ఇది సంకేతమని ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా వ్యాపార విశ్వాసం తగ్గినప్పటికీ, కొత్త వ్యాపారాల్లో గుర్తించదగిన పురోగతి కనిపిస్తోందని, కొత్త ఉద్యోగ కల్పనకూ ఇది దారితీసిందని ఆమె విశ్లేషించారు. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపు క్షీణతగా పరిగణిస్తారు. సెకండ్‌వేవ్ ఆంక్షల తొలగింపు నేపథ్యంలో గత మూడు నెలలుగా సూచీ 50 పైన కొనసాగడం గమనార్హం.
ముడి పదార్థాల ధరల భారం...
ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగడంతో, కంపెనీలు దాదాపు నాలుగున్నర సంవత్సరాలలో అత్యంత వేగంగా తమ ఫీజులను పెంచేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నట్లు పోలియానా డీ లిమా పేర్కొన్నారు. ఇంధనం, మెటీరియల్, రిటైల్, సిబ్బంది, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగినట్లు కంపెనీలు పేర్కొంటున్నాయని వెల్లడించారు. కాగా, నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు రాబోయే సంవత్సరంలో వృద్ధిని అడ్డుకోవచ్చని సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన చెందుతున్నారని, భవిష్యత్ వ్యాపార విశ్వాసంపై కొంత ప్రతికూల ధోరణి ఉందని ఆమె పేర్కొన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో భారత్ సేవలకు అంతర్జాతీయ డిమాండ్ బలహీనంగా కొనసాగుతోందని ఆమె తెలిపారు.
సేవలు–తయారీ కలిపినా దూకుడే...
కాగా సేవలు–తయారీ రంగాలు కలిపిన కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సెప్టెంబర్‌లో 55.3 వద్ద ఉంటే, అక్టోబర్‌లో 58.7కు ఎగసింది. 2012 తర్వాత పటిష్ట నెలవారీ విస్తరణను ఇది సూచిస్తోందని ఎకనమిస్ట్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. వరుసగా రెండవనెలా ప్రైవేటు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల సృష్టి జరిగింది. ఒక్క తయారీ రంగాన్ని చూసినా మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. ఎకానమీ రికవరీ సంకేతాలను సూచిస్తూ అక్టోబర్ ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 55.9గా నమోదయ్యింది. ఇది సెప్టెంబర్‌లో 53.7 వద్ద ఉంది. ఫిబ్రవరి తర్వాత ఎకానమీ గణాంకాలు గణనీయంగా మెరుగుపడినట్లు తమ సర్వేద్వారా వెల్లడవుతున్నట్లు ఎకనమిస్ట్ పాలీయానా డీ లిమా పేర్కొన్నారు.
సేవల రంగం.. సూపర్ స్పీడ్!
Published Thu, Nov 4 2021 12:58 AM | Last Updated on Thu, Nov 4 2021 1:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment