ఏప్రిల్ లో ప్రైవేటు రంగం పేలవం..
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగం ఏప్రిల్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ పేర్కొంది. భారత్ తయారీ, సేవల రంగాలకు సంబంధించిన సూచీ మార్చిలో 37 నెలల గరిష్ట స్థాయిలో 54.3 పాయింట్ల వద్ద ఉంటే... ఏప్రిల్‌లో 52.8 పాయింట్లకు పడింది. కొత్త వ్యాపారాల విస్తరణ జాప్యం, సేవలు, తయారీ రంగాల్లో మందగమనం వంటి అంశాలు దీనికి కారణంగా పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గింపునకు ఇది తగిన సమయమని కూడా పేర్కొంది.
ఒక్క తయారీ రంగం ఏప్రిల్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు నికాయ్/మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఇప్పటికే పేర్కొంది. మార్చిలో 52.4 పాయింట్ల వద్ద ఉన్న సూచీ... ఏప్రిల్‌లో 50.5కి పడింది. కొత్త ఆర్డర్లు పెద్దగా లేకపోవడం, ముడి ఉత్పత్తుల ధరల పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణం. కాగా పాయింట్లు 50పైన ఉంటే... దాన్ని వృద్ధిగా పరిగణిస్తారు. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు.