రైతు ఆదాయం రెట్టింపులో మోదీ విఫలం  | Telangana Minister KTR Comments On PM Narendra Modi | Sakshi
Sakshi News home page

రైతు ఆదాయం రెట్టింపులో మోదీ విఫలం 

Published Fri, May 6 2022 2:20 AM | Last Updated on Fri, May 6 2022 3:21 PM

Telangana Minister KTR Comments On PM Narendra Modi - Sakshi

ములుగు ఫల పరిశోధన కేంద్రంలో మామిడి కాయలను పరిశీలిస్తున్న కేటీఆర్, సబిత 

సాక్షి, హైదరాబాద్‌: రైతు ఆదాయాన్ని 2022కల్లా రెట్టింపు చేస్తామన్న హామీని సాకారం చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఐటీ, మున్సిపల్‌ శాఖ మం త్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. రైతుల ఆదాయం రెట్టింపు ఒక్క చైనాలోనే సాధ్యమైందని, మరెక్కడా సాధ్యం కాలేదని చెప్పారు. 1987లో చైనా–భారత్‌ జీడీపీ సమానంగా ఉండగా, 35 ఏళ్లలో చైనా 16 ట్రిలియన్‌ డాలర్లకు చేరగా, భారత్‌ 3 ట్రిలియన్‌ డాలర్ల వద్దే ఉందని పేర్కొన్నారు.

సాగులో రైతుకు ఆదాయం ఎలా వస్తుందో ఆలోచన చేయాలని.. చైనా, ఇజ్రాయెల్‌లో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లా ములుగు ఆచార్య కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన విధానాలపై జరిగిన కేబినెట్‌ సబ్‌ కమిటీ రెండో సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.

తెలంగాణలో వరి మళ్లలో చేపలు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, ఈ దిశగా ప్రయత్నించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ‘వ్యవసాయానికి ఆధునికతను జోడిస్తే యువత ఈ దిశగా మళ్లే అవకాశం ఉంది.  కొత్త తరం ఎందుకో వ్యవసాయానికి దగ్గర కావడం లేదు. పాత, కొత్త అనుభవాలతో కొత్త విధానం తెచ్చి యువ తను ఆకర్షించాలి’ అని చెప్పారు. రాష్ట్రంలో 32 జిల్లాల్లో ప్రతి చోటా 25 ఎకరాల్లో రైతు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, కొత్త తరానికి వ్యవసాయాన్ని పరిచయం చేయాలని కోరారు.

ఫసల్‌ బీమాకు ప్రత్యామ్నాయంగా పంటలు యూనిట్‌గా బీమా కంపెనీలతో మాట్లాడి శాస్త్రీయంగా కొత్త విధానం తీసుకురావాలని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గం గుల కమలాకర్, వేముల ప్రశాంత్‌ రెడ్డి, పు వ్వాడ అజయ్‌ కుమార్, ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. 

ఉబర్, ఓలా తరహా సేవలు..
వ్యవసాయ యాంత్రీకరణలో ఉబర్, ఓలా తరహా సేవలు అందిస్తే అది విప్లవాత్మక మార్పునకు నాంది అవుతుందని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఉబర్, ఓలా కార్లు, బైకులు నడుపుతూ లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, వ్యవసాయ రంగంలో ఈ తరహా సేవలు అందుబాటులోకి రావాలని చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ, యాసంగిలో ధాన్యంలో నూక శాతం తగ్గే వంగడాలను రూపొందించాలన్నారు. 

ములుగు పరిశోధన కేంద్రం భేష్‌ 
ములుగు(గజ్వేల్‌): ఉద్యాన రంగంలో పరిశోధనలకు కీలకమైన ములుగు ఉద్యాన కళాశాలలోని ఫల పరిశోధన కేంద్రాన్ని కేబినెట్‌ సబ్‌కమిటీ గురువారం సందర్శించింది. ఈ కేంద్రం పనితీరు బాగుందని, ఇక్కడ ఫల వృక్షాల వృద్ధి బాగుందని కేబినెట్‌ సబ్‌కమిటీ ప్రశంసించింది.  అనంతరం వారు ఆయిల్‌పామ్‌ మొక్కలను నాటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement