అగ్రశ్రేణి కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ  | Telangana Government Conducts Diplomatic Outreach Programme: KTR | Sakshi
Sakshi News home page

అగ్రశ్రేణి కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ 

Published Sat, Aug 20 2022 12:18 AM | Last Updated on Sat, Aug 20 2022 10:31 AM

Telangana Government Conducts Diplomatic Outreach Programme: KTR - Sakshi

డిప్లొమాట్‌ ఔట్‌రీచ్‌ కార్యక్రమంలో వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలతో మంత్రి కేటీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం, పారదర్శకమైన ప్రభుత్వ పాలసీలతోపాటు దేశంలోనే అత్యుత్తమ వాతావరణం తెలంగాణ సొంతమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల్లో గత ఎనిమిదేళ్లుగా నమోదైన ప్రగతితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, ప్రోత్సాహకాలతో ఐటీ, లైఫ్‌ సైన్సెస్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు చెందిన ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకున్నాయన్నారు.

తెలంగాణకు భారీ పెట్టుబడులను రప్పించడం లక్ష్యంగా మంత్రి కేటీ ఆర్‌ శుక్రవారం ‘డిప్లొమాట్‌ ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌’ను నిర్వహించారు. టీ–హబ్‌ 2.0లో జరిగిన ఈ సమావేశానికి సుమారు 50 దేశాలకు చెందిన రాయబారు లు, ప్రతినిధులు, కాన్సుల్‌ జనరల్స్, గౌరవ కాన్సు ల్‌ జనరల్స్, హైకమిషనర్లు, ట్రేడ్‌ కమిషనర్లు హాజరయ్యారు. తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంపై కేటీఆర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వివరించారు.

తెలంగాణ పెట్టుబడుల సలహాదారు (టియా) పేరిట రూపొందించిన వర్చువల్‌ మస్కట్, చాట్‌ బాట్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కేటీఆర్‌ ప్రజెంటేషన్‌ అనంతరం విదేశాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దౌత్యవేత్తలు, దౌత్యాధికారులు టీ హబ్‌ ప్రాంగణాన్ని పరిశీలించి వివిధ స్టార్టప్‌ల ప్రతినిధులతో మాట్లాడారు.

ప్రభుత్వ చొరవతో ప్రారంభమైన టీ–హబ్, టీ–వర్క్స్, టీఎస్‌ఐసీ, టాస్క్‌ సంస్థల లక్ష్యాలు, పనితీరును దౌత్యవేత్తలు ప్రశంసించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, టీ–హబ్‌ సీఈఓ ఎం శ్రీనివాస్‌రావు, పరిశ్రమలు, ఐటీ శాఖకు చెందిన వివిధ విభాగాల డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement