సాక్షి, ముంబై: కరోనా వైరస్, దేశవ్యాప్త లాక్‌డౌన్ తయారీ రంగంపై తీవ్ర ప్రభావాన్నిచూపింది. ఏప్రిల్ మాసంలో మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. లాక్‌డౌన్ కారణంగా తయారీ, ఇతర సేవల రంగాలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో భారత్ తయారీ రంగ యాక్టివిటి ఏప్రిల్‌లో రికార్డు కనిష్ట పతనాన్ని చవిచూసింది. పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఏప్రిల్‌లో 27.4గా నమోదైంది. ఇది గత నెల (మార్చి)లో 51.8గా ఉంది. కోవిడ్-19 కట్టడిలో భాగంగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపుతో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడం ఇందుకు కారణమైనట్లు పీఎంఐ సర్వే తెలిపింది. అంతేకాదు 15 సంవత్సరాల క్రితం ఐహెచ్ఎస్ మార్కిట్ డేటాను రికార్డ్ చేయడం ప్రారంభించినప్పటి నుండి భారత్ పీఎంఐ డాటా ఇంత స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. జనవరిలో ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 55.3 కంటే చాలా తక్కువ.
ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్, ఎగుమతి ఆర్డర్‌ల పతనంతో పాటు ఉత్పాదక ఉత్పత్తిలో అపూర్వమైన సంకోచానికి దారితీసిందని సోమవారం విడుదల చేసిన నెలవారీ నిక్కీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) సర్వే తెలిపింది. తగ్గిన డిమాండ్ ఏప్రిల్‌లో కొత్త వ్యాపారాలు రికార్డు స్థాయిలో కుప్పకూలిపోయాయని, సంస్థలు తమ సిబ్బంది సంఖ్యను బాగా తగ్గించాయని సర్వే వెల్లడించింది. వచ్చే 12 నెలల కాలానికి వ్యాపార సెంటిమెంట్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ, మార్చిలో ఇటీవలి కనిష్ట స్థాయి నుండిపెరిగింది. దీంతో కోవిడ్-19 ఉపశమించి, లాక్‌డౌన్ పరిమితులు సడలించిన తరువాత డిమాండ్ తిరిగి పుంజుకుంటుందనే ఆశా భావం వ్యక్తమవుతోంది.
కాగా కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగాలాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలైనాయి. ప్రస్తుతం మూడవ దశ లాక్ డౌన్ మే 17వ తేదీవరకు కొనసాగనుంది. అయితే ఇప్పటివరకు అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు, వ్యాపార కార్యక్రమాలు నిలిచిపోయాయి. తయారీ ప్లాంట్లు మూత పడ్డాయి. దీంతో ఆటో కంపెనీల విక్రయాలు శూన్యంగా మిగిలాయి. ప్రస్తుతం కొన్ని ఆంక్షలతో కొన్ని సేవలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment