PMI output index
-
ద్రవ్యోల్బణ సవాళ్లలోనూ జోరుమీదున్న తయారీ రంగం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం సవాళ్లలోనూ 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో తయారీ రంగం దూసుకుపోయింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్‌లో 54.7గా నమోదయ్యింది. సూచీ మార్చిలో 54 వద్ద ఉంది. ఉత్పత్తి, ఫ్యాక్టరీ ఆర్డర్లు, అంతర్జాతీయ అమ్మకాల్లో పురోగతి వంటి అంశాలు సమీక్షా నెల ఏప్రిల్‌లో సూచీ స్పీడ్‌కు కారణమయ్యింది. కరోనా సంబంధ పరిమితులు, ఆంక్షలు సడలింపు కూడీ సూచీ పురోగతికి దోహదపడింది. సూచీ 50 పైనుంటే వృద్ధి సంకేతంగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. సానుకూలత కనబడుతోంది... భారతీయ తయారీ సూచీ ఏప్రిల్‌లో సానుకూలంగా ఉందని ఎస్అండ్పీ గ్లోబల్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియన్నా డి లిమా పేర్కొన్నారు. కర్మాగారాల ఉత్పత్తి వేగం పెరిగిందని తెలిపారు. అమ్మకాలు, ముడి పదార్థాల కొనుగోలులో కొనసాగుతున్న పెరుగుదల వృద్ధిని సూచిస్తోందని, సమీప కాలంలో నిలదొక్కుకుంటుందని భావిస్తున్నామని ఆమె అన్నారు. గణాంకాల ప్రకారం, ఎగుమతుల ఆర్డర్లు కూడా పుంజుకున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరిగాయి. కమోడిటీ ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. కాగా, ఉపాధి అవకాశాలు మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయి. వ్యాపార విశ్వాస కొంత మెరుగుపడింది. అయితే ఆర్థిక పరిస్థితులు, డిమాండ్ పుంజుకుంటాయని కొన్ని సంస్థలు అభిప్రాయపడుతుండగా, అవుట్‌లుక్‌ను ఊహించడం ఇంకా కష్టంగానే ఉందని మరికొన్ని సంస్థలు భావిస్తుండడం గమనార్హం. -
సేవల రంగం.. సూపర్ స్పీడ్!
న్యూఢిల్లీ: భారత్ సేవలకు సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ గత పదిన్నర సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వేగాన్ని అక్టోబర్‌లో నమోదుచేసుకుంది. సెప్టెంబర్‌లో 55.2 వద్ద ఉన్న ఇండెక్స్ అక్టోబర్‌లో 58.4కు ఎగసింది. డిమాండ్, ఆర్థిక రికవరీకి ఇది సంకేతమని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా వ్యాపార విశ్వాసం తగ్గినప్పటికీ, కొత్త వ్యాపారాల్లో గుర్తించదగిన పురోగతి కనిపిస్తోందని, కొత్త ఉద్యోగ కల్పనకూ ఇది దారితీసిందని ఆమె విశ్లేషించారు. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపు క్షీణతగా పరిగణిస్తారు. సెకండ్‌వేవ్ ఆంక్షల తొలగింపు నేపథ్యంలో గత మూడు నెలలుగా సూచీ 50 పైన కొనసాగడం గమనార్హం. ముడి పదార్థాల ధరల భారం... ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగడంతో, కంపెనీలు దాదాపు నాలుగున్నర సంవత్సరాలలో అత్యంత వేగంగా తమ ఫీజులను పెంచేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నట్లు పోలియానా డీ లిమా పేర్కొన్నారు. ఇంధనం, మెటీరియల్, రిటైల్, సిబ్బంది, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగినట్లు కంపెనీలు పేర్కొంటున్నాయని వెల్లడించారు. కాగా, నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు రాబోయే సంవత్సరంలో వృద్ధిని అడ్డుకోవచ్చని సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన చెందుతున్నారని, భవిష్యత్ వ్యాపార విశ్వాసంపై కొంత ప్రతికూల ధోరణి ఉందని ఆమె పేర్కొన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో భారత్ సేవలకు అంతర్జాతీయ డిమాండ్ బలహీనంగా కొనసాగుతోందని ఆమె తెలిపారు. సేవలు–తయారీ కలిపినా దూకుడే... కాగా సేవలు–తయారీ రంగాలు కలిపిన కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సెప్టెంబర్‌లో 55.3 వద్ద ఉంటే, అక్టోబర్‌లో 58.7కు ఎగసింది. 2012 తర్వాత పటిష్ట నెలవారీ విస్తరణను ఇది సూచిస్తోందని ఎకనమిస్ట్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. వరుసగా రెండవనెలా ప్రైవేటు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల సృష్టి జరిగింది. ఒక్క తయారీ రంగాన్ని చూసినా మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. ఎకానమీ రికవరీ సంకేతాలను సూచిస్తూ అక్టోబర్ ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 55.9గా నమోదయ్యింది. ఇది సెప్టెంబర్‌లో 53.7 వద్ద ఉంది. ఫిబ్రవరి తర్వాత ఎకానమీ గణాంకాలు గణనీయంగా మెరుగుపడినట్లు తమ సర్వేద్వారా వెల్లడవుతున్నట్లు ఎకనమిస్ట్ పాలీయానా డీ లిమా పేర్కొన్నారు. -
లాక్డౌన్ ఎఫెక్ట్ : పీఎంఐ రికార్డు కనిష్టం
సాక్షి, ముంబై: కరోనా వైరస్, దేశవ్యాప్త లాక్డౌన్ తయారీ రంగంపై తీవ్ర ప్రభావాన్నిచూపింది. ఏప్రిల్ మాసంలో మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. లాక్డౌన్ కారణంగా తయారీ, ఇతర సేవల రంగాలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో భారత్ తయారీ రంగ యాక్టివిటి ఏప్రిల్‌లో రికార్డు కనిష్ట పతనాన్ని చవిచూసింది. పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఏప్రిల్‌లో 27.4గా నమోదైంది. ఇది గత నెల (మార్చి)లో 51.8గా ఉంది. కోవిడ్-19 కట్టడిలో భాగంగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపుతో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడం ఇందుకు కారణమైనట్లు పీఎంఐ సర్వే తెలిపింది. అంతేకాదు 15 సంవత్సరాల క్రితం ఐహెచ్ఎస్ మార్కిట్ డేటాను రికార్డ్ చేయడం ప్రారంభించినప్పటి నుండి భారత్ పీఎంఐ డాటా ఇంత స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. జనవరిలో ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 55.3 కంటే చాలా తక్కువ. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా లాక్డౌన్, ఎగుమతి ఆర్డర్ల పతనంతో పాటు ఉత్పాదక ఉత్పత్తిలో అపూర్వమైన సంకోచానికి దారితీసిందని సోమవారం విడుదల చేసిన నెలవారీ నిక్కీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) సర్వే తెలిపింది. తగ్గిన డిమాండ్ ఏప్రిల్‌లో కొత్త వ్యాపారాలు రికార్డు స్థాయిలో కుప్పకూలిపోయాయని, సంస్థలు తమ సిబ్బంది సంఖ్యను బాగా తగ్గించాయని సర్వే వెల్లడించింది. వచ్చే 12 నెలల కాలానికి వ్యాపార సెంటిమెంట్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ, మార్చిలో ఇటీవలి కనిష్ట స్థాయి నుండిపెరిగింది. దీంతో కోవిడ్-19 ఉపశమించి, లాక్డౌన్ పరిమితులు సడలించిన తరువాత డిమాండ్ తిరిగి పుంజుకుంటుందనే ఆశా భావం వ్యక్తమవుతోంది. కాగా కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగాలాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలైనాయి. ప్రస్తుతం మూడవ దశ లాక్ డౌన్ మే 17వ తేదీవరకు కొనసాగనుంది. అయితే ఇప్పటివరకు అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు, వ్యాపార కార్యక్రమాలు నిలిచిపోయాయి. తయారీ ప్లాంట్లు మూత పడ్డాయి. దీంతో ఆటో కంపెనీల విక్రయాలు శూన్యంగా మిగిలాయి. ప్రస్తుతం కొన్ని ఆంక్షలతో కొన్ని సేవలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. -
ఏప్రిల్ లో ప్రైవేటు రంగం పేలవం..
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగం ఏప్రిల్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ పేర్కొంది. భారత్ తయారీ, సేవల రంగాలకు సంబంధించిన సూచీ మార్చిలో 37 నెలల గరిష్ట స్థాయిలో 54.3 పాయింట్ల వద్ద ఉంటే... ఏప్రిల్‌లో 52.8 పాయింట్లకు పడింది. కొత్త వ్యాపారాల విస్తరణ జాప్యం, సేవలు, తయారీ రంగాల్లో మందగమనం వంటి అంశాలు దీనికి కారణంగా పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గింపునకు ఇది తగిన సమయమని కూడా పేర్కొంది. ఒక్క తయారీ రంగం ఏప్రిల్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు నికాయ్/మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఇప్పటికే పేర్కొంది. మార్చిలో 52.4 పాయింట్ల వద్ద ఉన్న సూచీ... ఏప్రిల్‌లో 50.5కి పడింది. కొత్త ఆర్డర్లు పెద్దగా లేకపోవడం, ముడి ఉత్పత్తుల ధరల పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణం. కాగా పాయింట్లు 50పైన ఉంటే... దాన్ని వృద్ధిగా పరిగణిస్తారు. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు.