global stock market
-
ధరలు, ప్రపంచ పరిస్థితులు కీలకం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వస్తున్న నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు ఇతర అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ప్రధానంగా ద్రవ్యోల్బణ గణాంకాలు, ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు ప్రభావం చూపనున్నట్లు పేర్కొన్నారు. వీటితోపాటు యూఎస్ రిటైల్ సేల్స్, యూకే జీడీపీ గణాంకాలు తదితరాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. ఇతర వివరాలు చూద్దాం.. క్యూ3 ఫలితాలకు రెడీ ఇప్పటికే అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాల సీజన్ ముగింపునకు వచ్చింది. ఈ బాటలో మరికొన్ని కంపెనీలు క్యూ3 పనితీరు ప్రకటించనున్నాయి. జాబితాలో ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, వొడాఫోన్ ఐడియా, సెయిల్, నాల్కో, లుమాక్స్, అపోలో హాస్పిటల్స్, అశోకా బిల్డ్‌కాన్, అవంతీ ఫీడ్స్, రెయిన్బో చి్రల్డన్స్, బిర్లా కేబుల్, బామర్‌లారీ, బాటా, ఎస్కార్ట్స్, గలక్సీ సర్ఫక్టేంట్స్, జిలెట్ తదితరాలున్నట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. 12న గణాంకాలు బుధవారం(12న) జనవరి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ), డిసెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐసీ) గణాంకాలు వెలువడనున్నాయి. డిసెంబర్లో సీపీఐ 5.22 శాతంగా నమోదైంది. ఇక నవంబర్‌లో ఐఐపీ 3.5 శాతం వృద్ధిని చూపింది. ఈ బాటలో జనవరి నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) గణాంకాలు 14న విడుదలకానున్నాయి. డిసెంబర్లో డబ్ల్యూపీఐ 2.37 శాతంగా నమోదైంది. ఇదే విధంగా జనవరి వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. డిసెంబర్లో వాణిజ్య లోటు 21.94 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయంగా యూఎస్ రిటైల్ అమ్మకాలు, ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగం, యూకే జీడీపీ గణాంకాలూ కీలకంగా నిలవనున్నట్లు సింఘానియా తెలియజేశారు. ఫెడ్ గత పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా 4.25–4.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇవికాకుండా డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) తీరు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు వివరించారు. గత వారమిలా గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు(0.5 శాతం) బలపడి 77,860 వద్ద ముగిసిది. నిఫ్టీ 78 పాయింట్లు(0.3%) పుంజుకుని 23,560 వద్ద స్థిరపడింది. చివరికి ఢిల్లీ కోటలో పాగా దాదాపు మూడు దశాబ్దాల తదుపరి మళ్లీ న్యూఢిల్లీ కోటలో బీజేపీ పాగా వేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ దశాబ్ద కాలం పాలనకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెక్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల బాటలో రాష్ట్రంలోనూ సీట్లు సాధించడంతో స్థానికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో స్టాక్ మార్కెట్లలో స్వల్ప కాలానికి సెంటిమెంటు బలపడనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొన్నారు. ప్రో త్సాహకర బడ్జెట్, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత దీనికి జత కలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. అమ్మకాలు వీడని ఎఫ్‌పీఐలు ఇటీవల దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత వారం సైతం ఇదే బాటలో సాగారు. ఫిబ్రవరి తొలి వారంలో నికరంగా రూ. 7,300 కోట్ల(84 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. జనవరిలోనూ ఎఫ్‌పీఐలు నగదు విభాగంలో రూ. 78,027 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే అంతకుముందు అంటే డిసెంబర్ మధ్యలో అమ్మకాలను వీడి కొనుగోళ్లు చేపట్టారు. దీంతో 2024 చివరి నెలలో నికరంగా రూ. 15,446 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
బ్యాంక్.. క్రాష్
ఉన్నట్టుండి యూఎస్ సంస్థ సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ)ను మూసివేయడంతో మరోసారి ప్రపంచ స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. దీంతో యూరప్, ఆసియాసహా దేశీయంగానూ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణించగా.. ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ 5 నెలల కనిష్టాలకు చేరాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 897 పాయింట్లు కోల్పోయి 58,238 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 259 పాయింట్లు దిగజారి 17,154 వద్ద ముగిసింది. ఇది ఐదు నెలల కనిష్టంకాగా.. ఒక దశలో సెన్సెక్స్ 1,040 పాయింట్లు పడిపోయి 58,095 దిగువకు చేరింది. నిఫ్టీ 300 పాయింట్లు క్షీణించి 17,113ను తాకింది. 2008 ఆర్థిక సంక్షోభం తదుపరి యూఎస్‌లో తిరిగి ఒక పెద్ద బ్యాంకు దివాలా స్థితికి చేరడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సిల్వర్‌గేట్ క్యాపిటల్ కార్ప్ ఇప్పటికే మూతపడటానికితోడు సిగ్నేచర్ బ్యాంక్‌లో సంక్షోభం సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలిపారు. కాగా.. తొలుత మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 375 పాయింట్లు ఎగసి 59,511కు చేరింది. తదుపరి అమ్మకాలతో పట్టుతప్పి ఆ స్థాయి నుంచి మధ్యాహ్నానికల్లా 1,416 పాయింట్లు జారింది. మార్కెట్ పతనం నేపథ్యంలో సోమవారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 4.43 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. రూ. 2,58,56,296 కోట్లకు పరిమితమైంది. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. బ్యాంకింగ్, మీడియా, ఆటో 2.5 శాతం చొప్పున నష్టపోయాయి. రియల్టీ, ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ గ్యాస్ 2–1 శాతం మధ్య నీరసించాయి. సెన్సెక్స్‌లో కేవలం టెక్ మహీంద్రా(7%) జంప్‌చేయగా.. నిఫ్టీలో అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ఓఎన్జీసీ సైతం నిలదొక్కుకున్నాయి. అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ 7% కుప్పకూలింది. ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, ఐషర్, యాక్సిస్, బజాజ్ ఫిన్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరోమోటో, గ్రాసిమ్, అల్ట్రాటెక్, ఐసీఐసీఐ, టైటాన్, ఆర్ఐఎల్ 3–1.5% మధ్య క్షీణించాయి. యస్ బ్యాంక్ డౌన్ మూడేళ్ల లాకిన్ గడువు ముగియడంతో సోమవారం యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. తొలుత 13% క్షీణించి రూ.14.4కు చేరింది. చివరికి 5.3% నష్టంతో రూ.15.65 వద్ద క్లోజైంది. విదేశీ బ్యాంకులు వెలవెల.. ఎస్వీబీ వైఫల్యం నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌లో పలు బ్యాంకింగ్ స్టాక్స్ కుప్పకూలాయి. రీజనల్ బ్యాంకు స్టాక్స్‌లో వెస్టర్న్ అలయెన్స్ 75 శాతం, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ 65 శాతం, పాక్‌వెస్ట్ బ్యాంక్‌కార్ప్ 46 శాతం చొప్పున పడిపోయాయి. ఇక యూరోపియన్, అమెరికన్ దిగ్గజాలలో క్రెడిట్ స్వీస్, డాయిష్ బ్యాంక్, యూబీఎస్, బార్క్లేస్, ఐఎన్జీ, లాయిడ్స్, హెచ్ఎస్బీసీ 8–3 శాతం మధ్య క్షీణించాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్‌ఫార్గో, సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, గోల్డ్‌మన్ శాక్స్ 6–3 శాతం మధ్య డీలాపడ్డాయి. పసిడి జోరు బ్యాంకింగ్ వ్యవస్థపై భయాలతో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి గిరాకీ పెరిగింది. దీంతో కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 2.4 శాతంపైగా(44 డాలర్లు) ఎగసి 1,911 డాలర్లను అధిగమించింది. దేశీయంగా(న్యూఢిల్లీ) 10 గ్రాముల ధర రూ. 970 బలపడి రూ. 56,550ను తాకింది. వెండి సైతం కేజీ రూ. 1,600 పుంజుకుని రూ. 63,820కు చేరింది. అయితే యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ క్షీణించాయి. పదేళ్ల బాండ్ల ఈల్డ్ 3.7 శాతం నుంచి 3.46 శాతానికి, రెండేళ్ల బాండ్ల ఈల్డ్ 3.7 శాతం నుంచి 3.46 శాతానికి నీరసించింది. ఫెడ్ చైర్మన్ పావెల్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలివ్వగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేట్లలో అత్యవసర కోతలు అవసరమంటూ కొంతమంది ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. -
గ్లోబల్ మార్కెట్ల దెబ్బ : భారీ నష్టాలు
ముంబై : అమెరికా స్టాక్‌మార్కెట్లు ఇచ్చిన దెబ్బకు సెషన్ ప్రారంభంలో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ సూచీలు... చివరి వరకు ఆ నష్టాల కొనసాగిస్తూ వచ్చాయి. మధ్యలో కొంత కోలుకుని నష్టాలు తగ్గించుకున్నప్పటికీ, చివరికి మాత్రం మళ్లీ భారీ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 407 పాయింట్లు కుదేలై 34,005 వద్ద, నిఫ్టీ 122 పాయింట్ల నష్టంలో 10,454 వద్ద క్లోజయ్యాయి. ఫిబ్రవరి 1 ముగింపు నుంచి ఇప్పటి వరకు సెన్సెక్స్ 5.7 శాతం పతనమై భారీగా నష్టాలను మూటకట్టుకుంది. అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడ్ వడ్డీరేట్లను పెంచబోతుందనే భయాందోళనతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. డోజోన్స్ పతనం మార్కెట్లలో ప్రకంపనాలను సృష్టిస్తోంది. అటు ఆసియన్ మార్కెట్లు కూడా భారీగానే నష్టాలు పాలయ్యాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్మార్కెట్లపై విపరీతంగా పడుతోంది. రోజంతా సెన్సెక్స్ 34వేల మైలురాయి దిగువనే ట్రేడవడం గమనార్హం. చివరికి మాత్రమే 34వేల పైన 5 పాయింట్ల తేడాలో ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ స్వల్పంగా 0.3 శాతం లాభాలు పండించింది. ఎన్ఎస్ఈలో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోగా.. మెటల్ మాత్రమే 1.3 శాతం మెరిసింది. బ్యాంకు నిఫ్టీ దాదాపు 2 శాతం, ఆటో, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ 1 శాతం నుంచి 0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా 12 పైసలు బలహీనపడి 64.38 గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 91 రూపాయల నష్టంలో రూ.30,016గా ఉన్నాయి. -
ఒక్కసారిగా 100 బిలియన్ డాలర్లు హుష్‌కాకి
వాషింగ్టన్ : గ్లోబల్ మార్కెట్ల పతనం ఇన్వెస్టర్లను దడదడలాడిస్తోంది. చిన్న చితకా ఇన్వెస్టర్ల నుంచి బడా ఇన్వెస్టర్ల వరకూ అందరూ ఈ తాటిని తట్టుకోలేక, భారీ మొత్తంలో సొమ్మును పోగొట్టుకుంటున్నారు. మూడు రోజుల కిందటి నుంచి అమెరికా స్టాక్ మార్కెట్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. నేడు కూడా మరోసారి ఢమాల్‌మన్నాయి. దీంతో ప్రపంచంలో అత్యంత ధనికవంతులు దాదాపు తమ నికర సంపద నుంచి సుమారు 100 బిలియన్ డాలర్ల(రూ.6,43,065 కోట్లకు పైగా) సంపదను కోల్పోయారు. వీరిలో 20 మంది అయితే ఏకంగా ఒక్కొక్కరు 1 బిలియన్ డాలర్ల మేర(రూ.6432 కోట్లను) పోగొట్టుకున్నారు. ప్రపంచంలో అత్యంత ధనికవంతుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 5.3 బిలియన్ డాలర్లు(రూ.34,092 కోట్లు) పడిపోయి 113.2 బిలియన్ డాలర్లు(రూ.7,28,045 కోట్లు)గా నమోదైందని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ వెల్లడించింది. స్టాక్‌మార్కెట్ల పతనంతో అమెజాన్.కామ్ ఇంక్ షేర్లు 4.7 శాతం పడిపోయాయి. బెర్క్‌షైర్ హాత్వే ఇంక్ చైర్మన్ వారెన్ బఫెట్ సంపద కూడా 3.5 బిలియన్ డాలర్లు, ఫేస్బుక్ ఇంక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంపద 3.4 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది. ఎలన్ మాస్క్ 1.1 బిలియన్ డాలర్లను కోల్పోయారు. అన్నింటి కంటే ఎక్కువగా టెస్లా షేర్లు 8.6 శాతం కుదేలయ్యాయి. కాగ, డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్‌లు నవంబర్ నాటి కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఫెడ్ వడ్డీరేట్లను పెంచబోతుందని అంచనాలు, ద్రవ్యోల్బణం పెరుగబోతుందనే అంచనాలు అమెరికా స్టాక్‌మార్కెట్లను పడగొడుతున్నాయి. అమెరికా స్టాక్మార్కెట్లో నెలకొన్న ఈ ముసలం ప్రపంచస్థాయి స్టాక్మార్కెట్లన్నింటిపై ప్రభావం చూపుతోంది. మన స్టాక్ మార్కెట్లలో ఒకటైన సెన్సెక్స్ కూడా ప్రారంభంలో 500 పాయింట్లకు పైగా పడిపోయింది. ప్రస్తుతం 445 పాయింట్ల నష్టంలో 33,967 వద్ద కొనసాగుతోంది. -
ఇన్వెస్టర్లకు బ్లాక్ ఫ్రైడే
♦ ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల సునామీ... ♦ ఇంట్రాడేలో 1,100 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ ♦ దేశీ సంస్థల కొనుగోళ్లతో కొంత కోలుకున్న భారత్ సూచీలు ముంబై: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలంటూ తాజా రెఫరెండంలో బ్రిటన్ ప్రజలు నిర్ణయించడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ సూచీలు పతనమయ్యాయి. బ్రిటన్ పౌండు, యూరోలతో సహా వర్ధమాన కరెన్సీలు దశాబ్దాల కనిష్టస్థాయికి పడిపోయాయి. సంక్షోభ సమయాల్లో సురక్షిత సాధనంగా పరిగణించే బంగారం రివ్వున ఎగిసింది. భారత్ సూచీలు ఇంట్రాడేలో దాదాపు 5 శాతం వరకూ పడిపోయాయి. బ్రెగ్జిట్ జరగకపోవచ్చంటూ సర్వేలు వెల్లడికావడంతో క్రితం రోజు 27,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించిన బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో 26,000 పాయింట్ల దిగువకు జారిపోయింది. 25,911 పాయింట్ల స్థాయికి పడిపోయిన సందర్భంలో దేశీయ సంస్థలు కనిష్టస్థాయి వద్ద లభ్యమవుతున్న షేర్లను కొనుగోలు చేయడం, బ్రెగ్జిట్తో మన ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం లేదంటూ కేంద్రం, ఆర్బీఐ భరోసానివ్వడంతో ముగింపులో సూచీలు కొంతవరకూ కోలుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 605 పాయింట్ల క్షీణతతో 26,398 పాయింట్ల వద్ద ముగిసింది. 7,927 పాయింట్ల స్థాయికి పడిపోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ముగింపులో కోలుకుని, 182 పాయింట్ల నష్టంతో 8,089 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ రెండు సూచీలు దాదాపు 2.25 శాతం క్షీణించాయి. టాటా గ్రూప్ షేర్లకు దెబ్బ... యూరప్, బ్రిటన్లలో వ్యాపారాలు చేస్తూ, అక్కడ్నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న కంపెనీల షేర్లు బాగా క్షీణించాయి. వాటిలో టాటా గ్రూప్‌నకు చెందిన టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్‌లు ఉన్నాయి. సెన్సెక్స్-30 షేర్లలో అత్యధికంగా టాటా మోటార్స్ 8.5 శాతం పడిపోగా, టాటా స్టీల్ 7 శాతం వరకూ నష్టపోయింది. ఇంట్రాడేలో ఈ రెండు షేర్లూ 11-12 శాతం వరకూ పతనమయ్యాయి. టాటా మోటార్స్‌కు బ్రిటన్‌లో లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ లాండ్రోవర్ ప్లాంటు, టాటా స్టీల్‌కు కోరస్ ప్లాంటు వున్న సంగతి తెలిసిందే. టీసీఎస్ 2.5 శాతం నష్టంతో ముగిసింది. టీసీఎస్‌కు యూరప్ నుంచి 15 శాతంపైగా ఆదాయం సమకూరుతుంది. ఇదే ప్రాంతంతో వ్యాపార సంబంధాలున్న టెక్ మహీంద్రా 5 శాతం, మెటల్ కంపెనీ వేదాంత సైతం 7 శాతం చొప్పున పడిపోయాయి. రూ.1.8 లక్షల కోట్ల సంపద నష్టం తాజా మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు రూ.1.8 లక్షల కోట్ల విలువైన సంపదను కోల్పోయారు. ఒకదశలో ఈ నష్టం రూ. 4 లక్షల కోట్లవరకూ చేరినప్పటికీ, ముగింపులో మార్కెట్ రికవరీ వల్ల నష్టాలు తగ్గాయి. మార్కెట్లో లిస్టయిన మొత్తం షేర్ల విలువ క్రితం రోజు రూ.101.38 లక్షల కోట్లు కాగా, గురువారం ఈ విలువ రూ. 99.60 లక్షల కోట్లకు తగ్గింది. జపాన్ నుంచి అమెరికా వరకూ ... బ్రెగ్జిట్ రిఫరెండం తొలి కౌంటింగ్ ఫలితాలు జపాన్ లో సూర్యుడు ఉదయించేసరికే వెల్లడికావడంతో ఆ దేశంలో మార్కెట్ ప్రకంపనలు మొదలయ్యాయి. ఆసియాలో అన్ని మార్కెట్లకంటే అధికంగా జపాన్ నికాయ్ సూచీ 7.92 శాతం పతనమయ్యింది. తూర్పున ఇతర ప్రధాన మార్కెట్లయిన ఆస్ట్రేలియా, కొరియా, తైవాన్, సింగపూర్, హాంకాంగ్ సూచీలు 2-3 శాతం మధ్య పడిపోయాయి. మన మార్కెట్లానే హాంకాంగ్ హాంగ్‌సెంగ్ ఇండెక్స్ సైతం 5 శాతంపైగా పతనమైనప్పటికీ, ముగింపులో కొంతవరకూ రికవరీ అయ్యింది. చైనా షాంఘై సూచి మాత్రం 1.3 శాతమే తగ్గింది. సంక్షోభానికి కేంద్ర బిందువైన బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ ఇండెక్స్ ఒకదశలో 8 శాతంపైగా పడి పోయింది. కానీ బ్రెగ్జిట్ కోసం అక్కడి ఆర్థిక సంస్థలు సంసిద్ధంగా వుండటంతో బ్రిటన్ మార్కెట్ నష్టాలు చివరకు 3 శాతానికి పరిమితయ్యాయి. జర్మనీ డాక్స్, ఫ్రాన్స్ కాక్ సూచీలు 6-8 శాతం మధ్య పడిపోయాయి. ఇక అమెరికా సూచీలు కడపటి సమాచారం అందేసరికి 2 శాతంపైగా నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రపంచంలో అన్నింటికంటే భారీగా గ్రీసు మార్కెట్ 14 శాతం పతనమయ్యింది. గ్రీసు కొద్ది సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. -
నాలుగు రోజుల లాభాలకు బ్రేక్
♦ అంతర్జాతీయ బలహీనతలకు తోడైన లాభాల స్వీకరణ ♦ సెన్సెక్స్‌కు 379 పాయింట్ల నష్టం ♦ 125 పాయింట్ల నష్టంతో 7,110కు నిఫ్టీ ముడి చమురు ధరలు మళ్లీ పతనం కావడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. అంతర్జాతీయ బలహీనతలకు లాభాల స్వీకరణ కూడా తోడవడంతో మంగళవారం మన స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. దీంతో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,200 పాయింట్ల మార్క్ దిగువకు పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 379 పాయింట్లు నష్టపోయి 23,410 పాయింట్ల వద్ద ఎన్ఎస్ఈ నిఫ్టీ 125 పాయింట్లు నష్టపోయి 7,110 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. ఆ మూడు షేర్లకూ నష్టం: ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 నుంచి వైదొలగనున్న మూడు షేర్లు-కెయిర్న్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, వేదాంత షేర్లు 4 శాతం వరకూ నష్టపోయాయి. ఏప్రిల్ 1 నుంచి నిఫ్టీ సూచీలో చేరనున్న ఆరబిందో ఫార్మా, భారతీ ఇన్ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్ (డీవీఆర్) ప్రారంభంలో మంచి లాభాలను సాధించాయి. చివరకు టాటా మోటార్స్ (డీవీఆర్) 2 శాతం, భారతీ ఇన్ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్‌లు స్వల్పంగా లాభపడగా, అరబిందో స్వల్పంగా నష్టపోయింది. సెబీ పరిశీలనలో 16 ఎన్ఎఫ్ఓలు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ బాగా ఉంటుండటంతో మ్యూచువల్ ఫండ్ సంస్థలు న్యూ ఫండ్ ఆఫర్లు(ఎన్ఎఫ్ఓ) జోరుగా జారీచేయనున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు 16 ఎన్ఎఫ్ఓల కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదాయ పత్రాలను దాఖలు చేశాయి.